డూప్లికేట్‌ శిలాఫలకాలకు చెక్‌ 

Tdp Govt Development Only In Foundation stone Ongole - Sakshi

సాక్షి, ఒంగోలు: తెలుగుదేశం పార్టీ నాయకులు ఐదేళ్ల పాలనలో అభివృద్ధి పేరుతో ప్రభుత్వ సొమ్మును నిలువునా దోసుకున్నారు. రూ. కోట్లు విలువచేసే ప్రభుత్వ భూములను రాబంధుల్లా తన్నుకు పోవడం వంటి అక్రమాలకు తెగపడ్డారు. అయితే అభివృద్ధి పేరుతో ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచి కందుకూరు నియోజకవర్గంలో ఎంతో హడావిడి చేసి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు గుంజేందుకు విచ్చలవిడిగా శంకుస్థాపనల పేరుతో శిలాఫలకాలను ఆవిష్కరించారు. అది కూడా ప్రజలను ఆకట్టుకొని ఓట్లు వేసే విధంగా రోడ్ల పక్కన ఏర్పాటు చేశారు. వాస్తవం గ్రహించిన ప్రజలు ఓట్ల రూపంలో ఆపార్టీ నాయకులకు షాక్‌ ఇచ్చారు. పనులు చేయకుండా ఏర్పాటు చేసిన డూప్లికేట్‌ శిలాఫలకాలకు చెక్‌ పెట్టేందుకు ప్రస్తుత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పటైన రెండేళ్ల తరువాత గవర్నమెంట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (జీఓఏపీ) పథకం కింద కందుకూరు మున్సిపల్‌ అభివృద్ధికి 15 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీఓను జారీ చేసింది. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ అధికారులు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకముందే జీఓను చేతపట్టుకొని 35 పనులకు అంటే సీసీ రోడ్లు, డ్రైనేజిలు నిర్మించడానికి టెండర్లు పిలిశారు.

దీంతో టెండర్లు దక్కించుకున్న తెలుగుదేశం సానుభూతిపరులైన కాంట్రాక్టర్లు 13 పనులను ప్రారంభించారు. వెంటనే ఆపార్టీ నాయకులు నిధులు విడదలైనట్లే, పనులన్నీ పూర్తి చేసినట్లే, అదిగో అభివృద్ధి, ఇదిగో అభివృద్ధి అంటూ గొప్పలు చెప్పుకున్నారు. మా వల్లనే కందుకూరు అభివృద్ధి సాధ్యపడుతోందని అబద్ధాల ప్రచారానికి తెరలేపారు, అయితే పనులు మొదలు పెట్టిన కాంట్రాక్టర్లు వాటిని పూర్తి చేసి బిల్లుల కోసం మున్సిపల్‌ ఆఫీసు చుట్టూ కాళ్లుఅరిగేలా తిరుగుతున్న సందర్భంలో తోటి కాంట్రాక్టర్లు బిల్లులు రావనే కారణంతో పనులను ప్రారంభించలేదు.

ఈ క్రమంలో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే పోతుల రామారావు పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీచేసి వారి లైసెన్స్‌లు రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. అయినా కాంట్రాక్టర్లు బిల్లులు రావన్న నెపంతో పనులు మొదలు పెట్టడానికి సాహసించలేదు. ఈ మోసపు మాటలు, అబద్ధాపు ప్రచారం ఎన్నికలకు 5 నెలల ముందు వరకు జరిగింది. చివరికి ప్రభుత్వం జీఓఏపీ గ్రాంటును రద్దు చేసింది

శంకుస్థాపనలు, శిలాఫలకాల ఏర్పాటు
టీడీపీ నాయకులు మరలా ప్రజలను నమ్మించి ఓట్లు గుంజుకొనేందుకు ఎన్నికలకు మూడు నెలల ముందు అభివృద్ధిపేరుతో హడావుడిగా శంకుస్థాపనలు చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. పట్టణంలో సీసీ రోడ్లు, శ్మశానవాటికలు, ప్రజలకు తాగునీటి సరఫరాకు అవసరమైన నూతన పైపులైన్ల నిర్మాణం, మురుగునీరు బయటకు పోవడానికి అవసరమైన డ్రైనేజి నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రభుత్వం స్లిప్‌ గ్రాంటు కింద రూ. 14.56 కోట్లు విడదల చేసింది, ఫిబ్రవరి నెలలో ముత్యాలగుంట వద్ద శిలాఫలకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

ఎలాంటి టెండర్లు పిలవలేదు. ఈ స్కీమ్‌ నిబంధనల ప్రకారం ఒక లక్షకు 10 వేలు మున్సిపాలిటీ పెట్టుకోగా, మిగిలిన రూ. 90 వేలు ప్రభుత్వమే బ్యాంకు నుంచి మంజూరు చేస్తుంది. బ్యాంకు నుంచి తీసుకున్న నగదును మున్సిపాలిటీ వడ్డీతో కలపి నెలనెలా బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల ప్రజలపై భారం పడక తప్పదు. ఇలాంటి విషయాలన్నీ కప్పిపెట్టి ప్రజలకు చెప్పకుండా, టెండర్లు పిలవకుండా ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవడానికి శిలాఫలకాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

అంతేకాకుండా పట్టణంలో రోడ్డు వైడింగ్, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద పలు కాలనీల్లో రోడ్లు నిర్మాణం వంటి అభివృద్ధిల పేరుతో శంకుస్థాపనలు చేశారు. ఈ విషయమై మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ అధికారులను వివరణ కోరగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్నికలకు ముందు ప్రారంభించి, 25 శాతం కన్నా పనులు ప్రారంభం కాని పనులను రద్దు చేసినట్లు తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top