రానున్న ఎన్నికల్లో అభ్యర్థులను వెతుక్కునే పనిలో జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులున్నారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రానున్న ఎన్నికల్లో అభ్యర్థులను వెతుక్కునే పనిలో జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లా ప్రస్తుతం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలకు టీడీపీ నాయకులు గాలం వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో పూర్తిగా పట్టుకోల్పోవడంతో ఆ పార్టీ నాయకులను తెలుగుదేశంలోకి లాగాలని,
పార్టీ అధిష్టానం జిల్లాలోని కొంత మంది నాయకులకు పురమాయించింది. దీంతో టీడీపీ నాయకులు అభ్యర్థుల కోసం కాంగ్రెస్ నాయకులతో మంతనాలు సాగిస్తున్నారు.
సంతనూతలపాడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్‌ను సంప్రదిస్తున్నట్లు తెలిసింది. అదేవిధంగా కనిగిరిలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని తమ పార్టీలోకి రావాల్సిందిగా టీడీపీ నేతలు ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. అయితే ఆయన ఇంత వరకు స్పందించకపోవడంతో మాజీ ఎమ్మెల్యే తిరుపతినాయుడును పోటీ చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. తిరుపతినాయుడు ఇది వరకు తెలుగుదేశం తరఫున పోటీ చేశారు.
గత ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ టికెట్టు లభించకపోవడంతో ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉన్నారు. రాష్ట్ర విభజన బిల్లు లోక్‌సభలో ఆమోదించగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆదిమూలపు సురేష్‌ను కూడా టీడీపీ వైపునకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అందుకు ఆయన సుముఖత చూపడం లేదని తెలిసింది. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కోసం కూడా జిల్లా టీడీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలోకి ఆహ్వానించిన విషయాన్ని తెలుసుకున్న అక్కడి కార్యకర్తలు పార్టీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. మాజీ ప్రజారాజ్యం నాయకులపైన కూడా టీడీపీ గురిపెట్టింది.
కాంగ్రెస్ నేతలను పార్టీలోకి ఆహ్వానించడంపై టీడీపీ కార్యకర్తలు, నాయకులు అధిష్టానం వైఖరిని ఖండిస్తున్నారు. ఏళ్ల తరబడి జెండాలు మోస్తూ డబ్బు ఖర్చుపెట్టుకుంటున్న తమను పక్కనపెట్టి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన కాంగ్రెస్ నాయకులను పిలిచి వారికి పెద్దపీట వేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. పలువురు నేతలు పార్టీపై కినుక వహించినట్లు తెలుస్తోంది. మరికొంత మంది పార్టీని వీడేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలకు టీడీపీ టికెట్టు ఇస్తే హైదరాబాద్ వెళ్లి అధినేత ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నారు. టీడీపీలో వస్తున్న ఈ వ్యతిరేకతను అధిష్టానం ఏ విధంగా ఎదుర్కొంటుందో వేచి చూడాల్సి ఉంది.