
టీడీపీ ఎమ్మెల్యేలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు
టీడీపీ ఎమ్మెల్యేలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ తెల్లం బాలరాజు ధ్వజమెత్తారు.
వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ తెల్లం బాలరాజు
జంగారెడ్డిగూడెం: టీడీపీ ఎమ్మెల్యేలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ తెల్లం బాలరాజు ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయనొక ప్రకటన చేస్తూ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుకునే ప్రయత్నం చేయడం అన్యాయమన్నారు. హుద్‌హుద్ తుపాను బారినపడి ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు తీవ్రంగా నష్టపోయూరని, వారికి నామమాత్ర సాయం అందించి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందన్నారు.
ఇదే విషయాన్ని అసెంబ్లీలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేవనెత్తితే కె.అచ్చన్నాయుడు వాస్తవాలు కప్పిపుచ్చి జగన్‌మోహన్‌రెడ్డిపై దురుసుగా ప్రవర్తించడం తగదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత దూషణలకు దిగటం, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై అవాకులు, చవాకులు పేలుతున్నారన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఇదే విధానాన్ని కొనసాగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అధికార పగ్గాలు చేపట్టాక ఆరు నెలల్లో టీడీపీ చేసిన ఘన కార్యాలు ఏమిటో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ఆరునెలల పాలనలో అర్హులను అనర్హులుగా గుర్తిస్తూ అవకాశం ఉన్నవారికి ప్రభుత్వ ఫలాలు అందకుండా చేయడమే టీడీపీ నాయకుల లక్ష్యం పెట్టుకున్నారని విమర్శించారు. జాబు కావాలంటే బాబు రావాలని గొప్పగా చెప్పిన నాయకులు ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్న ఘనత మీదికాదా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తానని వాగ్దానాలు చేసి తీరా గద్దెనెక్కిన తరువాత రైతులను గందరగోళంలోకి నెట్టారని విమర్శించారు. డ్వాక్రా సంఘాల రుణాల మాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కనీసం వారి ఊసెత్తడం లేదని మండిపడ్డారు. ఆరు నెలల టీడీపీ పాలనలో ఏ వర్గం ప్రజలు సుఖంగా ఉన్నారో చెప్పాలన్నారు.
ఒక పక్క ఐకేపీ యానిమేటర్లు, మరోపక్క ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, రుణమాఫీతో మోసపోయిన రైతన్నలు, ప్రభుత్వం పరంగాఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్ముకున్న రైతులు ఇలా ఎవరైనా మనశ్శాంతిగా జీవిస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రజల కోసం ప్రజల పక్షాన ప్రతిపక్ష నేతగా జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ హాల్‌లో మాట్లాడుతుంటే గొంతు నొక్కి వాస్తవాలను కప్పి పుచ్చడం అవివేకమన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నేతకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డు తగిలితే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.