ఉప్పు ధార

Summer Storage Tank Dry In Sullurpeta PSR Nellore - Sakshi

ఉప్పుమయమైన భూగర్భ జలాలు

స్వచ్ఛనీరు అందించడంలో మున్సిపల్‌ యంత్రాంగం విఫలం

ఎండిపోయిన సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌

దోచేస్తున్న వ్యాపారులు

సూళ్లూరుపేట సుజలస్రవంతి పథకం ద్వారా అన్ని వార్డుల్లో ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందిస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక అన్నీ మర్చిపోయారు. పాలకులకు ముందుచూపు కరువవడంతో ప్రజలకు ఉప్పునీరే గతైంది. భూ గర్భజలాలు ఉప్పు మయమయ్యాయి. రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన నీటి పథకాలు నిరుపయోగంగా మారాయి. పట్టణ జనాభాకు సరిపడా నీరు సరఫరా చేయడంలో మున్సిపల్‌ యంత్రాంగంవిఫలమైంది. శివారు ప్రాంతాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బిందెడు నీళ్లు కూడా కష్టమయ్యాయి. చిత్రమేమిటంటే ప్రజలకు తాగునీరు దొరకదు కానీ వ్యాపారస్తులు పుష్కలంగా లభ్యమతున్నాయి. వారు మంచినీటితో రూ.కోట్లు గడిస్తున్నారు.ప్రజలను దోచేస్తున్నారు.

నెల్లూరు, సూళ్లూరుపేట:  పట్టణ ప్రజలు మంచినీటి కోసం దాహంతో తపిస్తున్నారు. మంచినీళ్లు దొరకడం గగనంగా మారింది. సుమారు 48 వేల మంది జనాభా అవసరాలకు తగినట్టుగా తాగునీటి వనరుల్లేవు. ఎటుచూసినా ఉప్పునీళ్లే లభిస్తుండడంతో గుక్కెడు మంచినీటికి గుటకలేస్తున్నారు. పులికాట్‌ సరస్సులోని ఉప్పునీళ్లు కాళంగి నదిలోకి ఎగబాకడంతో భూగర్భ జలాలు పూర్తిగా ఉప్పునీళ్లుగా మారిపోయాయి. సాధారణంగానే సూళ్లూరుపేట పట్టణ పరిధిలో భూగర్భంలో ఉప్పునీళ్లు లభ్యమవుతున్నాయి. పట్టణంలో పది ఓవర్‌హెడ్‌ ట్యాంకులు ఉన్నాయి. ఇందులో మన్నారుపోలూరు న్యూకాలనీ, ఇందిరానగర్, సూళ్లూరు, బాపూజీకాలనీల్లోని ఓవర్‌హెడ్‌ట్యాంకులు శిథిలమై ప్రమాదకరంగా మారడంతో కూల్చేశారు. సమ్మర్‌ స్టోరేజీ, ఇతర వనరుల నుంచి రోజుకు 16 లక్షల లీటర్ల నీటిని మాత్రమే అందిస్తున్నామని మున్సిపల్‌ అధికారులు లెక్కలు చెబుతున్నా.. ఆ స్థాయిలో నీటి సరఫరా జరడం లేదు. మున్సిపాలిటీ పరిధిలో ఒక మనిషికి రోజుకు 70 లీటర్ల వంతున నీరు సరఫరా చేయాల్సి ఉంది. ఈ లెక్కన పట్టణ జనాభా లెక్కల ప్రకారం 34 లక్షల లీటర్ల నీరు ఇవ్వాల్సి ఉంది. కానీ అందుబాటులో ఉన్న నీటి వనరుల నుంచి సరఫరా చేస్తున్న నీటి లెక్కలు చూస్తే కేవలం 10 లక్షల లీటర్ల నీటిని కూడా అందించడం లేదని తెలుస్తుంది. ప్రస్తుతం మున్సిపాలిటీలో నీళ్లు కేవలం 30 శాతం మందికి కూడా సరఫరా కావడం లేదు. పట్టణ శివారు ప్రాంతాల వారికి బిందెడు నీళ్లు అందడం కూడా గగనమవుతోంది.

తాగునీటికి నెలకు రూ.కోటి వెచ్చింపు
పట్టణ ప్రజలకు మంచినీళ్లు అందకపోవడంతో నెలకు రూ.కోటి వెచ్చించి మంచినీళ్లు కొనుగోలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. తాగునీటి పథకాల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కొందరు నీటిని దోచేస్తున్నారు. అక్రమంగా కుళాయిలు, సంప్‌లు నిర్మించుకుని వాటికి మోటార్లు ఏర్పాటు చేసుకుని తోడేయడంతో పట్టణ శివారు ప్రాంతాల్లో కుళాయిల్లో నీళ్లు రావడం గగనమైపోయింది. మన్నారుపోలూరు కేంద్రంగా తాగునీటి వ్యాపారం చేసే కంపెనీలు కోట్లాది రూపాయలు గడిస్తుంటే చెంతనే ఉన్న పట్టణ ప్రజలకు మాత్రం చుక్క నీరు అందాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. మున్సిపల్‌ లెక్కల ప్రకారం  పట్టణంలో సుమారు 15 వేలు కుటుంబాలు ఉన్నాయి. కుటుంబానికి రోజుకు రూ.20 లెక్కన నీళ్లు కొంటే రోజుకు రూ.3 లక్షలు అవుతుంది. అంటే నెలకు సుమారు కోటి రూపాయలు నీళ్ల కోసం ఖర్చు చేస్తున్నారు.

ఉప్పు నీళ్లుగా మారిన భూగర్భ జలాలు
కాళంగి నదిలోకి పులికాట్‌ సరస్సు నుంచి ఉప్పు నీళ్లు రాకుండా నిర్మించిన గ్రాయిన్‌ శిథిలమైపోవడంతో నదిలో ఉన్న మంచినీళ్లు ఉప్పునీళ్లుగా మారిపోయాయి. దీంతో చుట్టు పక్కల బోర్లు, బావుల్లోని మంచినీళ్లు కూడా ఉప్పు నీళ్లుగా మారిపోయి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బావుల్లో, బోరుల్లో వచ్చే నీటిని మామూలుగా ఉపయోగించుకుంటూ తాగడానికి మాత్రం రోజువారీగా నీళ్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ పరిస్థితి ఏటా తలెత్తుతున్నా.. కాళంగి నదిలోకి ఉప్పు నీళ్లు ఎగబాకకుండా  గ్రాయిన్‌ నిర్మాణాన్ని పటిష్టం చేయాల్సిన పాలకులు నాలుగేళ్లుగా పట్టించుకోవడం మానేశారు. షార్‌ నిధులతో నిర్మిస్తామని ముందుకొస్తే వారికి అనుమతులు ఇవ్వకుండా కాలయాపన చేశారు.

నిరుపయోగంగా మారిన సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌
సూళ్లూరుపేట దాహార్తిని తీర్చేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్‌  రాజీవ్‌ పల్లెబాటకు వచ్చినప్పుడు స్థానిక ప్రజల బాధలను తెలుసుకుని సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌కు రూ.6 కోట్లు మంజూరు చేశారు. కోటపోలూరు పెద్దన్నగారి చెరువులో ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ను నిర్మించారు. వైఎస్సార్‌ ఉన్నంత కాలం వర్షాలు పుష్కలంగా పడడంతో నీటికి ఇబ్బంది లేకుండాపోయింది. ఎస్‌ఎస్‌ ట్యాంక్‌కు నీళ్లు చేరేందుకు తెలుగుగంగ బ్రాంచ్‌ కాలువను తీసుకువస్తున్నామని, వైఎస్సార్‌ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, టీడీపీ పాలకులు ఏళ్లకు ఏళ్లే కాలయాపన చేస్తున్నారు. సూళ్లూరుపేట మేజర్‌ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా రూపాంతరం చెందడంతో తాగునీటి పథకాలను ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ నుంచి మున్సిపాలిటీకి అప్పగించారు.

షార్‌ నిధులతో పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.117 కోట్లతో 7.50 లక్షల లీటర్లు కెపాసిటీ కలిగిన ఐదు ఓవర్‌ హెడ్‌ట్యాంకులు, 18 కిలో మీటర్లు పైపులైన్లు విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ఈ ప్రతిపాదనలు పైళ్లకే పరిమితమైపోయింది.  2013 ఏప్రిల్‌లో సూళ్లూరుపేటకు వచ్చిన అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.75 కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. పడమటికండ్రిగ చెరువులోని ఆక్రమిత స్థలాన్ని,  మంగళంపాడు చెరువులో స్థల పరిశీలన కూడా చేశారు. ఈ ప్రతిపాదన కూడా సీఎం కార్యాలయం నుంచి బయటకు రాలేదు. తాజాగా ఏషియన్‌ ఇన్వెస్టిమెంట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బ్యాంక్‌ అనే సంస్థ నుంచి రూ.183 కోట్లు మంజూరు చేస్తారని, దీనికి కూడా అంచనాలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ఏఐఐబీ సంస్థ ప్రతినిధులు ఇటీవల సూళ్లూరుపేటకు వచ్చి మంగళంపాడు చెరువును, పట్టణంలోని పలు ప్రాంతాలను పరిశీలించి వెళ్లారు. ఆ తర్వాత ప్రస్తావనే లేకుండా పోయింది. ఇది కూడా కొండెక్కినట్టేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

జోరుగా నీళ్లు వ్యాపారం
పట్టణంలోని కళాక్షేత్రంలో స్వజల ధార కింద మున్సిపాలిటీ స్థలంలో ఏర్పాటు చేసిన డాక్టర్స్‌ వాటర్‌ అనే  సంస్థ మున్సిపాలిటీ నీళ్లను అమ్ముకుంటూ వ్యాపారం చేస్తోంది. అన్ని సౌకర్యాలు మున్సిపాలిటీకి సంబంధించినవి వాడుకుంటూ బిందెనీళ్లు రూ. 4, 20 లీటర్ల క్యాన్‌ రూ.15లకు విక్రయిస్తున్నారు. మున్సిపాలిటీ వనరులను వాడుకుని పట్టణ ప్రజలకు నామమాత్రపు ధరలకు ఇవ్వాల్సింది పోయి అధికంగా విక్రయిస్తున్నా.. అడిగే నాథుడు లేకుండా పోయారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top