ఇంద్రకీలాద్రిపై బోండాగిరి

TDP MLA Bonda Uma Maheshwara Rao Fires On Durga Temple Personnel In IndraKeeladri - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో: టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఆయన అనుచరులు బెజవాడ ఇంద్రకీలాద్రిపై రెచ్చిపోయారు. అధికారులపై ఆగ్రహావేశాలు ప్రదర్శించి.. వీరంగం వేశారు. బొండా అనుచరులు ఒకానొక దశలో దుర్గగుడి సూపరింటెండెంట్‌ చొక్కా పట్టుకొని ‘బయటకు రా.. నీ అంతుచూస్తాం’ అంటూ బెదిరించారు. వివరాలు.. మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తరఫున కనదుర్గమ్మకు టీటీడీ ఏఈవో సాయిలు పట్టువస్త్రాలు సమర్పించారు. దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ ఆయనకు ఆలయమర్యాదలతో స్వాగతం పలికి.. తీర్థ ప్రసాదాలు అందజేశారు. అయితే టీటీడీ బోర్డు సభ్యుడినైన తనతో కాకుండా ఏఈవోతో అమ్మవారికి పట్టువస్త్రాలు ఎలా సమర్పింపజేస్తారంటూ దుర్గ గుడి ఈవోపై బొండా ఉమా ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను ఉండగా అధికారులకు ఎలా ప్రాధాన్యమిస్తారని ఆమెపై చిందులు తొక్కారు. సంగతి చూస్తానని హెచ్చరించారు. టీటీడీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకున్నామని చెప్పినా వినకుండా.. రుసరుసలాడుతూ బొండా వెళ్లిపోయారు. 

నీ అంతు చూస్తాం.. 
ఇదేసమయంలో బొండా ఉమా అనుచరులు సైతం అధికారులపై విరుచుకుపడ్డారు. పట్టువస్త్రాలు సమర్పించేందుకు నిబంధనల ప్రకారం టీటీడీ ఏఈవో, బొండా ఉమా కుటుంబసభ్యులనే అనుమతిస్తామని.. అనుచరులు క్యూ లైన్లలో రావాలంటూ ఆలయ సూపరింటెండెంట్‌ చందూ శ్రీనివాస్‌ వారిని అడ్డుకున్నారు. దీంతో బొండా అనుచరులు ఆవేశంతో ఊగిపోయారు. సూపరింటెండెంట్‌ చొక్కా పట్టుకుని ‘బయటకు రా.. నీ అంతూ చూస్తాం’ అంటూ బెదిరింపులకు దిగారు. మా ప్రతాపం చూపిస్తామంటూ రెచ్చిపోయారు. దీంతో వారి తీరు చూసి భక్తులు నోరెళ్లబెట్టారు. ఆలయాల్లో కూడా రౌడీయిజం చేస్తారా అంటూ విస్మయం వ్యక్తం చేశారు. దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ మీడియాతో మాట్లాడుతూ.. ఏఈవో సాయిలు పట్టువస్త్రాలు సమర్పిస్తారని మాత్రమే తమకు టీటీడీ ఈవో నుంచి సమాచారం వచ్చిందని చెప్పారు. టీటీడీ ఏఈవో సాయిలు మాట్లాడుతూ.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించాలని ఉన్నతాధికారులే తనకు ఆదేశాలిచ్చారని తెలిపారు.    

చైర్మన్‌ను అడ్డుకున్న దుర్గగుడి ఈవో..
అమ్మవారిని దర్శించుకునేందుకు కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన దుర్గగుడి చైర్మన్‌ గౌరంగబాబును ఈవో కోటేశ్వరమ్మ అడ్డుకుని.. క్యూలైన్లలో రావాలని సూచించారు. దీంతో ఆగ్రహించిన చైర్మన్‌ గుడిలోనే బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఈవో కలుగజేసుకుని నేరుగా ఆలయంలోకి అనుమతిస్తామని చెప్పడంతో నిరసన విరమించారు.

మహాలక్ష్మీ నమోస్తుతే!
మంగళవారం బెజవాడ కనకదుర్గమ్మ శ్రీ మహాలక్షీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మిలుగా వరాలు ప్రసాదించే అష్టలకు‡్ష్మల సమష్టి రూపమైన మహాలక్ష్మీదేవిగా కనకదుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తారని విశ్వాసం. లక్ష్మీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. సాయంత్రం ఏడు వరకు 90 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. ఉన్నతాధికారులు ఎల్వీ సుబ్రహ్మణ్యం,  కె.సంధ్యారాణి, బిగ్‌బాస్‌ విజేత కౌశల్, వైఎస్సార్‌సీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్‌ తదితరులు అమ్మవారి సేవలో పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top