రానున్న ఎన్నికల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఏలూరు రేంజి డీఐజీ విక్రమ్‌సింగ్ మాన్ తెలిపారు.
గట్టి పోలీసు బందోబస్తు
Feb 13 2014 2:10 AM | Updated on Aug 29 2018 8:54 PM
అడ్డతీగల (తూర్పుగోదావరి), న్యూస్‌లైన్ : రానున్న ఎన్నికల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఏలూరు రేంజి డీఐజీ విక్రమ్‌సింగ్ మాన్ తెలిపారు. ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరగడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని చెప్పారు. ఇందులో భాగంగా మావోయిస్టుల నిరోధక కార్యక్రమాలను ఎప్పటిలాగే అనుభవజ్ఞులైన అధికారులతో కొనసాగిస్తున్నామని వివరించారు. బుధవారం ఆయన తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల సర్కిల్ పరిధిలోని అడ్డతీగల, గంగవరం పోలీసు స్టేషన్లను సందర్శించారు. పోలీసు సిబ్బంది నివసిస్తున్న క్వార్టర్లు, పోలీసు స్టేషన్ భవనాల స్థితిగతులను పరిశీలించారు.
అనంతరం ఏజెన్సీలో భద్రతా చర్యలపై పోలీసు అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఏజెన్సీలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. శిథిలమైన క్వార్టర్ల స్థానే నూతన భవనాల నిర్మాణానికి నిధులు, ఆదేశాలు ఇవ్వమని డీజీపీ కార్యాలయానికి నివేదించామన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా జనమైత్రి సమావేశాలు నిర్వహించడంతో పాటు ఆయా చోట్ల గుర్తించిన సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తిం చాలన్నారు. సాధారణ పర్యటన గానే తాను ఏజెన్సీ ప్రాంతానికి వచ్చానన్నారు. ఆయన వెంట అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్) ప్రకాష్ జాదవ్, డీఎస్పీ చైతన్యకుమార్, అడ్డతీగల సీఐ హనుమంతరావు ఉన్నారు.
Advertisement
Advertisement


