Sakshi News home page

సైకిల్ కంటే షి'కారే' బాగుంటది

Published Tue, Sep 23 2014 11:44 AM

సైకిల్ కంటే షి'కారే' బాగుంటది - Sakshi

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన టీఆర్ఎస్ అందులో సఫలీకృతమైంది. అంతేకాకుండా శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ భారీ మెజార్టీ సాధించి తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకుంది.  అక్కడితో ఆగకుండా రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలను మట్టికరిపించి 'కారు' ఒక్కటే 'షికారు' చేయాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ ఆకర్షణ మంత్రాన్ని మొదలు పెట్టింది.  ఆ దిశగా కారు హైస్పీడ్తో దూసుకుపోతుంది. మొదటగా ఆదిలాబాద్ జిల్లాలో బీఎస్పీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎక్కించుకున్న కారు.... అదే వేగంతో ఖమ్మం జిల్లాలో ప్రవేశించింది. ఆ జిల్లాలో పచ్చ పార్టీ ముఖ్యనేత అయిన తుమ్మల ఆయన అనుచరగణంతో సైకిల్ను 'కిల్' చేయించి మరీ కారు ఎక్కించుకుంది. అక్కడితో ఆగకుండా రెట్టించిన ఉత్సాహంతో కారు ముందుకు దూసుకుపోయి... ఆ పక్కనే ఉన్న వరంగల్ జిల్లాలోకి ప్రవేశించింది.

సైకిళ్లు దిగి వస్తే మంత్రి పదవి ఇచ్చి కారులో షికారు చేయిస్తానంటూ ఆ పార్టీ నాయకులు తెలుగు తమ్ముళ్లను ఊరించారు. దీంతో జిల్లాలోని టీడీపీకి చెందిన ఎర్రబెల్లితోపాటు పలువురు ముఖ్యనాయకులంతా కారు ఎక్కెందుకు రంగం సిద్దమైందని సమాచారం. అలాగే రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నగరాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా కారు తన ఆకర్షణ మంత్రంతో తనవైపునకు తిప్పుకుంది. దసరా పండగ తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది. సదరు ఎమ్ఎల్ఏలంతా ఆ వేదికగా కారులో షికారు చేయనున్నారు. కారు మొదలుపెట్టిన ఆకర్షణ మంత్రంతో సైకిల్, కాంగ్రెస్ పార్టీలు కంగారుపడిపోతున్నాయి. కారు దెబ్బకు ఇప్పటికే ఐదు జిల్లాలలో సైకిల్, హస్తం గల్లంతయాయి. కారు తర్వాత ఏ జిల్లాలో ప్రవేశిస్తుందోనని పచ్చ పార్టీ నాయకులతోపాటు హస్తం పార్టీ నాయకులు తెగ ఠారెత్తిపోతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement