అటవీ శాఖాధికారులకు, పోలీసులకు మధ్య ఏర్పడిన సమన్వయ లోపం రెండు ప్రాణాలను బలిగొంది.
=పోలీసులకు సమాచారం ఇవ్వని అటవీ సిబ్బంది
=టాస్క్‌ఫోర్స్ లేకుండానే అడవిలోకి..
=క్రెడిట్ కోసం అటవీ సిబ్బంది పాకులాట
సాక్షి, తిరుపతి: అటవీ శాఖాధికారులకు, పోలీసులకు మధ్య ఏర్పడిన సమన్వయ లోపం రెండు ప్రాణాలను బలిగొంది. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, వారిని తామే పట్టుకోవాలనే మొండి పట్టుదలతో అటవీ సిబ్బంది ముందుకు సాగడంతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. అయితే ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు ఇంత దారుణానికి పాల్పడతారని అటవీ సిబ్బంది అనుకోలేదు. తమను చూసి నిం దితులు పారిపోతారని, ఒకరిద్దరు ఎదురుతిరిగినా వారిని తాము అదుపులోకి తీసుకోగలమని భావించి, ముందుకు సాగడం ఈ ఘోర సంఘటనకు కారణమయింది. అటవీ శాఖ సిబ్బంది వెంట టాస్క్‌ఫోర్సు పోలీసులు కూడా ఉండి ఉంటే, ఈ సంఘటన జరిగేది కాదు.
ఆయుధాలు లేకుండా కేవలం లాఠీలతో అటవీ శాఖ సిబ్బంది వెళ్లడంతో, వారిపై స్మగ్లర్లు తిరగబడ్డారు. అటవీ శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ ఇక్కడ అటవీ, పోలీసు సిబ్బందిలో ఏర్పడిన సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఎర్రచందనం దుంగలను లేదా, స్మగ్లర్లను పట్టుకున్నపుడు టాస్క్‌ఫోర్సు వల్లే వీరిని పట్టుకున్నట్లు చెబుతుంటారని అన్నారు. రాత్రింబవళ్లు కష్టపడుతున్న అటవీ సిబ్బంది ప్రమేయం లేదన్నట్లు చెప్పడం పలుసార్లు వివాదాస్పదమయిందన్నారు. దీంతో కొంతకాలంగా టాస్క్ ఫోర్సు ఆపరేషన్లు జరగడం లేదన్నారు. ‘‘స్మగ్లర్లు ఉన్నట్లు సమాచారం అందగానే అటవీ సిబ్బంది రొటీన్‌గా వెళ్లారు.
దానిని పోలీసులకు తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే ఎక్కువ మంది మారణాయుధాలతో ఉన్న కారణంగా వారు తప్పకుండా సాయుధ దళాలను తీసుకుని వెళ్లి ఉండాలి. ఆ విధంగా చేసి ఉంటే, ప్రాణాపాయం తప్పేది’’ అన్నారు. పోలీసు అధికారులు సైతం ఇదే అంటున్నారు. ఒక టాస్క్ ఫోర్సు బృందంలో పోలీసులు, అటవీ సిబ్బంది కలిపి 25 మంది ఉంటారన్నారు. ఈ బృందం వెళ్లినట్లయితే గాలిలో రెండుసార్లు కాల్పులు జరిపినా నిందితులు పారిపోయి ఉండేవారన్నారు.
ఏది ఏమైనా ఇంత ఘోర సంఘటనకు సిబ్బందిలోని సమన్వయ లోపమే కారణమనే విషయం స్పష్టమవుతోంది. అయితే ఇకపై తమకు ఆయుధాలు ఇస్తేనే గాని, అడవుల్లోకి వెళ్లమని అటవీ సిబ్బంది తెలుపుతున్నారు. ఆత్మరక్షణకు ఆయుధాలు లేకుండా అడవిలోకి వెళ్లడం సాధ్యం కాదని, భవిష్యత్తులో ఆయుధాలను తప్పకుండా సరఫరా చేయాలని, దీనిపై సమ్మె చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.