దుర్గమ్మ దర్శనానికి వేళాయె

Temple Of Vijayawada Kanaka Durgamma Will Be Opened From Tomorrow - Sakshi

రోజుకు ఐదువేల మందికి మాత్రమే దర్శనం 

ముందుగా ఆన్‌లైన్‌ బుకింగ్‌ 

అంతరాలయ దర్శనాలు, వేద ఆశీర్వచనాలు బంద్‌ 

10 నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి

సాక్షి, విజయవాడ: సుమారు 80 రోజుల తరువాత భక్తులు కనక దుర్గమ్మ వారిని దర్శించుకోనున్నారు. కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాల నుంచి వచ్చిన మార్గదర్శకాల ప్రకారం కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటూ అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు.  

8,9 తేదీల్లో ట్రయిల్‌ రన్‌  
8వ తేదీ ఉదయం 11 గంటలకు అమ్మవారి దర్శనానికి ఆలయ అర్చకులు  ముహూర్తం నిర్ణయించారు. 8, 9 తేదీలలో దేవస్థానం సిబ్బంది, అధికారులు ట్రయిల్‌ రన్‌గా దర్శనాలు చేసుకుంటారు. 10 తేది ఉదయం 6.30 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి ఉంటుంది. ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దర్శనం ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గంటకు 250 మంది చొప్పున రోజుకు 5వేల మందికి మాత్రమే దర్శనం చేసుకునేందుకు అనుమతిస్తామని ఈఓ ఎంవీ సురేష్‌బాబు తెలిపారు.  

అంతరాలయ దర్శనం బంద్‌  
అంతరాలయ దర్శనం ఎవ్వరికీ ఉండదు. మల్లికార్జున మహా మండపం నుంచి మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. బస్సులు, లిఫ్టులు ఉండవు. మెట్ల మార్గంలో పైకి వచ్చి దర్శనం చేసుకుని తిరిగి మెట్ల మార్గంలోనే కిందకు వెళ్లిపోవాలి. రెండు క్యూలైన్లు మాత్రమే ఉంటాయి. రూ.100 టిక్కెట్లు, ఉచిత దర్శనానికి ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకోవాలి. ఉచిత దర్శనం చేసుకునే భక్తులు కూడా తప్పని సరిగా ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుకింగ్‌ చేసుకోవాలి. కరెంటు బుకింగ్‌ ఉంటుంది కాని, అప్పుడు ఉన్న రద్దీని బట్టి మాత్రమే కరెంటు బుకింగ్‌ ఇస్తారు.  వీఐపీలు 24 గంటలు ముందుగా దేవాలయానికి వస్తున్నట్లు ఆలయ ఈఓకు  తెలియపరిస్తే వారికి సమయం కేటాయిస్తారు. అదే సమయంలో రావాల్సి ఉంటుంది.  చదవండి: మహిళా సర్పంచ్‌కు కలెక్టర్‌ ప్రశంస 

జల్లు స్నానాలు... కేశఖండన.... 
కృష్ణానదిలో స్నానాలు లేవు. దూరందూరంగా జల్లు స్నానాలు ఏర్పాటు చేస్తారు. అనంతరం కేశఖండన శాల వద్ద  భక్తులు భౌతిక దూరం పాటించాలి. ఒకరి తరువాత ఒకరు తలనీలాలు సమర్పించాలి. అక్కడ పూర్తి శానిటైజేషన్‌ చేస్తారు. .

రేపటి నుంచి పలు ఆలయాల్లో దర్శనాలు 
అమరావతి/మంగళగిరి/గుంటూరు ఈస్ట్‌: ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సోమవారం నుంచి ఆలయాల్లో భక్తులకు దర్శనానికి అనుమతిస్తున్నట్లు దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ బి.మహేశ్వరరెడ్డి, అమరావతి, మంగళగిరి పానకాల లక్ష్మీనృసింహస్వామి ఆలయాల ఈవోలు సునీల్‌కుమార్, మండెపూడి పానకాలరావు తెలిపారు. ఆయా ఆలయాల్లో ఈవోలు శనివారం మాట్లాడారు. అమరావతిలో ప్రతి రోజు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు,  మంగళగిరి ఎగువ సన్నిధిలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దర్శనం ఉంటుందని తెలిపారు. భక్తులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించి గుర్తింపు కార్డు, ఫోన్‌ నంబరు దేవాలయ కార్యాలయంలో అందించాలని సూచించారు.


అమరేశ్వరాలయంలో మార్కింగ్

జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో ఉన్న భక్తులతో పాటు గర్భిణులు, వయోవృద్ధులు, 10 ఏళ్ల లోపు పిల్లలకు దేవాలయంలోకి అనుమతి లేదని స్పష్టం చేశారు. భక్తుల కోసం శానిటైజర్లను అందుబాటులో ఉంచామని చెప్పారు. టికెట్స్‌ తీసుకునేటప్పుడు, క్యూలైన్లలో భౌతిక దూరం పాటించాలన్నారు. అమరావతిలో అంత్రాలయ దర్శనం, ఆర్జిత సేవలు, అర్చనలతో పాటు  మంత్రపుష్పం, పవిత్రజలం, శేషవస్త్రం, శఠారి, తీర్థం సేవలు తాత్కాలికంగా నిలిపి వేశామని తెలిపారు. లఘు దర్శనం, మహా లఘు దర్శనం మాత్రమే అనుమతిస్తున్నామని చెప్పారు. మంగళగిరిలో ఉచిత దర్శనంతో పాటు శీఘ్ర దర్శనానికి రెండు క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు. ఎగువ, దిగువ సన్నిధులతో పాటు ఘాట్‌రోడ్డుపైన ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయంలోను భక్తులకు దర్శనం చేసుకోవచ్చని వారు పేర్కొన్నారు. చదవండి: పబ్‌జీ గేమ్‌కి బానిసై.. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top