టీ స్టాల్‌ పోర్టికో కూలి యజమాని మృతి

 tea shop owner died in Guntur - Sakshi

గుంటూరు రూరల్‌: ప్రమాదవశాత్తూ టీస్టాల్‌ వెల్లుడు (పోర్టికో) కూలి యజమాని మృతి చెందిన సంఘటన గురువారం మండలంలోని గోరంట్ల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు...గుంటూరు జిల్లా వినుకొండ మండలం నడికట్టు గ్రామానికి చెందిన  పాలడుకు రామకృష్ణ(28) తండ్రి రామదాసుతో కలసి ఐదేళ్ల కిందట గుంటూరుకు కుటుంబంతో సహా వలస వచ్చారు. గోరంట్ల గ్రామంలో అద్దెకు ఇంటిని తీసుకుని మిర్చి యార్డు సమీపంలో హోటల్‌ నిర్వహిస్తున్నారు.

 అతడికి మూడేళ్ల కిందట ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం కుందనపల్లికి చెందిన ఆదిలక్ష్మితో వివాహమైంది. ఏడాదిన్నర వయస్సు ఉన్న బాబు కూడా ఉన్నాడు. ప్రస్తుతం భార్య గర్భిణి. రెండు సంవత్సరాల కిందట మిర్చి యార్డు విస్తరణలో భాగంగా హోటల్‌ తీసేయాల్సి రావడంతో గోరంట్ల శివారుల్లోని సెయింట్‌ ఆన్స్‌ కళాశాల సమీపంలో ఒక దుకాణాన్ని అద్దెకు తీసుకుని శ్రీమహాబోధి పేరుతో టీస్టాల్‌ను నిర్వహిస్తున్నాడు.

 గత రెండు రోజలుగా కురుస్తున్న వర్షాలకు ప్రమాదవశాత్తూ హోటల్‌ వెల్లుడు ఒక్కసారిగా కూలి రామకృష్ణపై పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. బంధువులు గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.   పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  ఒక్కగానొక్క కొడుకును కోల్పోయి రోడ్డుపాలయ్యామని, ఇక తామెందుకు బతకాలంటూ కుటుంబ సభ్యులు విలపించిన తీరు చూపరుల్ని కంటతడి పెట్టించింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top