పోలవరం సవరణ అంచనాలపై కేంద్రానికి నివేదిక | Report to the Center on Polavaram Amendment Estimates | Sakshi
Sakshi News home page

పోలవరం సవరణ అంచనాలపై కేంద్రానికి నివేదిక

Nov 10 2019 4:29 AM | Updated on Nov 10 2019 4:29 AM

Report to the Center on Polavaram Amendment Estimates - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్ట్‌ పనులకు సంబంధించి సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి మండలికి నివేదిక సమర్పించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ, రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ కమిటీ (ఆర్‌ఈసీ) కసరత్తు చేస్తున్నాయి. దీనికి కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేస్తే 2017–18 ఎస్‌ఎస్‌ఆర్‌ (స్టాండర్డ్‌ షెడ్యూల్డ్‌ రేట్స్‌) ప్రకారం సవరించిన అంచనాల మేరకు నిధులు విడుదలవుతాయి. ఈ నివేదికను రూపొందించే విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్‌ఈసీలకు సహకరించేందుకు 14న ఢిల్లీకి వెళ్లాలని రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. రూ.55,548.87 కోట్ల పనులకు సంబంధించి సవరించిన అంచనాలను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ), కేంద్ర జల్‌ శక్తి, ఆర్థిక శాఖ అధికారులతో ఏర్పాటైన రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ కమిటీ (ఆర్‌ఈసీ) ఇప్పటికే ఆమోదించాయి.

ఈ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక శాఖకు ఆర్‌ఈసీ ఛైర్మన్‌ జగ్‌మోహన్‌ గుప్తా ఇప్పటికే సమాచారం ఇచ్చారు. వీటిపై ఆర్‌ఈసీలో సభ్యుడైన కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం డైరెక్టర్‌ అమర్‌దీప్‌ చౌదరి వ్యక్తం చేసిన సందేహాలను ఇప్పటికే రాష్ట్ర జల వనరుల శాఖ, సీడబ్ల్యూసీ అధికారులు నివృత్తి చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన గిరీష్‌ మూర్మ్‌ను జమ్మూకాశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నియమించడంతో.. ఆయన స్థానంలో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అటను చక్రవర్తికి సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై ఆ శాఖ వ్యయ విభాగం డైరెక్టర్‌ అమర్‌దీప్‌ చౌదరి, ఆర్‌ఈసీ ఛైర్మన్‌ జగ్‌మోహన్‌ గుప్తా సోమవారం లేదా మంగళవారం వివరించనున్నారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి మండలికి పంపే నివేదికను రూపొందించనున్నారు. 

ఆమోదం లభిస్తే.. రూ.51,424.23 కోట్లు
- 2016 సెప్టెంబరు 7న అప్పటి సీఎం చంద్రబాబు ప్రతిపాదనల మేరకు పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యతను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించింది. ఈ క్రమంలో 2014 ఏప్రిల్‌ 1వ తేదీకి ముందు ఖర్చు చేసిన రూ.5,135.87 కోట్లను తిరిగి చెల్లించబోమని.. కేవలం నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే చెల్లిస్తామని ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం మెలిక పెట్టింది. దీనివల్ల జల విద్యుత్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణానికయ్యే రూ.4,124.64 కోట్ల భారం రాష్ట్ర ఖజానాపై పడింది. చంద్రబాబు కమీషన్ల కక్కుర్తి వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.9,260.51 కోట్ల భారం పడింది.
సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోద ముద్ర వేస్తే.. జల విద్యుత్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణ వ్యయం రూ.4,214.64 కోట్లు పోనూ పోలవరం అంచనా వ్యయం రూ.51,424.23 కోట్ల మేరకు సవరించడానికి అంగీకరించినట్లు అవుతుంది.
ప్రాజెక్ట్‌ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.16,935.88 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో 2014 ఏప్రిల్‌ 1 తర్వాత రూ.11,800.01 కోట్లను వ్యయం చేసింది. ఇప్పటివరకూ రూ.6,727.26 కోట్లను కేంద్రం తిరిగి చెల్లించగా.. ఇంకా రూ.5,072.75 కోట్లను విడుదల చేయాల్సి ఉంది.

రూ.1,850 కోట్ల విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌
పోలవరం ప్రాజెక్ట్‌ పనులకు రూ.1,850 కోట్లను మంజూరు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అటను చక్రవర్తి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నాబార్డు ద్వారా ఈ నిధులు పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ (పీపీఏ)కి రెండు మూడు రోజుల్లో విడుదల కానున్నాయి. ఈ నిధులతో కలిపి ఇప్పటివరకూ కేంద్రం రూ.8,577.26 కోట్లను విడుదల చేసింది. ఇంకా రూ.3,222.75 కోట్లను విడుదల చేయాల్సి ఉంది. కేంద్ర మంత్రి మండలి సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను ఆమోదిస్తే.. ఇప్పటివరకూ కేంద్రం విడుదల చేసిన నిధులు పోనూ పోలవరానికి ఇంకా రూ.37,711.1 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement