తెగిపడిన ఎల్‌టీ విద్యుత్ వైరు తగలడంతో ఓ విద్యార్థి సజీవంగా దహనమయ్యాడు. ఈ విషాద ఘటన తనికెళ్లలోని బ్రౌన్స్ కళాశాల సమీపంలో బుధవారం జరిగింది.
తనికెళ్ల (కొణిజర్ల), న్యూస్‌లైన్: తెగిపడిన ఎల్‌టీ విద్యుత్ వైరు తగలడంతో ఓ విద్యార్థి సజీవంగా దహనమయ్యాడు. ఈ విషాద ఘటన తనికెళ్లలోని బ్రౌన్స్ కళాశాల సమీపంలో బుధవారం జరిగింది. వైరా సీఐ జె.దేవేందర్ రెడ్డి తెలిపిన ప్రకారం...రఘునాధపాలెం మండలం వి.వెంకటాయపాలెం గ్రామానికి చెందిన మూడ్ మోహన్(17) ఖమ్మంలోని ప్రయివేట్ రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. గృహ ప్రవేశ వేడు క కోసమని అతడు ఇటీవలే ఇంటికి వచ్చాడు.
మిరప తోట చూసొస్తానంటూ తండ్రితో చెప్పి మోహన్ బుధవారం ఉదయం బయల్దేరాడు. సమీపంలో 11 కేవీ విద్యుత్ వైరు తెగిపడి ఉంది. దానిని అతడు గమనించలేదు. బంధువులకు పండ్ల పుల్లలు తెంపేందుకని మోహన్ పక్కకు వంగడంతో.. విద్యుత్ వైరు తగిలింది. విద్యుదాఘాతంతో అతను పడిపోయాడు. మంటలు శరీ రానికి అంటుకుని పైగి ఎగిసాయి.
మంటలు ఎందుకు వస్తున్నాయో చూసేందుకని స్థానికులు, సమీపంలోగల బ్రౌన్స్ కళాశాల సెక్యూరిటీ సి బ్బంది వెళ్లి, అక్కడి దృశ్యాన్నిచూసి దిగ్భ్రాంతులయ్యారు. అప్పటికే మోహన్ మంటల్లో పూర్తిగా కాలిపోయాడు. ఈ సమాచారమందుకున్న తండ్రి సక్రాం, తల్లి సేవురీ, బంధువులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదిం చారు. ఒక్కగానొక్క కొడుకు కళ్ల ముందే కాలిపోవడాన్ని చూసి, వారు గుండె పగిలేలా రోదించడం.. చూపరులకు కంట తడి పెట్టించింది.
గృహ ప్రవేశ సంబరం తీరకుండానే...
సక్రాం, సేవురీ దంపతులకు మోహన్, కూతురు మౌనిక ఉన్నారు. కొద్దిపాటిపొలాన్ని సాగు చేస్తూ, వారిద్దరినీ సక్రాం చదివిస్తున్నాడు. అతడు ఇటీవలే కొత్త ఇల్లు నిర్మించాడు. సోమవారం రాత్రి గృహ ప్రవేశ వేడుక జరిగింది. మంగళవారం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. బంధువులతో మంగళవారం రాత్రి వరకూ కళకళలాడిన ఆ ఇల్లు.. తెల్లవారేటప్పటికి విషాదమయంగా మారింది. కొడుకు పూర్తిగా కాలిపోయిన విషయం తెలియని తల్లి సేవురీ.. ‘నా కొడుకుని ఒక్కసారి చూపించండి’ అంటూ, రోదిస్తుండడం స్థానికులకు కన్నీరు తెప్పించింది.
ట్రాన్స్‌కో సిబ్బంది నిర్లక్షమే కారణమంటూ ఆందోళన
మోహన్ మృతికి స్థానిక ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం, ట్రాన్స్‌కో సిబ్బంది నిర్లక్ష్యమే కారణ మంటూ వెంకటాయపాలెం వాసులు కళాశాల ఎదుట రాష్ట్రీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు. తెగిపడిన విద్యుత్ లైన్ నుంచి ఇంజనీరింగ్ కళాశాలకు కరెంటు సరఫరా అవుతోందని, వైరు మంగళవారమే తెగిపడిన విషయం కళాశాల యాజమాన్యానికి తె లుసని, వారు ట్రాన్స్‌కో సిబ్బందికి చెప్పినా కరెంట్ సరఫరా నిలిపివేయలేదని ఆందోళనకారులు అన్నారు.
మోహన్ దుర్మరణానికి ఇటు కళాశాల యాజమాన్యం, అటు ట్రాన్స్‌కో సిబ్బంది బాధ్యులవుతారని అన్నారు. దీనిపై వారు తమకు సమాధానం చెప్పేంతవరకు ఆందోళన విరమించేది లేదని ఆందోళనకారులు పట్టుబట్టారు. తగిన చర్యలు తీసుకుంటామంటూ వారికి సీఐ దేవేం దర్ రెడ్డి నచ్చచెప్పి పంపించేశారు. మోహన్ తండ్రి సక్రాం ఫిర్యాదు మేరకు 304ఎ ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్టు ఏఎస్‌ఐ వి.రామలింగారెడ్డి తెలిపారు.