మూడు రాజధానులతోనే మేలు

Statewide Discussion forums to support decentralization - Sakshi

వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా చర్చావేదికలు 

కొనసాగిన రిలే దీక్షలు

మూడు రాజధానులతోనే రాష్ట్రానికి మేలు కలుగుతుందని మేధావులు, విద్యావేత్తలు స్పష్టం చేశారు. పాలన వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని న్యాయవాదులు, వైద్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు గళమెత్తారు. ఒకే రాజధాని వద్దు–మూడు రాజధానులే ముద్దు అని యువత నినదించింది. కొత్త రాష్ట్రంలో అభివృద్ధికి ఎవరూ అడ్డుపడొద్దని వివిధ రాజకీయ పార్టీల నేతలు సూచించారు. పాలన వికేంద్రీకరణను ఆకాంక్షిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా చర్చా వేదికలు, సదస్సులు, రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు జరిగాయి. మరో వైపు మూడు రాజధానులకు మద్దతుగా రిలే దీక్షలు కొనసాగాయి. 
– సాక్షి నెట్‌వర్క్‌

నిపుణుల సూచనలు పాటించాలి 
నిపుణుల సూచనల మేరకు పాలన వికేంద్రీకరణ చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని వక్తలు పేర్కొన్నారు. మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తూ.. సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల చర్చా వేదికలు జరిగాయి. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు పాల్గొని విశాఖకు పరిపాలనా రాజధాని రావాల్సిందేనని ముక్తకంఠంతో కోరారు. రాజాంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో అన్ని ప్రాంతాలను ప్రగతి పథంలో నడిపించే వికేంద్రీకరణకు మద్దతు పలకాలని తీర్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కంబాల జోగులు పాల్గొన్నారు. ఎచ్చెర్లలోని అంబేడ్కర్‌ యూనివర్సిటీ సెమినార్‌ హాల్‌ ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కొరుపోలు రఘుబాబు మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధికి ఎవరూ అడ్డుపడకూడదన్నారు.

ప్రొఫెసర్లు గుంట తులసీరావు, పెద్దకోట చిరంజీవులు పాల్గొన్నారు. శ్రీకాకుళం, ఆమదాలవలస, టెక్కలిలో నిర్వహించిన సదస్సుల్లో న్యాయవాదులు, వైద్యులు, అధ్యాపకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహించిన సదస్సులో వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ప్రాంతీయ అసమానతల కారణంగానే రాష్ట్రం విడిపోయిందని, మళ్లీ అటువంటి పరిస్థితులు పునరావృతం కాకూడదంటే వికేంద్రీకరణ ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు.

ఉన్నత విద్యామండలి పూర్వ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కేసీ రెడ్డి మాట్లాడుతూ వికేంద్రీకరణను రాజకీయ కోణంలో చూడకుండా ప్రజల, రాష్ట్ర అభివృద్ధి కోణంలో చూడాలన్నారు. ద్రవిడ యూనివర్సిటీ పూర్వ ఉప కులపతి కేఎస్‌ చలం మాట్లాడుతూ 1953లోనే విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలని తీర్మానించారని గుర్తు చేశారు. నాగార్జున యూనివర్సిటీ పూర్వ వీసీ వి.బాలమోహనదాస్‌ మాట్లాడుతూ పరిపాలన, అధికార, పాలన వికేంద్రీకరణతోనే సమాజం ప్రగతి సాధిస్తుందన్నారు. రాజనీతి శాస్త్రజ్ఞులు మొమర్రాజు రవి, పైడా విద్యా సంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్‌ పాల్గొన్నారు.  

వెనుకబాటుతనం పోవాలంటే.. 
విజయనగరం జిల్లా బొబ్బిలి, విజయనగరం, సాలూరు, పార్వతీపురం నియోజకవర్గాల్లో సోమవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు జరిగాయి. వికేంద్రీకరణ వల్లే ఉత్తరాంధ్రలో వెనుకబాటుతనాన్ని పోగొట్టుకోగలుగుతామని మేధావులు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, కోలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్నదొర, అలజంగి జోగారావు పాల్గొన్నారు. గుంటూరు అరండల్‌పేటలోని స్ఫూర్తి ఫౌండేషన్‌ కార్యాలయంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్, దళిత ప్రజాపార్టీ, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, ఉపాధ్యాయ సంఘాలు, బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు హాజరై వికేంద్రీకరణ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. భట్టిప్రోలు, బాపట్లలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, పానుగుంటి చైతన్య పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం, మడకశిరలో చర్చావేదికలు నిర్వహించారు. విప్‌ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే తిప్పేస్వామి పాల్గొన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. కడప అంబేడ్కర్‌ సర్కిల్‌లో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top