టీటీడీ ఆలయాల ఆడిట్‌ వివరాలివ్వండి

Submit TTD temples audit Details, High court asks govt - Sakshi

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం

టీటీడీ నిధుల దుర్వినియోగంపై పిల్‌

ప్రభుత్వ నియంత్రణ చెల్లదు

స్వయంగా వాదించిన రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి

విచారణ వచ్చే నెల 18కి వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ఆస్తులు, ఆదాయ, వ్యయాలు, కానుకలు, విరాళాలు, ఖర్చులపై నిర్వహించే ఆడిట్‌ వివరాలు అందజేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు టీటీడీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఆడిటర్‌ నియామకానికి సంబంధించి స్పష్టత లేదని విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. తిరుమల దేవస్థానం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంతోపాటు ఆదాయాలున్న మరో 11 ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణ లేకుండా ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థిస్తూ బీజేపీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ సుబ్రమణ్యస్వామి, డిల్లీకి చెందిన లా విద్యార్థి సత్యపాల్‌ సభర్వాల్‌ వ్యక్తిగత హోదాలో (పార్టీ ఇన్‌ పర్సన్‌) దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌) మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది.

ఆదాయం ఉన్న ఆలయాలపై ప్రభుత్వానికి అజమాయిషీ కల్పిస్తూ దేవాదాయ, ధర్మాదాయ శాఖ చట్టంలోని సెక్షన్‌లు 15, 29, 96, 97–ఎ/బి, 106, 108, 109, 110, 115లను వారు పిల్‌లో సవాల్‌ చేశారు. సుప్రీంకోర్టు 2014లో వెలువరించిన తీర్పులోని మార్గదర్శకాల ప్రకారం ఆలయాల నిర్వహణలో ప్రభుత్వ పాత్ర నామమాత్రమని సుబ్రమణ్యస్వామి వాదించారు. ధార్మిక సంస్థల పర్యవేక్షణలో ఆలయాలను నిర్వహించాలని చెప్పారు. ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణ చెల్లదని, కేవలం దేవుడి ఆస్తుల రక్షణకు ప్రభుత్వం ధర్మకర్త పాత్ర పోషించాలన్నారు. టీటీడీ ఆలయాలపై ప్రభుత్వపాలన 85 ఏళ్లకుపైగా కొనసాగుతోందని, ఇది సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకమన్నారు. నిధుల వినియోగంపై అనేక అనుమానాలు ఉన్నాయని, ఆడిట్‌ పారదర్శకంగా లేదని, కాగ్‌ కూడా తప్పుపట్టినా పట్టించుకోవడంలేదని సుబ్రమణ్యస్వామి ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కె.లక్ష్మణ్‌ వాదిస్తూ ఏపీ ప్రభుత్వ చట్టానికి అనుగుణంగా టీటీడీ నిర్వహణ జరుగుతోందని చెప్పారు. టీటీడీ నిర్వహించే ధార్మిక కార్యక్రమాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదని ఏపీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ చెప్పారు. ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టానికి లోబడి టీటీడీ ఆడిట్‌ జరుగుతోందని ధర్మాసనం అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా టీటీడీ తరఫు న్యాయవాది లలిత బదులిచ్చారు. వాదనల అనంతరం విచారణను డిసెంబర్‌ 18కి వాయిదా వేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top