రైతు సమైక్య గర్జన | Rythu samaikyandhra Garjana | Sakshi
Sakshi News home page

రైతు సమైక్య గర్జన

Nov 20 2013 12:16 AM | Updated on Oct 1 2018 2:00 PM

రైతు సమైక్య గర్జన - Sakshi

రైతు సమైక్య గర్జన

సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 112వరోజూ మంగళవారం సీమాంధ్ర జిల్లాల్లో ఉద్ధృతంగానే ఎగసింది.

సాక్షి నెట్‌వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 112వరోజూ మంగళవారం సీమాంధ్ర జిల్లాల్లో ఉద్ధృతంగానే ఎగసింది. రోజూమాదిరిగానే ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, సోనియా, కేంద్రమంత్రుల దిష్టిబొమ్మల దహనాలు... వివిధరూపాల్లో ఆందోళనలు హోరెత్తాయి. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సమైక్య రైతు గర్జన నిర్వహించారు. వేలాదిగా రైతులు పాల్గొని సమైక్య నినాదాలు హోరెత్తించారు. రాష్ట్ర రైతు జేఏసీ అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే సీమాం ధ్రకు సాగునీరు అందే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. కూలీలకు ఉపాధి కరువు అవుతుందన్నారు. సమైక్యాంధ్ర జిల్లా రైతు జేఏసీ అధ్యక్షుడు నిమ్మల రామానాయుడు తీర్మానాలు ప్రవేశపెట్టగా రైతులు ఏకగ్రీవంగా ఆమోదించారు. రాష్ట్ర విభజనకు వత్తాసు పలుకుతున్న ఎం పీలు, కేంద్ర మంత్రులను భవిష్యత్ ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరిస్తూ గ్రామ పొలిమేరల్లో బోర్డులు పెట్టి ప్రజలను చైతన్యవంతం చేయాలని సభ తీర్మానించింది.
 
 చిత్తూరు జిల్లా పుంగనూరులో వివిధ రకాల పూలతో 112 సంఖ్య ఆకారాన్ని ఆవిష్కరించి ఉద్యమ కాలాన్ని గుర్తుచేశారు. మదనపల్లెలో సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర కార్యాలయాలను ముట్టడించారు. పశ్చిమగోదావరి జిల్లా  భీమవరం ప్రకాశంచౌక్‌లో విద్యార్థులు  రాస్తారోకో చేశారు. సమైక్యాంధ్ర పోరాట సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు శ్రీకాకుళంలోని డే అండ్ నైట్ కూడలి నుంచి వైఎస్‌ఆర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు.  వైఎస్‌ఆర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన  కేంద్రమంత్రి కిల్లి కృపారాణి జన్మదిన శుభాకాంక్షల ఫ్లెక్సీలను చించివేశారు. ఆమె చిత్రానికి చెప్పులతో కొట్టారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం లో ఉపాధ్యాయులు చెవులు మూసుకుని నిరసన తెలిపారు. నూజివీడులో జేఏసీ, ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్(అప్సా) ఆధ్వర్యంలో విద్యార్థులు  భారీ ధర్నా నిర్వహించారు. సమైక్యాంధ్ర వర్థిల్లాలి, విభజన వద్దు సమైక్యమే ముద్దు  నినాదాలతో నూజివీడు పట్టణం మార్మోగింది.
 
 కావూరి, డొక్కాలకు సమైక్య సెగ
 పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం పరింపూడిలో మంగళవారం రచ్చబండ కార్యక్రమంలో కేంద్ర మంత్రి  కావూరి సాంబశివరావు వేదికపైకి రాకుండా వైఎస్సార్ సీపీ, టీడీపీ శ్రేణులు, సమైక్య జేఏసీ సభ్యులు అడ్డుకున్నారు.  గుంటూరు జిల్లా గురజాలలో రచ్చబండకు వెళుతున్న రాష్ట్ర గ్రామీణాభివృద్ధి  శాఖామంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ కాన్వాయ్‌ను అడ్డుకోబోగా పోలీసులు సమైక్యవాదులను బలవంతగా పక్కకు నెట్టివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement