ప్రపంచ జనాభాలో అత్యధికం ‘జూమర్స్‌’.. ఇంతకూ మీరు ఏ తరానికి చెందినవారు?

Here How Each Generation Grew Up In Unique Period Of Time - Sakshi

తరాల అంతరాలను కొలిచే సాధనాలు

కాలమాన పరిస్థితులకు అనుగుణంగామారుతున్న తరాలు

ప్రపంచవ్యాప్తంగా ఇదే విభజన.. పరిస్థితులు విభిన్నంగా ఉన్నా మనకూ ఇదే వర్గీకరణ

భారత్‌లో మిలీనియల్స్‌ను సంస్కరణల తరంగా పరిగణించే ప్రతిపాదన

దొడ్డ శ్రీనివాసరెడ్డి
సరదా కోసమైనా, సమాచారం కోసమైనా రేడియోనే దిక్కయిన తరం ఒకటి.. అరచేతిలో స్మార్ట్‌ ఫోన్‌తో ప్రపంచాన్నే చుట్టబెడుతున్న తరం మరొకటి..యుద్ధాలు, సంక్షోభాలు, మహమ్మారుల మధ్య భయంగా గడిపిన తరం ఇంకొకటి.. ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాల్లో, పోరాటాల్లో పాల్గొన్నది వేరొకటి.. ..దాదాపు ప్రతి తరం ఒక ప్రత్యేకమైన కాలమాన పరిస్థితుల్లో ఎదిగింది. విభిన్నమైన ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులను అనుభవించింది. ఈ ప్రతి తరం కూడా నాటి ఆ పరిస్థితులకు ప్రత్యేక గుర్తులే. ఆ గుర్తులకు అనుగుణంగానే ఒక్కో తరానికి ఒక్కో పేరు పెట్టారు.

అమెరికాలో మొదలై..
తరాల అంతరాలను గుర్తించి, వాటికి నామకరణం చేయడం అమెరికాలో మొదలైంది. ఒక్కో తరానికి ఉన్న ఒక విలక్షణమైన అంశాన్ని పరిగణనలోకి తీసుకుని బూమర్స్, జూమర్స్, మిలీనియల్స్‌ అంటూ పేర్లను అమెరికా సామాజిక వేత్తలు, మేధావులు, రచయితలు ఖాయం చేశారు. అటుఇటుగా అలాంటి పరిస్థితులే ఉన్న పాశ్చాత్య దేశవాసులు కూడా అవే పేర్లు, వర్గీకరణను వాడకంలోకి తెచ్చారు. మరి ఇంతకీ ఈ తరాలు, వాటి ప్రత్యేకతలు, వాటి కాలమాన పరిస్థితులు ఏమిటి?

సైలెంట్‌ జనరేషన్‌  (1928–1945): యవ్వనమంతా కష్టాల్లో గడిపి..
ఈ తరం వాళ్లు పసితనంలోనే 1930నాటి మçహా ఆర్థిక సంక్షోభాన్ని చవిచూశారు. యుక్త వయసు వచ్చే నాటికి రెండో ప్రపంచ యుద్ధం పాలినపడ్డారు. జీవితమంతా కష్టాలనోర్చుకొని సాగిన ఈ తరం వారు ఇప్పుడు 77 నుంచి 94 ఏళ్ల మధ్య వయస్కులై ఉంటారు. వయసు మీరిన తర్వాతే ఈ తరం ప్రపంచవ్యాప్తంగా సాగిన అభివృద్ధిని వీక్షించింది. యవ్వనమంతా అష్టకష్టాల్లో, భయంభయంగా గడిపిన ఈ తరానికి సైలెంట్‌ జనరేషన్‌ అని పేరు వచ్చింది.

బేబీ బూమర్స్‌ (1946–1964): జనాభాను పెంచి..
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదలైంది ఈ తరం. యుద్ధంలో చెల్లాచెదురైన వారంతా మళ్లీ ఏకమై స్థిర నివాసం ఏర్పరుచుకోవడంలో ఒక్కసారిగా ప్రపంచ జనాభా పెరగడం మొదలైంది. అందుకే ఈ తరానికి బేబీ బూమర్స్‌గా నామకరణం చేశారు. మిగతా తరాలకు రచయితలో, సామాజికవేత్తలో పేర్లు పెడితే.. ఒక్క ఈ తరానికి మాత్రం అధికారికంగా అమెరికా జనాభా వివరాల సేకరణ బ్యూరో ‘బేబీ బూమర్స్‌’గా నామకరణం చేసింది.

ఈ తరం వాళ్లు ప్రస్తుతం 58 నుంచి 76 ఏళ్ల మధ్య వయస్కులై ఉంటారు. ఉద్యోగ విరమణ చేసి మనవళ్లతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఈ తరం రాజకీయంగా, సామాజికంగా అనేక మార్పుల్ని చవిచూసింది. చిన్నతనంలో కొరియా యుద్ధం, యవ్వనంలో వియత్నాం యుద్ధం, తర్వాత మొదలైన యుద్ధ వ్యతిరేక, పౌరహక్కుల ఉద్యమాలకు ప్రత్యక్ష సాక్షులు ఈ తరం వారు. అంతరిక్ష రంగంలో మానవుడి తొలి విజయాలకు సాక్షి ఈ తరం. అమెరికా, రష్యా విభేదాలతో రెండుగా చీలిన ప్రపంచంలో వీరు మనుగడ సాగించారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ టీవీతో మొదలై వైఫైదాకా సాగిన సాంకేతిక విప్లవాన్ని ఆస్వాదించిందీ తరం.

జనరేషన్‌ ఎక్స్‌    (1965–1980): విభిన్నమైన మార్పులు చూసి..
కెనడాకు చెందిన జర్నలిస్టు, రచయిత కాప్‌లాండ్‌ రచించిన ‘జనరేషన్‌ ఎక్స్‌.. టేల్‌ ఫర్‌ యాన్‌ యాక్సిలరేటెడ్‌ కల్చర్‌’అనే నవల ఆధారంగా ఈ తరానికి జనరేషన్‌ ఎక్స్‌ అని పేరు పెట్టారు. ప్రపంచం అనూహ్య రీతిలో పరిణామం చెందుతున్న దశలో.. సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్లో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో మొదలైన ఈ తరంవారు ఇప్పుడు 42 నుంచి 57 ఏళ్ల మధ్య వయసులో ఉన్నారు.

కంప్యూటర్‌ శకానికి ఆద్యులైన ఈ తరంలో ఇంకా అటు వార్తా పత్రికలు, మ్యాగజైన్లు చదివేవారి నుంచి ఇటు స్మార్ట్‌ ఫోన్లకు అలవాటుపడుతున్న వారిదాకా ఉన్నారు. గత తరాల కంటే ఈ తరం విద్యా రంగంలో అత్యున్నత శిఖరాలకు చేరుకుంది. అలాగే ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన పాప్‌ కల్చర్‌కు సాక్షులు ఈ తరంవారు. స్నేహ హస్తాన్ని చాచి బెర్లిన్‌ వాల్‌ను కూల్చివేసిన ఘటన నుంచి విద్వేషం వెర్రితలలు వేసి న్యూయార్క్‌లో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ ట్విన్‌ టవర్లను కూల్చివేసిన 9/11 ఘటన దాకా ఎన్నో చూసింది ఈ తరం.

మిలీనియల్స్‌   (1981– 1996): సాంకేతిక విప్లవంతో ఎదిగి..
సహస్రాబ్దికి చేరువలో పుట్టిన ఈ తరాన్ని మిలీని­యల్స్‌ అని పిలుస్తున్నారు. మొదట ఈ తరాన్ని జనరేషన్‌ వై అని పిలిచారు. కానీ అమెరికన్‌ రచయితలు విలియం స్ట్రాస్, నీల్‌ హోవే 1980 తర్వాత జన్మించిన వారిని మిలీనియల్స్‌ అని నామకరణం చేయడంలో ఈ తరానికి ఆ పేరేస్థిర­పడింది. ప్రస్తుతం ప్రపంచంలో గత తరాలతో పోలిస్తే అత్యధిక సంఖ్యాకులు మిలీనియల్సే.

దాదాపు 180 కోట్ల మంది అంటే ప్రపంచ జనాభాలో దాదాపు 23 శాతం మంది ఈతరం వారే. ఆసియాలో వీరి సంఖ్య 25 శాతంపైనే ఉంటుంది. ప్రపంచంలో అత్యధిక శాతం విద్యావంతులు ఈ మిలీనియల్సే. 25 శాతం పైగా గ్రాడ్యుయేషన్‌ లెవెల్‌లో ఉన్నవారే. ఈ తరం వారి ప్రస్తుత వయసు 26 నుంచి 41 సంవత్సరాలు. సాంకేతిక విప్లవంతోపాటు ఎదిగిన ఈ తరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తోంది. రాజకీయాలు మొదలు అన్ని రంగాలను శాసించగల సత్తా ఉన్న తరం ఇది.

జనరేషన్‌ జెడ్‌   (1997–2012): ఇంటర్నెట్‌తో ఆడుతూపాడుతూ..
ఇంటర్నెట్‌ను జూమ్‌ చేస్తూ ఎదిగిన ఈ తరం వారిని జూమర్స్‌ అని కూడా పిలుస్తారు. ఈ తరానికి చెందినవారు ప్రస్తుతం పదేళ్ల నుంచి 26 ఏళ్ల మధ్య వయస్కులు. మిలీనియల్స్‌ కంటే వీరి సంఖ్య ఎక్కువ. ప్రపంచ జనాభాలో వీరే 26 శాతం ఉన్నారు. 2025 నాటికి ప్రపంచ ఉద్యోగ వర్గంలో 27 శాతం జూమర్సే ఉంటారు. ఇంటర్నెట్‌ పూర్తిస్థాయిలో వినియోగించిన తొలితరం ఇదే. గూగుల్‌తోపాటు ఎదుగుతున్న ఈ తరం సమస్త దైనందిన కార్యక్రమాలను స్మార్ట్‌ఫోన్‌తో చేసుకుపోతోంది. ప్రపంచాన్నీ స్మార్ట్‌ఫోన్‌ నుంచే వీక్షిస్తోందీ తరం.

జనరేషన్‌ ఆల్ఫా  (2013 నుంచి మొదలు): మారిన జీవన శైలితో...
ఇరవై ఒకటో శతాబ్దంలో పుట్టిన తరం ఇది. గ్రీక్‌ అక్షరమాలలో తొలి అక్షరమైన ఆల్ఫాను ఈ తరానికి పేరుగా పెట్టారు. ప్రపంచాన్ని అతలాకు­తలం చేసిన కోవిడ్‌–19 ఈ తరంలోనే విశ్వ­వ్యాప్తమైంది. ఈ కోవిడ్‌తో మారిన జీవన శైలిని అనుసరించబోతోంది ఆల్ఫా జనరేషన్‌. ఏటా 25­లక్షల మంది ఈ తరానికి తోడవుతున్నారు. 2025 నాటికి వీరి సంఖ్య 200 కోట్లకు చేరబోతోంది.

జన జీవితంలో ప్రతి పదిహేను, ఇరవై సంవత్సరాలకోసారి స్పష్టమైన మార్పులు వస్తుంటాయి. ఆ కాలాన్నే తరంగా అభివర్ణిస్తున్నామని ప్రజల జీవన పోకడలను నిరంతరం పరిశీలిస్తూ, విశ్లేషిస్తూ ఉండే ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ చెబుతోంది. తరాలను వర్గీకరించడం, వాటికి పేర్లు పెట్టడం సైన్స్‌ ఏమీ కాదు. కేవలం ఆ తరం ఆలోచనలు, అభిరుచులను, పోకడలను అంచనా వేయడం కోసం ఒక సాధనం మాత్రమేనని ప్యూ సెంటర్‌ అభిప్రాయం. అసలు తరాల వర్గీకరణను గత శతాబ్ది మొదట్లోనే జర్మన్‌ సామాజిక శాస్త్రవేత్త కార్ట్‌ మన్హెమ్, స్పానిష్‌ తత్వవేత్త జోస్‌ ఒర్తెగా మొదలు­పెట్టారు. ఇది ఒకే కాలమాన పరిస్థితుల్లో జీవించే వారి మధ్య ఉండే సామీప్యతలను అర్థం చేసుకోవ­­డానికి ఉపయోగపడుతుందని వారి వాదన.

మన దగ్గర తరాల పరిస్థితి ఏమిటి?
పాశ్చాత్య దేశాల్లో జరిగిన తరాల వర్గీకరణ వంటిది మన దగ్గర జరగలేదు. గ్లోబలైజేషన్‌తో ప్రపంచమంతా ఒకేలాంటి పరిస్థితులు ఆవిర్భవించిన నేపథ్యంలో మిలీనియల్స్‌ నుంచి మనం కూడా పాశ్చాత్య వర్గీకరణను పాటిస్తున్నాం. అయితే విభిన్న పరిస్థితులున్న పాతతరాన్ని అంచనా వేసే ప్రయత్నం భారత్‌లో పెద్దగా జరగలేదు. కొందరు ఔత్సాహికులు భారతీయుల్ని దేశ విభజన తరం (1944–1963), పరివర్తన తరం (1964–1983) సంస్కరణల తరం (1984 నుంచి మొదలు)గా విభజించి విశ్లేషించే ప్రయత్నం చేశారు.

మిలీనియల్స్‌ను మన దగ్గర సంస్కరణల తరంగా పరిగణించాలని, ఈ కాలంలోనే భారత సమాజం సమూల మార్పులను చవిచూసిందని అంటున్నారు భారతీయ సామాజిక వేత్తలు. రాజీవ్‌గాంధీ హయాంలో మొదలైన కంప్యూటరీకరణ నుంచి పీవీ నరసింహారావు హయాంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలతో భారతదేశ ఆర్థిక, సామాజిక పరిస్థితులు విపరీతమైన మార్పులకు లోనయ్యాయన్నది వీరి పరిశీలన. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top