ఆగిన ఎంసెట్ కౌన్సెలింగ్


యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్: తిరుపతిలో ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ నిలిచి పోయింది. సోమవారం ప్రారంభమైన వెబ్ కౌన్సెలింగ్‌ను ఉద్యోగులు బహిష్కరించారు. దీంతో గత్యం తరం లేక కౌన్సెలింగ్‌ను నిలిపివేశారు. ఉన్నత విద్యాశాఖా మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ఇంజనీరింగ్‌లో ప్రవేశానికి సోమవారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. తిరుపతిలో ఎస్వీ పాలిటెక్నిక్ , ఎస్వీ ఆర్ట్స్ కళాశాలల్లో  కౌన్సెలింగ్ జరపాలని నిర్ణయించారు. దీంతో ఈ రెండు కేంద్రాల వద్ద పోలీసులను పెద్ద ఎత్తున  మోహరించారు.



వైఎస్సార్‌సీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ను అడ్డుకోవడానికి వచ్చిన సమైక్యవాదులను పోలీసులు నిలువరించారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో కౌన్సెలింగ్‌కు 150 మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే 8 మంది సర్టిఫికెట్లు మాత్రమే పరిశీలించారు. అప్పటికే సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఎంసెట్ సిబ్బంది విధులను బహిష్కరించినట్లు అధ్యాపకులకు సమాచారం అందింది. వెంటనే ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో ఎంసెట్ కౌన్సెలింగ్ విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులు విధులను బహిష్కరించారు.



దీంతో కౌన్సెలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ సందర్భంగా క్యాంప్ ఆఫీసర్ ఎన్.సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 9 గంటలకే కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించామన్నారు. విధుల్లో ఉన్న 20 మంది ఉద్యోగులు సమైక్యాంధ్ర కోసం విధులు బహిష్కరించడంతో కౌన్సెలింగ్ ప్రక్రియ నిలిపివేశామన్నారు. కౌన్సెలింగ్ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామన్నారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రలో వారం రోజులుగా బస్సులు తిరగడం లేదన్నారు. ఎలాంటి రవాణా సౌకర్యాలు లేని సమయంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తే విద్యార్థులు ఎలా హాజరవుతారని ప్రశ్నించారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రకటన వచ్చే వరకు కౌన్సెలింగ్ జరగనివ్వమన్నారు.



 ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో..

 పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్ కోసం ఇతర జిల్లాల నుంచి కూడా అభ్యర్థులు తల్లిదండ్రులను వెంటబెట్టుకొని పాలిటెక్నిక్ కళాశాల వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే మూడు రోజుల నుంచి కౌన్సెలింగ్ సిబ్బంది సమ్మెలో ఉండడంతో వారు విధులకు హాజరు కాలేదు. దీంతోపాటు ఉద్యమకారులు, ప్రభుత్వ లెక్చరర్ల సంఘం ప్రతినిధులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో అక్కడికి చేరుకొని ధర్నాకు దిగారు. కౌన్సెలింగ్ సెంటర్ ఎదుట మానవహారం నిర్మించి రాస్తారోకో చే శారు. క్యాంప్ ఆఫీసర్ సుధాకర్‌రెడ్డితో చర్చలు జరిపి కౌన్సెలింగ్‌ను ఆపేయాలని కోరారు. దీంతో సుధాకర్‌రెడ్డి అభ్యర్థులతో, వారి తల్లి దండ్రులతో చర్చించి, పరిస్థితిని తిరుపతి ఆర్డీవోకు వివరించి కౌన్సెలింగ్ ప్రక్రియను ఆపివేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో అభ్యర్థులు, వారి వెంట వచ్చిన తల్లిదండ్రులు నిరాశతో వెనుదిరిగారు.



 చిత్తూరులో భారీ భద్రత నడుమ ఎంసెట్ కౌన్సెలింగ్

 చిత్తూరు(టౌన్): చిత్తూరులోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో సోమవారం పోలీసుల భారీ భద్రత నడుమ ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించారు. కళాశాల వద్దకు చేరుకున్న సమైక్యాంధ్ర రాష్ట్ర పరిరక్షణ వేదిక నేతలు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కారణంగా విద్యార్థులు హాజరు కాలేరని, కౌన్సెలింగ్ వాయిదా వేయాలంటూ డిమాండ్ చే స్తూ కౌన్సెలింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో 8 మంది సమైక్యవాదులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో సోమవారం 80 మంది విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరిగింది. దీనికి అడిషనల్ జాయింట్ కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, ఆర్‌డీవో పెంచల్ కిషోర్, ఎంసెట్ కో-ఆర్డినేటర్ డాక్టర్ బాలసుబ్రమణ్యం హాజరయ్యారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top