బృహత్తర పథకం బుట్టదాఖలు..! | The financial burden on the fallacy ... | Sakshi
Sakshi News home page

బృహత్తర పథకం బుట్టదాఖలు..!

Mar 10 2016 1:05 AM | Updated on Oct 2 2018 5:51 PM

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరంభించిన బృహత్తర పథకాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అటకెక్కించింది.

ఆర్‌ఎంపీ, పీఎంపీల శిక్షణ లేనట్టే ..
టీడీపీ మేనిఫెస్టోలోని   మరో  అంశానికి చెల్లుచీటీ

  
 తెనాలి : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరంభించిన బృహత్తర పథకాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అటకెక్కించింది. పార్టీ మేనిఫెస్టోలో చేర్చి, రాష్ట్ర విభజన తర్వాత హామీనిచ్చినా కార్యాచరణ ప్రకటించికుండా తాత్సారం చేస్తూ పథకాన్ని తాజాగా అటకెక్కించింది. అలవిమానిన బడ్జెట్‌ను చూపుతూ ఆర్థిక శాఖ కొర్రీ వేయడంతో అమలుకు సాధ్యం కాదనే సాకుతో మంగళం పాడిన  సమాచారం తెలిసి గ్రామీణ వైద్యులు మండిపడుతున్నారు. అతి తక్కువ బడ్జెట్‌తో  కార్యాచరణ ప్రణాళికను తాము రూపొందిస్తామని, ప్రభుత్వం అమలు చేయాలని కోరుతున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలందిస్తున్న ఆర్‌ఎంపీ/ పీఎంపీలకు శాస్త్ర శిక్షణనిచ్చి సామాజిక వైద్య సహాయకులుగా (కమ్యూనిటీ పారామెడిక్స్)గా తీర్చిదిద్దాలని అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తలపోశారు. అంతకు పూర్వం వైద్యకళాశాలల విద్యార్థుల ఆందోళనకు తలొగ్గిన ప్రభుత్వం, ఆర్‌ఎంపీల పరీక్షల నిర్వహణను నిలిపివేయడంతో, కొత్తగా ఆర్‌ఎంపీల గుర్తింపునకు అవకాశం లేకుండాపోయింది. ఆధునిక వైద్యులు తొంగిచూడని ప్రాంతాలు, గ్రామాల్లో పేదలు వైద్యానికి ఆధారపడింది గ్రామీణ వైద్యులపైనే. ప్రభుత్వ వైద్యులు పల్లెల ముఖం చూడకుండా, గ్రామీణ వైద్యులకు చెక్ పెడితే, పేదలకు కనీస వైద్యం ఎలాగన్న ప్రశ్నకు జవాబుగా వైఎస్, 2008లో ఈ పథకానికి రూపకల్పన చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో పీఎంపీ/ఆర్‌ఎంపీలు లక్షకు పైగా ఉన్నారు. వీరిలో 51 వేల మందిని గుర్తించి వెయ్యి గంటల శిక్షణను ఏడాదిలో పూర్తిచేయాలని నిర్ణయించారు. పాఠ్యాంశాల బోధన, ప్రభుత్వ ఆస్పత్రుల్లో శిక్షణ, 100 గంటలు 104లో అనుభవం కల్పించాక అర్హత పరీక్ష నిర్విహ ంచి, ఉత్తీర్ణుల సేవలను 2012-13 నుంచి అధికారికంగా స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారిని  ‘కమ్యూనిటీ పారామెడిక్స్’ (సామాజిక వైద్య సహాయకులు)గా గుర్తించాలని నిర్దేశించింది. ప్రభుత్వ వైద్య పథకాల ప్రచారంలోనూ భాగస్తుల్ని చేయాలనుకున్నారు. వైద్యవిధాన పరిషత్, హెచ్‌ఎంఆర్‌ఐతో కలిసి ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్ బోర్డు 2009-10లో తొలి దశలో 22 శిక్షణ కేంద్రాలు ఆరంభించింది. 56 వేల దరఖాస్తులు రావడంతో కేంద్రాలను 37కు పెంచారు.

డాక్టర్ బ్రహ్మారెడ్డి తెలుగులో పాఠ్యపుస్తకాలు తెచ్చారు. విదేశాల్నుంచి తెప్పించిన కృత్రిమ దేహాలతో శరీర నిర్మాణ పాఠాలు, సీడీలు, ప్రొజెక్టర్ ఉపయోగించి, 2011 సెప్టెంబరుకు 48,600 మందికి శిక్షణనిచ్చారు. కేటాయించిన బడ్జెట్లో రూ.6.50 కోట్లు విడుదలయింది. ఇంకా 20 వేలమంది శిక్షణ పొందాల్సివుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోని 13 జిల్లాల్లో ఆర్‌ఎంపీ/పీఎంపీలు 33 వేల వరకు ఉండగా, వీరిలో 28 వేలమంది శిక్షణ పొందినవారే.  శిక్షణ పొందినవారికి అర్హత పరీక్ష, మిగిలిన వారి శిక్షణకు చంద్రబాబు అంగీకరించి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు. గెలిచాక హామీనిచ్చారు. ఎదురుచూస్తున్న ఆర్‌ఎంపీలకు ఆర్థికశాఖ కొర్రీతో ఈ పథకానికి ముగింపు పలికినట్టు సమాచారం అందడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు.  
 
 ఆర్థిక భారం అవాస్తవం...

అర్హత పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్ల పంపిణీ, కొత్తవారికి శిక్షణకు రూ.50 కోట్ల వ్యయం కాగలదనేది అవాస్తవం. 13 జిల్లాల్లో 17 సెంటర్లున్నాయి. కేవలం రూ.5 కోట్లలోపే పథకం అమలుకు మేం కార్యాచరణ రూపొందిస్తాం. కుంటిసాకులతో కాలయాపన చేయకుండా ప్రభుత్వం అమలు చేయాలి. - టీబీ రాజా సిద్ధార్థ, అధ్యక్షుడు,  రాష్ట్ర అనుభవ వైద్యుల సంఘం
 
 
 భారం సాకుతో నిలిపివేయడం తగదు...
వైద్య సహాయకులుగా గుర్తింపునిస్తే, తక్కువ ఖర్చుతో ప్రాథమిక ఆరోగ్య సేవలను అందిస్తాం. ఎప్పటికప్పుడు విజ్ఞప్తిచేస్తున్నా పట్టించుకోకుండా ఇప్పుడు పథకాన్నే ఆపేస్తామనటం భావ్యం కాదు.   - నారాయణం వేణుగోపాల్, అధ్యక్షుడు,ఆర్‌ఎంపీ అసోసియేషన్, తెనాలి డివిజన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement