
హత్య కేసులో ఆరుగురి అరెస్టు
హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు కాజీపేట డీఎస్పీ జనార్దన్, మడికొండ సీఐ డేవిడ్‌రాజ్ తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో బుధవారం నిందితుల వివరాలను వారు వెల్లడించారు.
మడికొండ : హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు కాజీపేట డీఎస్పీ జనార్దన్, మడికొండ సీఐ డేవిడ్‌రాజ్ తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో బుధవారం నిందితుల వివరాలను వారు వెల్లడించారు. కరీనంగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన రౌతు రాంచందర్ రైల్వేలో పనిచేసి వలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆయనకు రవి, సతీష్ కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రాంచందర్ తన ఉద్యోగాన్ని సతీష్‌కు ఇవ్వడానికి అంగీకరించాడు. అనంతరం రాంచందర్ మృతిచెందాడు. ఈ క్రమంలో తండ్రి ఉద్యోగాన్ని తమ్ముడు సతీష్‌కు ఇవ్వడానికి ఇష్టపడని రవి.. తన చెల్లి రాణికి వచ్చే విధంగా చేశాడు.
గతంలోనూ ఉద్యోగ విషయమై రవిపై సతీష్ కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో పెద్దపల్లిలో నివాసం ఉంటున్న సతీష్ అక్కడ ఆయనకు దైత సన్నీతేజతో పరిచయం ఏర్పడింది. తన అన్నను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని సన్నీతేజకు సతీష్ చెప్పాడు. విషయాన్ని సన్నీతేజ భీమారంలో ఉంటున్న తన బంధువు జన్ను వరుణ్‌రాజ్‌కు తెలిపాడు.
వరుణ్‌రాజ్ హన్మకొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇద్దరు కలిసి రౌతు రమేష్‌ను చంపేందుకు రూ.లక్షన్నరకు బేరం కుదుర్చుకున్నారు. పథకం ప్రకారం సతీష్ ముందుగానే కడిపికొండలోని బంధువుల వద్దకు వచ్చాడు.
పార్టీకి రావాలని జనవరి 14న తన అన్నకు సతీష్ ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ముందుగానే ప్లాన్ వేసుకున్న సన్నీతేజ, వరుణ్‌రాజ్ మద్యం బాటిళ్లను కొనుగోలు చేసుకుని మడికొండ శివారులోని ఎల్లమ్మ గుడి సమీపంలో కూర్చున్నారు. అదే సమయంలో వరుణ్‌రాజ్ తన స్నేహితులు గట్టు క్రాంతికుమార్, ఆరిఫ్ (ఇంజినీరింగ్ విద్యార్థి), సునీల్‌ను సైతం పార్టీ చేసుకుందామని ఫోన్ చేసి రప్పించాడు.
అయితే రాత్రి కావడంతో క్రాంతికుమార్, ఆరిఫ్, సునీల్‌ను పంపించి వేశారు. రౌతు రవికి మద్యం ఎక్కువగా తాగించి పథకం ప్రకారం కత్తితో పొడిచారు. కింద పడి లేవడానికి ప్రయత్నిస్తుండగా మద్యం బాటిల్‌ను తలపై బలంగా కొట్టడంతో రవి చనిపోయాడు. అనంతరం రౌతు సతీష్, సన్నీతేజ, వరుణ్‌రాజ్ రాత్రికి రాత్రే హైదరాబాద్‌కు వెళ్లారు.
ఉదయం సతీష్ ఎంజీఎం ఆస్పత్రికి వచ్చి తన అన్నను అక్క, బావ చంపి ఉంటారని పోలీసులను పక్కదారి పట్టించే ప్లాన్ చేశాడు. కానీ, క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్ ఆధారంగా దొరుకుతామని భావించిన సతీష్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. సతీష్ తెలిపిన వివరాల ప్రకారం ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రూ.50 వేల నగదు, కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ, సీఐ తెలిపారు.
విద్యార్థులు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు..
చదువుకునే సమయంలో విద్యార్థులు జల్సాలకు అలవాటు పడి భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని కాజీపేట డీఎస్సీ జనార్దన్ అన్నారు. హత్య జరిగే ముందు మద్యం తాగడానికి వచ్చిన వారిలో ఒకరు ఇంజినీరింగ్ విద్యార్థి, మరొకరు డిగ్రీ విద్యార్థి ఉన్నారని తెలిపారు. యువకులు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని ఆయన సూచించారు.