మాన్యం భూములపై మాటేశారు | Shri VenuGopalaSwami temple lands targeted by TDP leaders | Sakshi
Sakshi News home page

మాన్యం భూములపై మాటేశారు

Feb 11 2015 11:52 PM | Updated on Jul 29 2019 6:07 PM

మాన్యం భూములపై మాటేశారు - Sakshi

మాన్యం భూములపై మాటేశారు

బంగారుపేటలోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయ భూములపై టీడీపీ నేతలు కన్నేశారు

తమ్ముళ్లకు కట్టబెట్టేందుకు యత్నం
వేలంపాట పాడకుండా అడ్డుకుంటున్న వైనం
800 ఎకరాలు ఉన్నా స్వామికి దీపం పెట్టే దిక్కులేదు
శిథిలావస్థకు చేరిన బంగారుపేట వేణుగోపాలస్వామి ఆలయం

 
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : బంగారుపేటలోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయ భూములపై టీడీపీ నేతలు కన్నేశారు. వేలంపాట జరగనివ్వకుండా చేసి ఆ భూములను పంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే వందల ఎకరాల ఆసామి అయిన శ్రీవేణుగోపాలస్వామికి దీపం పెట్టే వారు కరువయ్యారు. ప్రస్తుతం ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. వివరాల్లో కెళితే... వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని బంగారుపేటలో శ్రీవేణుగోపాలస్వామి పురాతన ఆలయం ఉంది.

ఈ ఆలయానికి బాలాయపల్లి మండలపరిధిలో సర్వేనంబర్ 180ఏ, 150, 154, 155, 156, 157లో సుమారు 803.30 ఎకరాల భూములున్నట్లు స్థానికులు చెబుతున్నారు. 180ఏ, 150, 154 సర్వే నంబర్లలోని 165.25 ఎకరాలను ఇప్పటికే కొందరు వేలంపాట ద్వారా దక్కించుకుని పంటలు సాగుచేస్తున్నారు. ఎకరం ఏడాదికి కేవలం రూ.600 చొప్పునే దక్కించుకున్నారు. ఇదే విషయాన్ని ఈఓ రామచంద్రరావు స్పష్టం చేశారు. వేలంపాట ద్వారా  మాన్యం భూములపై మాటేశారు దక్కించుకున్న వారిలో ఎక్కువమంది టీడీపీకి చెందిన నాయకులేనని స్థానికులు చెబుతున్నారు.

వేలంపాట ద్వారా పాడుకున్న పొలంలో నిబంధనలకు విరుద్ధంగా పంటలు సాగుచేస్తున్నట్లు స్థానికులు వెల్లడించారు. దీర్ఘకాలిక పంటలు, బోర్లు వేయకూడదని నిబంధనలు ఉన్నా.. కొందరు టీడీపీ నేతల అనుచరులు నిమ్మతోటలు, బోర్లువేసి యథేచ్ఛగా సాగు చేసుకుంటున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సాగుచేసుకుంటున్న వారిలో టీడీపీ నేతల బినామీలు కూడా ఉన్నారు.

వేలం జరగనివ్వకుండా అడ్డుకుంటున్న తమ్ముళ్లు

157-1,2,3,4,5,6,7,8లోని మరో 171.05 ఎకరాలకు వేలంపాట పెట్టేందుకు అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు ఇప్పటికే రెండు పర్యాయాలు వేలంపాట పెట్టారు. ఓసారి వేణుగోపాలపురంలో.. మరోసారి కయ్యూరులో జరిపినా.. టీడీపీ నేతలు కొందరు వాయిదా వేయించారు. వేలంపాటకు ఎవరూ రాకపోతే ఎకరం రూ.600కే దక్కించుకునేందుకు పథకం వేశారు. అయితే బంగారుపేట గ్రామానికి చెందిన కూన మల్లికార్జునయ్యతో పాటు మరికొందరు స్థానికులు డబ్బులతో వేలం వద్దకు చేరుకున్నారు.

అయితే పాట పాడనివ్వకుండా కారణం లేకుండానే అడ్డుకున్నారు. ఎలాగైనా మాన్యం భూములను టీడీపీ నేతలు సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకు అధికారులు కొందరు సహకరిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆలయానికి మాన్యం ఎన్ని ఎకరాలున్నాయో సంబంధిత అధికారులుకు ఇప్పటికీ తెలియకపోవటం గమనార్హం.శిథిలావస్థకు చేరిన ఆలయం.. బంగారుపేటలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది.

దీపం పెట్టేవారు కూడా కరువయ్యారు. ఆలయం చుట్టూ ఉన్న ప్రహరీని సైతం కూల్చివేసి ఉన్నారు. అదేవిధంగా పిచ్చిమొక్కలు మొలిచి అధ్వానంగా దర్శనమిస్తోంది. ప్రస్తుతం ఆలయం మాన్యం భూముల నుంచి ప్రతి ఏటా సుమారు రూ.60 వేల వరకు కౌలు వస్తోందని ఈఓ రామచంద్రరావు స్పష్టం చేశారు. అదేవిధంగా ఆలయ పూజారి నివసిస్తున్న నివాసం కూడా శిథిలమైంది. ప్రతి ఏటా శ్రీవేణుగోపాలస్వామి ఉత్సవాల సందర్భంగా పెద్దరథం ఊరేగింపు జరిగేదని స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రస్తు తం రథం లేదు.. రథం షెడ్డు కూలిపోయి దర్శనమిస్తోంది.

ధూపదీప నైవేద్యాలు జరుపుతున్నాం: ఈఓ రామచంద్రరావు

శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో నిత్యం ధూపదీప నైవేద్యాలు జరిపిస్తున్నాం. ఒక పూజారి, వాచ్‌మన్‌ను ఉన్నారు. వారికి ప్రతినెలా రూ.3వేల చొప్పున ఇస్తున్నాం. మాన్యం భూములకు సంబంధించి వేలంపాట వాయిదాపడింది. త్వరలో జరిపించేందుకు ప్రయత్నిస్తున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement