అరెరే..విత్తనాలను తెగనమ్ముకుంటున్నారే!

Farmers Seeds Sale Agriculture YSR Kadapa - Sakshi

కడప అగ్రికల్చర్‌ : వర్షాభావ పరిస్థితులు రైతన్నను అగాధంలో పడేశాయి. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై రెండు నెలలు దాటినా ఆశించిన స్థాయిలో పదును వర్షం కురవకపోవడంతో వ్యవసాయ పంటల సాగు అగమ్యగోచరంగా తయారైంది. గతేడాది ఇదే సమయానికి అనుకున్న మేర పంటలు సాగు కావడంతో, ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌పై రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. పంటల సాగుకు పొలాలను దుక్కులు దున్ని, ఎరువులు చల్లి సిద్ధం చేసి ఉంచారు.

అడపాదడపా చిరుజల్లులు, ఓ మోస్తరు వర్షం కరుస్తుండడం రైతుల్లో కాస్త ఉత్సాహం నింపినా, అరకొర పదునైనా, రాబోయే రోజుల్లో మంచి వర్షాలు పడతాయనే ఆశతో కొంతమంది రైతులు అక్కడడక్కడ పంటలను సాగు చేశారు. అయితే ఆ తర్వాత వానలు కురిసే నమ్మకం కనిపించకపోవడంతో రైతులు పంట సాగుకు పూనుకోలేక పోయారు. వర్షాలు కురవకపోతాయా? పంటలు పండించుకోక పోతామా... అనే నమ్మకాన్ని మనసులో ఉంచుకుని రెండు నెలలుగా ఆకాశంవైపు ఆశగా చూస్తున్న రైతన్నను వానలు నిరాశపరచాయి.

విత్తన పంపిణీ ఇలా..
వేరుశనగ కాయలు 43,030 క్వింటాళ్లకుగాను 10,488 క్వింటాళ్లు పంపిణీ చేశారు. కందులు 1,000 క్వింటాళ్లకుగాను 221 క్వింటాళ్లు, పెసలు 80 క్వింటాళ్లకుగాను, 30.58 క్వింటాళ్లు, మినుములు 173.2 క్విం టాళ్లకు 69.2 క్వింటాళ్లు, జీలుగలు 15,000 క్విం టాళ్లకు 13,144 క్వింటాళ్లు, జనుములు 2,000 క్వింటాళ్లకు 1,612 క్వింటాళ్లు, పిల్లి పెసర 1,500 క్వింటాళ్లకు 881 క్వింటాళ్లు పంపిణీ చేశారు.
 
సాలు తప్పిన సాగు..
జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో సాధారణ సాగు 1.34 లక్షలుకాగా, ఇందులో ఇప్పటికి 12,501 హెక్టార్లలో ప్రధాన పంటలు సాగయ్యాయని వ్యవసాయశాఖ రికార్డులు చెబుతున్నాయి. జూన్‌ నెలలో 69.2 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 31.9 మి.మీ కురిసింది. జూలైలో 97.0 మి.మీ కురవాల్సి ఉన్నా ఇప్పటివరకు 21.4 మి.మీ కురిసింది. ఈ అరకొర వర్షానికి జిల్లావ్యాప్తంగా వేరుశనగ, కంది, ఆము దం, సజ్జ, పత్తి,పెసర, వరి, అలసంద, మిరప, ఉల్లి తదితర పంటలు కలిపి 12,501 హెక్టార్లలో సాగైనట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.

విత్తనాలను తెగనమ్ముకుంటూ...
ఈ ఖరీఫ్‌లో పదునుపాటి వర్షాలు కురుస్తాయన్న ఆశతో రైతులు ప్రధాన పంటైన వేరుశనగ సాగుకు విత్తనకాయలను సబ్సిడీపై ఇచ్చిన వాటితో పాటు పాత గత రబీలో పండిన పంట నుంచి సేకరించుకున్నవి కూడా సిద్ధం చేసుకున్నారు. వేరుశనగ విత్తనకాయలు 30కిలోల బస్తాను రూ.1,250లు వెచ్చించి తీసుకొచ్చారు. జూన్‌ మొదటి వారంలో వర్షాలు కురుస్తాయని ఆశించారు. రెండు నెలలు కావస్తున్నా అదునులో పదును కాకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో, బర్మా (ఊజిఈగ)పురుగు ఆశిస్తే కొనుగోలు చేసే వారుండనే భయంతో విత్తనాలను తెగనమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదనతో తెలిపారు.

ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు రామకృష్ణారెడ్డి. గొందిపల్లె గ్రామం, వేముల మండలం. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు ఐదు ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికిగాను 20బస్తాలు కొనుగోలు చేశాడు. రూ.24 వేలు ఖర్చు. పదునుపాటి వానలు కురవకపోవడంతో చేసేదేమీ లేక విత్తనాలను తెగనమ్ముకున్నాడు. రూ.20 వేలు వచ్చాయి. అంటే రూ.4 వేలు నష్టపోయాడు.


ఈ పరిస్థితి ఒక్క రామకృష్ణారెడ్డిదే కాదు. జిల్లాలో వేరుశనగ ఇతర పంటలను సాగు చేసే ప్రతి రైతు పరిస్థితి ఇలానే ఉంటోంది. 
విత్తనాలు అమ్ముకుంటున్నాం నాలుగు ఎకరాల్లో వేరుశనగ పంట వేయాలనుకుని వేల రూపాయలు పెట్టుబడి పెట్టి అన్ని సిద్ధంగా ఉంచుకున్నాం. వానలు కురవకపోవడంతో విత్తనాలను అమ్ముకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. 
–ఎర్రగోర్ల చలపతి, యువరైతు, వేముల 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top