కర్నూలు జిల్లాలో 6 కొత్త మున్సిపాలిటీలు..! 

Six More Major Panchayats In Kurnool District Upgraded As Municipalities - Sakshi

ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు 

ఈనెల 31 లోపు నివేదికలు ఇవ్వాలని ఆదేశాలు 

జిల్లాలో 15కు పెరగనున్న పట్టణాల సంఖ్య  

సాక్షి, కర్నూలు (టౌన్‌): పట్టణీకరణ వేగవంతం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలను  నగర పంచాయతీలుగా, నగర పంచాయతీలను మునిసిపాలిటీలుగా అప్‌గ్రేడ్‌ చేస్తోంది. తద్వారా కేంద్ర నుంచి ప్రత్యేక నిధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే పట్టణాలు మరింత అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుంది. మునిసిపాలిటీలను పెంచితే ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని ప్రభుత్వ భావన. అందులో భాగంగా జిల్లాలో మరో 6 మేజర్‌ పంచాయతీలను మునిసిపాలిటీలుగా అప్‌గ్రేడ్‌ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మున్సిపల్‌ డైరెక్టర్‌ విజయకుమార్‌.. ఆయా మేజర్‌ గ్రామ పంచాయతీల సమీపంలో ఉన్న గ్రామాలు కలుపుకునే అవకాశాలకు సంబంధించి నివేదకలు తయారు చేయాలని  ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 31 వ తేదీలోపు నివేదికలు ప్రభుత్వానికి పంపించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

ఆరు మేజర్‌ పంచాయతీలకు మహర్దశ.. 
జిల్లాలోని బేతంచెర్ల, కోవెలకుంట్ల, పత్తికొండ, కోడుమూరు, బనగానపల్లె, పాణ్యం మేజర్‌ పంచాయతీలను అప్‌గ్రేడ్‌ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెలాఖరుకు నివేదికలు అందిన తరువాత నెలరోజుల పాటు ప్రజాభిప్రాయం తీసుకుంటారు. ఆయా పంచాయతీల పరిధిలో విలీన గ్రామాల ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు తీసుకొని ఆ తరువాత ఆధికారికంగా ప్రభుత్వం ప్రకటన విడుదల చేయనుంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం త్వరలో మునిసిపల్‌ ఎన్నికలు నిర్వహించనుంది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకు ముందే పంచాయతీలను మునిసిపాలిటీలుగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు తగిన చర్యలు చేపడుతోంది. 

15కు చేరనున్న పట్టణాల సంఖ్య : కొత్తగా 6 మునిసిపాలిటీలు ఏర్పడితే..జిల్లాలో పట్టణాల సంఖ్య 15కు చేరుకుంటుంది. ఇప్పటికే జిల్లాలో కర్నూలు మునిసిపల్‌ కార్పొరేషన్‌తో పాటు ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు మునిసిపాలిటీలుగా ఉన్నాయి. గూడూరు, ఆళ్లగడ్డ నగర పంచాయతీలు ఉన్నాయి. కర్నూలు మునిసిపల్‌ కార్పొరేషన్‌కు తొమ్మిదేళ్లుగా వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించలేదు. జిల్లాలోని ఇతర మునిసిపాలిటీలు, నగర పంచాయతీల పాలకవర్గం గడువు ముగిసింది. కొత్త మునిసిపాలిటీలు ఏర్పాటైన తరువాత ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top