'స్మార్ట్' పాయిసన్...!

Smart Phone Crashes Radio And Wall Clock In This Generation - Sakshi

ప్రజలపై ఫీచర్ల మాయాజాలం

ఈ–వేస్ట్‌గా సంప్రదాయ పరికరాలు

తూర్పుగోదావరి, కె.గంగవరం: రాత్రి వేళ కరెంట్‌ పోతే కొవ్వొత్తి వెలిగించేందుకు అగ్గిపెట్టె ఎక్కడా అని ఇప్పుడు ఇంట్లో వెతకడం లేదు.. పక్క వ్యక్తి టైం ఎంత? అంటే ఎవరూ ముంజేతిని చూసుకోడం లేదు. ఈవేళ ఏ వారమని అనుమానం వస్తే ప్యాకెట్‌ క్యాలెండర్‌ చూడడం లేదు. ఆడుకునే ఆటబొమ్మలు మాయం అయ్యాయి. బంధువుల యోగక్షేమాలు తెలిపే ఉత్తరాలు దాదాపు శుభలేఖలకే పరిమితమైపోయాయి. సుందర దృశ్యాలు బంధించే కెమేరాలు, జ్ఞాపకాలను పదిలంగా ఉంచే ఫొటో ఆల్బమ్‌లు అరుదుగా కనిపిస్తున్నాయి. సుప్రభాతం వినిపించే రేడియోలు మాయమయ్యాయి. సంగీతంతో ఉత్సాహాన్ని నింపే టేప్‌ రికార్డులు చూద్దామన్నా లేవు. కాలక్షేపంగా ఎవరి చేతిలోనూ పుస్తకాలు కనిపించడం లేదు. వీటన్నిటికీ ఒకటే కారణంస్మార్టు ఫోన్‌..!

పై అవసరాలన్నీ తీర్చే అద్భుత సాధనం స్మార్ట్‌ ఫోన్‌. స్మార్టుగా ఇంట్లోకి దూరి ఎన్నో వస్తువులను దూరం చేసింది.
అవి 1983 వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ జరుగుతున్న రోజులు.. భారత్, వెస్డెండీస్‌ జట్లు ఫైనల్‌లో తలబడుతున్నాయి. అందరూ ఆట గురించి రేడియోలో వచ్చే కామెంట్రీ వింటూ ఆస్వాదిస్తున్నారు. కేవలం ధనవంతులు మాత్రమే అప్పుడే వచ్చిన టెలివిజన్‌లో ఆటను చూస్తూ ఆనందం పొందేవారు. ప్రస్తుతం ఆదే మ్యాచ్‌ను అధిక శాతం ప్రజలు స్మార్ట్‌ఫోన్‌లో నేరుగా వీక్షిస్తున్నారు.
గతంలో ఏమైనా పుస్తకాలు, నవలు, కథలు చదవాలంటే గ్రంథాలయానికో, లేక అద్దెకు ఇచ్చే దుకాణాలకు వేళ్లేవారు. రోజుకింత అద్దె చెల్లించి పుస్తకాన్ని తెచ్చుకుని చదివి తిరిగి ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పుస్తకాలు స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేక్షమవుతున్నాయి. ఆన్‌లైన్‌లో ఏ పుస్తకం కావాలన్నా పీడీఎఫ్‌ రూపంలో లభిస్తుంది. దాన్ని ఎంచక్కా డౌన్‌లోడ్‌ చేసుకుని చదివేసుకోచ్చు.
జీవన శైలిని మార్చడమే కాదు.. సాంప్రదాయ భారతీయుల జీవితంతో పెనవేసుకున్న ఎన్నో మధురానుభూతులను దూరం చేసింది స్మార్ట్‌ ఫోన్‌. యువతే కాదు.. గృహిణులు, ఉద్యోగులు, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, ధనిక, పేద వర్గాలు ఈ అద్భుతాన్ని స్మార్ట్‌గా వినియోగించేస్తున్నారు.
టార్చ్‌లైట్, వాచ్, అలారం, క్యాలెండర్, కాలిక్యులేటర్, కెమెరా, రేడియో, ఆడియో ప్లేయర్, రికార్డర్, డిక్షనరీ, పుస్తకాలు, గేమ్స్, లేఖలు ఇలా ఎన్నో వస్తువుల అవసరాన్ని స్మార్ట్‌ ఫోన్‌ తీరుస్తోంది.
జిల్లాలో సుమారుగా 52 లక్షల మంది జనాభా ఉన్నారు. అందులో సుమారు 60 శాతం మంది స్మార్ట్‌ ఫోన్‌ వినియోగిస్తున్నారని ఓ అంచనా.. ఇందులోనూ 4జీ నెట్‌వర్క్‌తో కూడిన స్మార్టుఫోన్‌ వినియోగించే వారు 20 శాతానికి పైగానే ఉన్నారు. అంటే జిల్లాలో 9 నుంచి 10 లక్షల మంది స్మార్టు ఫోన్‌లను ఉపయోగిస్తున్నారని అంచనా.. నెట్‌వర్క్‌ వేగాలు పెరిగాకా, చౌక అయ్యాకా స్మార్టు ఫోన్‌ వాడే వారి సంఖ్య బాగా పెరిగిందనే చెప్పవచ్చు. దీంతో 6వ తరగతి విద్యార్థి నుంచి వృద్ధుల వరకు వీటిని కొనుగోలు చేస్తున్నారు. నాలుగేళ్ల వయస్సు ఉన్న పిల్లలు సైతం స్మార్టుఫోన్‌లో యాప్‌లను ఓపెన్‌ చేసి వాడుతుండడం మన ఇళ్లలో అనుభవైకమే.

వ్యాపారం మార్చేస్తున్నారు..
స్మార్ట్‌ఫోన్‌ ప్రభంజనంలో కొందరు వ్యాపారులు, మెకానిక్‌లు జీవనోపాధిని కోల్పోయారు. వారిలో మొట్టమొదట చెప్పుకోవలసినది రేడియే సంబంధ వ్యాపార, మెకానిక్‌లే. సెల్‌ఫోన్‌ వస్తూనే ఎఫ్‌ఎం రేడియోను మోసుకొచ్చేసింది. దీంతో రేడియోల వ్యాపారం అమాంతం పడిపోయింది. దీంతో పాటు వాక్‌మెన్‌లు, టేప్‌రికార్డుర్లు, సీడీ ప్లేయర్లు ఒకదాని తరువాత ఒకటి ఉనికిని కోల్పోయాయి. ఒకప్పుడు కొత్త సినిమా ఆడియో వేడుకలు బ్రహ్మాండంగా చేసేవారు. ఇప్పుడు దాని స్థానంలో ప్రీరిలీజ్‌ ఫంక్షన్లు చేస్తున్నారు. ఈ ఫంక్షన్‌కు కొన్ని రోజుల ముందుగానే పాటలను ఆన్‌లైన్‌ ద్వారా జనంలోనికి పంపించేస్తున్నారు. దీంతో గతంలో రేడియాలు, టేప్‌ రికార్డుర్లు, సీడీ ప్లేయర్లు, విక్రయించే దుకాణాలు ఇప్పుడు ఆధునిక ఎల్‌ఈడీ టీవీలు, ఫ్రిజ్‌లు, కూలర్లు విక్రయిస్తూ వ్యాపార సరళిని మార్చుకున్నారు.

వాచ్‌ వ్యాపారులపై ప్రభావం తక్కువే..
స్మార్ట్‌ ఫోన్ల రాకతో వాచ్‌ల వినియోగం తగ్గిన మాట వాస్తవమే అయినా.. వాచ్‌ ధరించడం హోదాకు, గౌరవానికి గుర్తుగా భావిస్తున్నవారూ అధికంగానే ఉన్నారు.

పుస్తకాలు సైతం ఆన్‌లైన్‌లోనే..
ఒకప్పుడు పుస్తకం హస్తాభరణం అనేవారు. కానీ ఇప్పుడు స్మార్టు ఫోన్‌ ఆ అవసరాన్ని భర్తీ చేసింది. యువతీ యువకుల వద్ద స్మార్టుఫోన్‌ లేకపోతే అవమానంగా భావిస్తున్నారు. ఇప్పుడు వారికి అవసరమైన పుస్తకాలను సైతం ఆన్‌లైన్‌లోనే చూసుకుంటున్నారంటే అతిశయోక్తికాదు. ఒకప్పుడు ఎవరైనా బాగా చదువుతున్నాడంటే అతని ఆచూకీ కోసం ముందుగా లైబ్రరీకి వెళ్లేవారు. ఇప్పుడు తలవంచుకుని స్మార్టు ఫోన్‌వైపు చూస్తున్నారు. చిన్నపిల్లలకు ఎదైనా ఇంగ్లీష్‌ పదం అర్థం కాకపోతే డిక్షనరీలో వెతికేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వెంటనే మొబైల్‌ డిక్షనరీ చూసుకుంటున్నారు.

వాచీలు కొనేవారే లేరు
ఐదేళ్ల క్రితం వాచీలు కొనేవారితో షాపులు కిటకిటలాడేవి. రాను రాను విక్రయాలు పూర్తిగా తగ్గిపోయాయి. పెద్ద వయసు ఉన్న వారు కొంత మంది మాత్రమే వాచీలను కొనుగోలు చేస్తున్నారు. యువత మాత్రం వాచీలు కొనడం లేదు. – సుంకర వెంకటేశ్వరరావు, వాచీ షాపు యజమాని

గ్రీటింగ్‌ కార్డులకీ తగ్గిన ఆదరణ..
గతంలో నూతన సంవత్సరం, సంక్రాంతి, ఉగాది, పుట్టిన రోజులకి పలు రకాల గ్రీటింగ్‌ కార్డులను ఇచ్చిపుచ్చుకునేవారు. కానీ రాను రాను స్మార్ట్‌ ఫోన్ల ప్రభావంతో గ్రీటింగ్‌ కార్డ్‌కు పూర్తిగా ఆదరణ తగ్గింది. నూతన సంవత్సరం వస్తోందంటే గ్రామీణ ప్రాంతాల్లో పలు చోట్ల గ్రీటింగ్‌ షాపులు ఏర్పాటు చేసి విక్రయించేవారు. కానీ ప్రస్తుతం వాట్సప్, హైక్, టెలిగ్రాం వంటి పలు సోషల్‌ మీడియా యాప్స్‌ను ఉపయోగించుకుని శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఆటలకు దూరమవుతున్నచిన్నారులు..
గతంలో చిన్నపిల్లలు రోజంతా స్నేహితులతో కలసి ఉల్లాసంగా ఆటలాడుకునే వారు. ఈ ఆటలతో వారికి శారీరక వ్యాయామంలా మారి ఆరోగ్యకరంగా ఉండేవారు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లు వచ్చాక చిన్నారులు ఆటలకు దూరం అయ్యారు. ఇంట్లోనే ఒక మూలన కూర్చుని గేమ్స్‌ ఆడుతూ కనిపిస్తున్నారు. పెద్దవారు ఏదో పిచ్చాపాటీ మాట్లాడుకునే వారు. ఇప్పుడు పక్కన ఎవరున్నారన్న విషయం గుర్తించక స్మార్ట్‌ఫోన్‌ యాప్‌లతో గడిపేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top