పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రా తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అది మరింత బలపడి అల్పపీడనంగా ఏర్పడే అవకాశాలున్నాయి. గురువారం రాత్రి వాతావరణ పరిస్థితులు అందుకు అనుకూలంగానే ఉన్నాయి.
24 గంటల్లో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రా తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అది మరింత బలపడి అల్పపీడనంగా ఏర్పడే అవకాశాలున్నాయి. గురువారం రాత్రి వాతావరణ పరిస్థితులు అందుకు అనుకూలంగానే ఉన్నాయి. అల్పపీడనం ఏర్పడితే రాష్ర్టంలో రానున్న 24గంటల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కూడా కొనసాగుతోంది. ద్రోణి, ఆవర్తనాల కారణంగా కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశాలున్నాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.
గురువారం కూడా కావలి, ఒంగోలు, నెల్లూరు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయన్నారు. రాష్ట్రంలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు గుంటూరు జిల్లా రెంటచింతలలో 6 సెం.మీ, ప్రకాశం జిల్లా దర్శిలో 5, తుని, కృష్ణా జిల్లా మచిలీపట్నం, నర్సాపురం, బాపట్ల ప్రాంతాల్లో 3సెం.మీ. వర్షం పడింది. రాయలసీమలో మంత్రాలయం, కర్నూలు, తిరుపతి ప్రాంతాల్లో 3 సెం.మీ. చొప్పున వాన కురిసింది. తెలంగాణలోని నల్లగొండలో 11 సెం.మీ, నాగార్జున సాగర్‌లో 6, మధిరలో 3 సెం.మీ. వర్షం పడింది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రానున్న 48 గంటల్లోగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ గురువారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.