ఇద్దరు రైతులు సజీవదహనం | Sajivadahanam two farmers | Sakshi
Sakshi News home page

ఇద్దరు రైతులు సజీవదహనం

Jun 17 2014 1:33 AM | Updated on Oct 1 2018 2:03 PM

ఇద్దరు రైతులు సజీవదహనం - Sakshi

ఇద్దరు రైతులు సజీవదహనం

ఖరీఫ్ సీజన్ సమీపిస్తుండటంతో పొలంలోని తుక్కు తగలబెట్టేందుకు వెళ్లిన అన్నదాతలు ఇద్దరు ఆ మంటల్లోనే చిక్కుకుని సజీవదహనమయ్యారు.

  • పొలంలో తుక్కు తగలబెట్టేందుకు వెళ్లి మృత్యువాత
  •  వేకనూరులో ఒకరు.. వైవాకలో మరొకరు
  •  కుటుంబసభ్యులు, గ్రామస్తుల్లో తీవ్ర విషాదం
  • ఖరీఫ్ సీజన్ సమీపిస్తుండటంతో పొలంలోని తుక్కు తగలబెట్టేందుకు వెళ్లిన అన్నదాతలు ఇద్దరు ఆ మంటల్లోనే  చిక్కుకుని సజీవదహనమయ్యారు. హృదయవిదారకమైన ఈ ఘటనలు అవనిగడ్డ మండలం వేకనూరు, ముదినేపల్లి మండలం వైవాకలో సోమవారం జరిగాయి. ఒకే విధమైన ఘటనలు రెండుచోట్ల జరగడం యాదృచ్ఛికమే అయినా.. కుటుంబసభ్యులు, గ్రామస్తుల్లో తీరని విషాదం నింపాయి.
     
    వేకనూరు (అవనిగడ్డ) : మండలంలోని వేకనూరుకు చెందిన తుంగల సీతారామయ్య (65) గత రబీలో ఎకరం పొలం కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగుచేశాడు. ఎకరానికి 40 క్వింటాళ్లకు పైగా దిగుబడి సాధించాడు. రానున్న ఖరీఫ్‌లో నారుమడులు పోసుకునేందుకు సన్నద్ధమైన రైతు మొక్కజొన్న తుక్కు, మోడులు ఆటంకంగా ఉంటాయని భావించి సోమవారం ఉదయం 9.30 గంటలకు వీటిని తగలబెట్టేందుకు వేకనూరులో ఓఎన్‌జీసీ డ్రిల్లింగ్‌కు ఎదురుగా ప్రధాన పంట కాలువ అవతల ఉన్న పొలానికి వెళ్లాడు.

    తుక్కుకు నిప్పుపెట్టిన సీతారామయ్య గంటపాటు అక్కడే ఉండి పరిశీలించాడు. అనంతరం ఇంటికి వెళ్లిన అతను తిరిగి 12 గంటలకు ఎక్కడ వరకు తుగలబడిందో చూసే ందుకు పొలం వచ్చాడు. ఈ సమయంలో నాలుగువైపులా తుక్కుకు మంటలు అంటుకోవడంతో పాటు బలమైన ఈదురుగాలులు వీచాయి. సీతారామయ్య పక్క పొలంలోని తుంగల వెంకటేశ్వరరావుకు చెందిన గడ్డివామికి మంటలు అంటుకోవడంతో ఇది గమనించిన కొంతమంది అవనిగడ్డ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు.

    అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. రెండు గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన తర్వాత తిరిగి వెళ్లేందుకు సన్నద్ధమవుతుండగా పొలంలో కాలి పడి ఉన్న సీతారామయ్య మృతదేహాన్ని గమనించారు. అప్పటికే అతను చనిపోయి ఉన్నాడు. శరీరమంతా కాలిపోయి ఉంది. మంటలను చూసేందుకు వచ్చిన సీతారామయ్య పొగకు ఊపిరాడక గాని, మంటల వేడికి తాళలేక గాని, మంటలను చూసి గుండెపోటు వచ్చి గాని ముందుకుపడి మంటల్లో కాలిపోయి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు.

    ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. అప్పటివరకు తమతో గడిపిన సహ రైతు ఇలా సజీవదహనమవడాన్ని మిగిలిన రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. సీతారామయ్య మృతదేహాన్ని చూసేందుకు జనం తరలివచ్చారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
     
    వైవాకలో మరో రైతు...
     
    వైవాక (ముదినేపల్లి రూరల్) : వేకనూరు తరహా ఘటనే వైవాకలోనూ సోమవారమే జరిగింది. ఖరీఫ్ సీజన్ సమీపించడంతో గ్రామానికి చెందిన రైతు ఎన్.రాజు (75) నారుమడి పోసేందుకు పొలంలో ఉన్న చెత్తను తగలబెట్టేందుకు సోమవారం చేలోకి వెళ్లాడు.

    పొలంలో ఉన్న చెత్తకు నిప్పంటించి, ఎండ వేడికి తాళలేక పక్కనే ఉన్న గడ్డివామి నీడలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అదే సమయంలో గాలులు ఉధృతంగా వీయడంతో పొలంలోని మంటలు వేగంగా వ్యాపించి గడ్డివామిని చుట్టుముట్టాయి. ఊహించని ఘటన నుంచి తేరుకునేలోపే మంటలు చుట్టుముట్టడంతో రాజు మరణించినట్లు స్థానికులు తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement