టీడీపీలో వణుకు

Tdp Fears In Ysrcp Nominations - Sakshi

జిల్లాలో వైఎస్సార్‌ సీపీ ప్రభంజనం ఖాయమని తేలిపోవడంతో టీడీపీ నేతల్లో వణుకు మొదలైంది. దీంతో పచ్చ పార్టీ నేతలు రెచ్చగొట్టే ధోరణి అవలంబిస్తున్నారు. శుక్రవారం జరిగిన నామినేషన్ల కార్యక్రమానికి పలుచోట్ల వైఎస్సార్‌ సీపీ శ్రేణులకు అడ్డంకులు సృష్టించారు. టీడీపీ నేతల చర్యలతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

సాక్షి ప్రతినిధి, ఏలూరు : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల నామినేషన్లకు వస్తున్న జన ప్రభంజనంతో తెలుగుదేశం పార్టీలో వణుకు మొదలైంది. దీంతో ఎలాగైనా వారిని రెచ్చగొట్టి గొడవలు సృష్టించాలన్న కుట్రకు తెరలేపింది. దీంతో శుక్రవారం జిల్లావ్యాప్తంగా జరిగిన నామినేషన్ల ప్రక్రియలో పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం మంచిరోజు కావడంతో జిల్లా వ్యాప్తంగా నామినేషన్లు హోరెత్తాయి. పార్లమెంట్‌కు పది, అసెంబ్లీలకు 78 నామినేషన్లు దాఖలు అయ్యాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఏలూరులో ఆళ్ల నాని, ఆచంటలో చెరుకూరి శ్రీరంగనాథరాజు, పాలకొల్లు నుంచి డాక్టర్‌ బాబ్జి, ఉండి నుంచి పీవీఎల్‌ నరసింహరాజు, గోపాలపురం నుంచి తలారి వెంకట్రావు, దెందులూరు నుంచి కొఠారు అబ్బయ్యచౌదరి, పోలవరం నుంచి తెల్లం బాలరాజు, నిడదవోలు నుంచి శ్రీనివాసనాయుడు నామినేషన్లు వేశారు. నరసాపురం పార్లమెంట్‌ స్థానానికి ప్రధాన రాజకీయపార్టీల నాయకులు నామినేషన్‌లు దాఖలు చేశారు. వేలాదిగా జనంతరలి రావడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో జోష్‌ నెలకొంది. జనసేన పార్టీ తరఫున కొణిదల నాగేంద్రబాబు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, టీడీపీ అభ్యర్థిగా వేటుకూరి శివరామరాజు, బీజేపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు నామినేషన్‌ వేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి కనుమూరి రఘురామకృష్ణంరాజు తరఫున మరోసెట్టు నామినేషన్‌ పత్రాలను పార్టీ నేత గుబ్బల తమ్మయ్య అందించారు. భీమవరం నుంచి పవన్‌ కళ్యాణ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.

రెచ్చగొట్టే ధోరణిలో తెలుగుదేశం 
వైఎస్సార్‌సీపీకి వస్తున్న జన స్పందనతో తెలుగుదేశంలో గుబులు పుట్టింది. ఏలూరు, గోపాలపురం, జంగారెడ్డిగూడెం, ఉండి తదితర ప్రాంతాల్లో కావాలని రెచ్చగొట్టారు. పోలీసులు అధికార పార్టీకి అండగా నిలబడటంతో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడింది. దీంతో అధికార పార్టీ నేతలు రెచ్చిపోయారు. వైఎస్సార్‌ సీపీ ఏలూరు అభ్యర్థి ఆళ్ల నాని వేలాదిమందితో పాదయాత్రగా నామినేషన్‌ వేసేందుకు వెళుతోన్న సమయంలో ఆర్‌ఆర్‌ పేటలోని మధులతా సెంటర్‌ ప్రాంతానికి ఆళ్ల నాని పాదయాత్ర చేరుకున్న సమయంలో ఎంపీ మాగంటి బాబు నివాసం వైపు నుంచి నామినేషన్‌ వేసేందుకు వారు కూడా రోడ్డుపైకి వచ్చారు. అదే సమయంలో వైఎస్సార్‌ సీపీ భారీ ర్యాలీగా రావటంతో ఇరువర్గాలు ఎదురుపడే పరిస్థితి వచ్చింది. 

టీడీపీ నేతలు తమ కార్యకర్తలతో ర్యాలీగా రోడ్డుపైకి రావటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసు అధికారులు టీడీపీ నేతలకు వత్తాసుపలుకుతూ చాలాసేపు వైఎస్సార్‌సీపీ ర్యాలీని నిలిపివేశారు. గోపాలపురంలో నామినేషన్‌ వేయడానికి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు, టీడీపీ అ«భ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు ఒకేసారి ఎన్నికల కార్యాలయానికి చేరుకోవడంతో కార్యకర్తల మధ్య స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. ఇరుపార్టీల కార్యకర్తలు సహనం కోల్పోయి నెట్టుకోవడంతో పోలీసులు నచ్చచెప్పి సర్ధుబాటు చేశారు. వైఎ స్సార్‌ సీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు నామినేషన్‌ వేస్తున్న సమయంలోనే అధికార పార్టీ నేతలు రిటర్నింగ్‌ కార్యాలయంలోకి చొచ్చుకువచ్చారు. జంగారెడ్డిగూడెంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

ఆర్డీఓ కార్యాలయం, పోలవరం అసెంబ్లీ రిటర్నింగ్‌ అదికారి కార్యాలయం వద్ద పూర్తిస్థాయిలో బందోబస్తు లేకపోవడంతో ఇరువర్గాలు దూసుకువచ్చాయి. జంగారెడ్డిగూడెం డీఎస్పీ సీహెచ్‌ మురళీకృష్ణ అప్పటికప్పుడు సీఆర్‌పీఎస్‌ బలగాలను రప్పించి ఇరువర్గాలను శాంతింపచేసి పంపించి వేశారు. ఉండిలో వైఎస్సార్‌ సీపీ నామినేషన్‌ సందర్భం గా పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలకు స్వల్పగాయాలయ్యాయి. నామినేషన్‌ వేసేందుకు వైఎస్సార్‌ సీపీ, తెలుగుదేశం శ్రేణులు ఒక్కసారిగా రావడంతో ఉద్రిక్తత నెలకొంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top