మండలంలోని రూప్‌ఖాన్‌పేట్ సర్పంచ్ పదవికి, చిగురాల్‌పల్లి ఒకటో వార్డుకు శనివారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
	పరిగి, న్యూస్‌లైన్: మండలంలోని రూప్‌ఖాన్‌పేట్ సర్పంచ్ పదవికి, చిగురాల్‌పల్లి ఒకటో వార్డుకు శనివారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థిని నీరటి అనసూయ రూప్‌ఖాన్‌పేట్ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఆమె తన సమీప అభ్యర్థి నర్సమ్మపై 34 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అలాగే మండలంలోని చిగురాల్‌పల్లి ఒకటో వార్డు సభ్యుడిగా ఎర్రోల్ల జంగయ్య సమీప ప్రత్యర్థి ఆర్.నర్సమ్మపై 19 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
	
	 రూప్‌ఖాన్‌పేట్ సర్పంచ్ బసమ్మ, చిగురాల్‌పల్లి ఒకటో వార్డు సభ్యుడు అనంతయ్యలు కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందటంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. సర్పంచ్ పదవికి ముగ్గురు పోటీ చేయగా అందులో ఒకరు డమ్మీగా మారి ఆ వర్గం వారు మరో అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. దీంతో అనసూయ, నర్సమ్మల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. గ్రామ పంచాయతీ ఓట్లు మొత్తం 2,061. ఇందులో 1649 ఓట్లు (80 శాతం) పోలయ్యాయి.
	
	నీరటి అనసూయకు 803 ఓట్లు వచ్చాయి. ఆమె సమీప అభ్యర్థి నర్సమ్మకు 769 ఓట్లు వచ్చాయి. మరో అభ్యర్థి పరిగి పద్మకు 26 ఓట్లు వచ్చాయి. మొత్తం పోలైన ఓట్లను రెండు రౌండ్లలో లెక్కించారు. ఒకటో రౌండ్‌లో అనసూయకు 418 ఓట్లు, పద్మకు 17, నర్సమ్మకు 433 ఓట్లు వచ్చాయి. రెండవ రౌండ్లో  అనసూయకు 385, నర్సమ్మకు 336, పద్మకు 9 ఓట్లు వచ్చాయి. దీంతో అనసూయ సర్పంచ్‌గా గెలిచినట్లుగా రిటర్నింగ్ అధికారి రూప్‌సింగ్ ఆమెకు ధ్రువీకరణ పత్రం అందజేశారు.
	
	 సానుభూతిదే పైచేయి
	 రూప్‌ఖాన్‌పేట్ సర్పంచ్ ఎన్నికల్లో  సానుభూతిదేపై చేయిగా నిలిచింది. ప్రధాన పార్టీలన్ని ఏకమై బీజేపీ బలపరిచిన అభ్యర్థి అనసూయను ఓడించే ప్రయత్నం చేసినప్పటికీ సానుభూతి ఓట్లతో అనసూయ 34 ఓట్లతో గెలిచారు. దీంతో గతంలో మృతి చెం దిన సర్పంచ్ బసమ్మ (కోడలు అనసూయ) కుటుంబానికే ఓటర్లు పదవి ని మళ్లీ కట్టబెట్టారు. దీంతో మ ండలంలో బీజేపీకి ఉన్న ఒక్కగానొక్క స ర్పంచ్‌ను తిరిగి నిలబెట్టుకున్నట్లైంది.
	
	 పిన్న వయసులోనే..
	 ప్రస్తుతం రూప్‌ఖాన్‌పేట్ సర్పంచ్‌గా గెలుపొందిన సర్పంచ్ అనసూయ(21)ను అతి చిన్న వయసులోనే సర్పంచ్ పదవి వరించింది. ప్రస్తుతం ఆమె మహబూబ్‌నగర్ ఎన్టీఆర్ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో బీకాం ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. అయితే ఇటీవల రూప్‌ఖాన్‌పేట్ సర్పంచ్ బసమ్మ మృతి చెందిన తర్వాత ఆమె కుమారుడు శ్యాంసుందర్ అనసూయను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని సర్పంచ్ బరిలో నిలిపారు. దీంతో 21 సంవత్సరాల వయసులోనే ఆమెను సర్పంచ్ పదవి వరించింది.
	 
	 మిన్నంటిన సంబరాలు..
	 బీజేపీ బలపర్చిన అభ్యర్థి అనసూయ గెలుపుతో  రూప్‌ఖాన్‌పేట్ సంబరాలు మిన్నంటాయి. గెలుపు ఖాయమైన వెంటనే బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని పాఠశాల చౌరస్తానుంచి గ్రామంలోని హనుమాన్ దేవాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
