పట్టుకెళ్లి చంపేశారు!


ఎర్రచందనం కూలీల ‘ఎన్‌కౌంటర్’ బూటకమే?

ప్రభుత్వానికి ముందే తెలుసు.. పథకం ప్రకారమే అంతా జరిగిందన్న వాదనలు

మృతులందరినీ ముందు రోజే అదుపులోకి తీసుకున్నారంటున్న బంధువులు

మృతుల్లో ఏడుగురిని ముందు రోజు బస్సులో ప్రయాణిస్తుండగా  పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మృతుల బంధువుల వెల్లడి

మృతులందరూ కూలీలేనని గుర్తించిన వైనం.. మృతుల్లో స్మగ్లర్లు ఏరీ?

‘ఎన్‌కౌంటర్’పై హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీల ఆగ్రహావేశాలు

మానవ హక్కుల కమిషన్, ఉమ్మడి హైకోర్టు సీరియస్.. నివేదికలకు ఆదేశాలు

దుంగలు మోస్తూ దాడులెలా చేశారు? కాల్పులు జరుగుతున్నా పారిపోలేదా?

పోలీసులు రంగులు వేసిన ఎర్రచందనం దుంగలు.. కూలీల వద్దకు ఎలా వచ్చాయి?

సమాధానం లేని సందేహాలెన్నో.. ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు బలోపేతం
అది ఎన్‌కౌంటర్ కాదు..

 బూటకపు ఎన్‌కౌంటర్!

 అక్కడ జరిగింది ఎదురు కాల్పులు కాదు..

 పోలీసుల ఏకపక్ష కాల్పులు!

 మృతిచెందిన కూలీలు అడవిలో తారసపడలేదు.. జనారణ్యం నుంచి పోలీసులే పట్టుకెళ్లారు!

 ఆ కూలీలు పోలీసులపై దాడి చేయలేదు..

 తాము పట్టుకొచ్చిన వారిని పోలీసులే

 వరుసపెట్టి కాల్చిచంపారు!
శేషాచలం అడవుల్లో మంగళవారం నాటి ‘ఎన్‌కౌంటర్’పై అందులో తమిళనాడుకు చెందిన 20 మంది ఎర్రచందనం కూలీల మరణంపై.. మానవ హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నుంచే కాదు.. మృతుల బంధువుల నుంచీ వెల్లువెత్తుతున్న ఆరోపణలివి. ఘటనా స్థలాల్లో కనిపిస్తున్న దృశ్యాలు, మరణించిన కూలీల బంధువులు చెప్తున్న వివరాలు, పౌర హక్కుల సంఘాలు లేవనెత్తుతున్న సందేహాలకు.. పోలీసులు చెప్తున్న కథనాలకు ఏమాత్రం పొంతన కుదరకపోవటం.. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన కూలీల్లో ఏడుగురు.. ఆ ముందు రోజే బస్సులో ప్రయాణిస్తుండగా పోలీసులు ‘విచారణ’ పేరుతో అదుపులోకి తీసుకున్నారని.. వారితో పాటే ప్రయాణిస్తూ పోలీసుల దృష్టి నుంచి యాధృచ్చికంగా తప్పించుకున్న మరో కూలీ తమిళనాడులోని తన స్వగ్రామంలో బయటపెట్టటం.. ఇది బూటకపు ఎన్‌కౌంటరే అనేందుకు నిదర్శనంగా చూపుతున్నారు. మృతులంతా పొట్టకూటి కోసం కూలీలుగా పనిచేసే వారేనని పోస్టుమార్టం తర్వాత గుర్తించి.. వారి బంధువులకు అప్పగించారు. మరి మృతుల్లో స్మగ్లర్లు ఏరీ అన్న ప్రశ్నకు సమాధానం లేదు. పోలీసులు సోమవారం నాటికే దాదాపు 100 మంది కూలీలను అదుపులోకి తీసుకున్నారని.. వారిలో 20 మందిని సోమవారం రాత్రే అడవుల్లోకి తీసుకెళ్లి అదే రాత్రి కాల్చిచంపారని.. దానిని ఉదయం జరిగిన ‘ఎన్‌కౌంటర్’గా చిత్రీకరిస్తున్నారని మృతుల బంధువులు వాపోతున్నారు. అసలు శేషాచలం అడవుల్లో ‘ఎన్‌కౌంటర్’ అంతా ప్రభుత్వ ముందస్తు పథకం ప్రకారమే జరిగిందా? అనే అనుమానాలూ  వ్యక్తమవుతున్నాయి. అధికారం చేపట్టిన రోజు నుంచి సీఎం చంద్రబాబు పలు సమీక్షలు నిర్వహించి ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టాలని, కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్న నేపథ్యంలో.. 20 మంది కూలీల మరణానికి కారణమైన కాల్చివేత ఘటన చోటుచేసుకుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. మృతుల బంధువుల నుంచీ, పౌర సమాజం నుంచీ, రాజకీయ పార్టీల నుంచీ, పొరుగు రాష్ట్రంలో అన్ని వర్గాల వారి నుంచీ ఆరోపణలు, ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతుండటం.. మానవ హక్కుల కమిషన్, హైకోర్టులు సర్కారు తీరును ఆక్షేపిస్తూ ఘటనపై పూర్తిస్థాయి నివేదికలు కోరటం.. వంటి పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది. సీఎం ఢిల్లీ పర్యటనను రద్దుచేసుకుని ‘నష్టనివారణ’ చర్యల్లో నిమగ్నమయ్యారు. అది ముమ్మాటికీ ‘నిజమైన ఎన్‌కౌంటరే’నని బలంగా చెప్పేందుకన్నట్లుగా.. అడవుల్లో కూలీల సంచారానికి సంబంధించి పాత వీడియో ఫుటేజీలు కొన్ని చానళ్లకు లీకయ్యాయి.  మంత్రులు   రంగంలోకి దిగి.. ‘ఎన్‌కౌంటర్’ను సమర్థించుకుంటూ మాట్లాడారు. వాళ్లు కూలీలే కదా? అంటే.. ‘కూలీలు అడవిలోకి రాత్రిపూట గడ్డికోయటానికి వచ్చారా? ఎర్రచందనం దొంగతనం చేస్తే సహించేది లేద’టూ మళ్లీ హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. కూలీల మృతదేహాలకు పటిష్ట భద్రత మధ్య రాత్రికి రాత్రే పోస్టుమార్టం పూర్తిచేసి.. వారి బంధువులకు అప్పగించారు.

 

శేషాచలం ‘ఎన్‌కౌంటర్’లో మృతి చెందిన 20 మంది కూలీల్లో కొందరిని సోమవారం సాయంత్రమే అదుపులోకి తీసుకున్నట్లు తమకు సమాచారం ఉందని మృతుల బంధువులు చెప్తున్నారు. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా పడవేడు పుదూర్ గ్రామ సర్పంచ్ మూర్తి బుధవారం మీడియాకు చెప్పిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన 8 మంది కూలీలు సోమవారం ఉదయం ఇంటి నుంచి బయల్దేరారు. బస్సులో ప్రయాణిస్తున్న వారిని పుత్తూరు - నగరి మధ్యలో ఆంధ్రా పోలీసులు ఆపి.. వారిని అనుమానంతో ప్రశ్నించారు. ఇంకా విచారించాలంటూ ఏడుగురిని తమతో జీపులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. వారి సహచరుడైన శేఖర్ అనే మరో కూలీ వారితో పాటే బస్సులో ఉన్నప్పటికీ.. అతడు మహిళల కోసం కేటాయించిన సీట్లో కూర్చొని ఉండటంతో పోలీసుల దృష్టిలో పడలేదు. అలా తప్పించుకున్న శేఖర్ తమిళనాడులోని తన స్వగ్రామం పడవేడు పుదూర్ చేరుకుని, పరిసర గ్రామాల్లోని మిగతా ఏడుగురి కుటుంబాలకు,  సర్పంచ్ మూర్తికి ఈ విషయాన్ని వివరించాడు. అయితే.. పోలీసులు తీసుకెళ్లిన ఏడుగురు కూలీలు ‘నకిలీ ఎన్‌కౌంటర్’లో మృతి చెందారన్న విషయం తెలుసుకున్న శేఖర్.. కుటుంబంతో సహా పరారీలో ఉన్నట్లు మూర్తి పేర్కొన్నారు.

 

బంధువులదీ అదే మాట..తిరువణ్ణామలై జిల్లా మురుగంబాడి గ్రామానికి చెందిన మృతుడు మునస్వామి తల్లి పద్మ, వేటగిరి పాలెంకు చెందిన మృతుడు పళణి సోదరి లక్ష్మి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ పై విషయాన్ని నిర్ధరించారు.   ఆ ఏడు మందిని పోలీసు జీపులో తిరుపతి వైపు తరలించారని చెప్పారు.  

 

ఆ రాత్రే కాల్చిచంపారు: ఎన్‌కౌంటర్’లో మృతిచెందిన కూలీలను సోమవారం సాయంత్రానికే తిరుపతికి తీసుకువచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని సోమవారం రాత్రి 7 గంటల ప్రాంతంలోనే    శ్రీవారి మెట్టు సమీపంలోని శేషాచలం అడవుల్లోకి తీసుకెళ్లి.. వారిని కాల్చి చంపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారిని అలా కాల్చిచంపాక.. దానిని ‘ఎన్‌కౌంటర్’గా చిత్రీకరించేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకున్న తరువాతే మంగళవారం మీడియాకు వెల్లడించినట్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయం ముందే సీఎంతోపాటు, ఉన్నతాధికారులకు సైతం తెలుసునని, శేషాచలం అడవుల్లోకి కూలీలు వెళ్లకుండా భయపెట్టాలనే ఉద్దేశంతోనే కూలీలను పొట్టనపెట్టుకున్నారని కథనాలు వినిపిస్తున్నాయి.  

 

అదుపులో ఉన్న కూలీల అరెస్టులుదాదాపు 100 మందికి పైగా కూలీలను కొద్ది రోజుల కిందటే అదుపులోకి తీసుకున్నట్లు వినిపిస్తోంది. అయితే వీరిలో 20 మందిని పోలీసులు ‘ఎన్‌కౌంటర్’లో కాల్చిచంపగా.. మిగిలిన వారు పోలీసుల అదుపులో ఉన్నట్లు చర్చ సాగుతోంది. అదే సమయంలో.. చిత్తూరులో బుధవారం మీడియా ముందు ముగ్గురు స్మగ్లర్లు, వారి అనుచరులు 11 మందితో పాటు 48 మంది కూలీలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇంకా అదుపులో ఉన్నవారిని దశలవారీగా మీడియా ముందు ప్రవేశపెట్టే ప్రణాళికలో భాగంగానే ఇలా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం తరవాత అధికారులు ప్రణాళికాబద్ధంగా లీక్ చేసిన వీడియో ఫుటేజ్‌లు చూస్తే పోలీసుల కథనంపై అనేక సందేహాలు కలుగుతున్నాయి. వారం రోజుల కిందటే ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు శేషాచలం అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు, వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారనేది అనధికారిక కథనం. లీకేజ్ ద్వారా బయటకు వచ్చిన విజువల్స్‌లో గత గురువారం నాటివీ ఉన్నాయి. వీరు వారం కిందటే శేషాచలంలోకి ప్రవేశించారని సమాచారం ఉంటే.. సోమవారం రాత్రి వరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎందుకు రంగంలోకి దిగలేదన్నది సమాధానం లేని ప్రశ్న. మరోపక్క నిఘా కెమెరాలో 3 రోజుల పాటు రికార్డయిన విజువల్స్‌ను పరిశీలించిన అధికారులకు.. స్మగ్లర్లు, కూలీలు ఎంత మంది ఉన్నారనేది అంచనా వేయలేకపోయారా?  ఇలాంటి సందేహాలు మరెన్నో వ్యక్తమవుతున్నాయి.   

- సాక్షి ప్రతినిధి, తిరుపతి

 

‘బూటకపు ఎన్‌కౌంటర్’ను నిర్ధారిస్తున్న అంశాలివీ..

 

అడవుల్లో వందల సంఖ్యలో కూలీలు మారణాయుధాలతో ఉన్నారని తెలిసినప్పుడు ఒక్కో బృందంలో కేవలం 12 మంది పోలీసులు, ముగ్గురు అటవీ శాఖ అధికారులతోనే కూంబింగ్‌కు ఎందుకు వెళ్లినట్టు?   కూలీలను పట్టుకోవడానికి అనువుగా చుట్టుపక్కల జిల్లాల నుంచి అదనపు  బలగాలను ఎందుకు తెప్పించుకోలేదు?రూ. 20 లక్షల వ్యయంతో అటవీశాఖ ఏర్పాటు చేసిన ఈ ఆధునిక రహస్య కెమెరాలు చీకట్లో కూడా దృశ్యాలను రికార్డు చేయగలవు. ఏదైనా బృందం అడవిలోకి కూబింగ్‌కు వెళ్ళినప్పుడు, అక్కడ నిఘా కెమెరాల ఏర్పాటు ఉంటేవాటిని ఇతర ప్రాంతాల్లో ఉన్న అధికారులు అనునిత్యం పరిశీలిస్తుంటారు. అలాంటప్పుడు కూలీల వద్దకు చేరిన ఆయుధాల విషయం వారికి తెలుస్తుంది. దీన్ని గమనిస్తే ముప్పును ముందే ఊహించి అదనపు బలగాలను అడవిలోకి పంపడమో, ఉన్న వాటిని వెనక్కు రప్పించడమో చేసి కూలీలు బయటకు రాకుండా చుట్టూ దిగ్భందించడమో ఎందుకు చేయలేదు?

 

ఇవేవీ లేకుండా కేవలం 15 మందితో కూడిన బృందాలు రెండు చోట్ల తమకు ఎదురైన, హఠాత్తుగా దాడి చేసిన వంద మందికి పైగా ఎర్రచందనం కూలీల్లో 20 మంది కాల్చిచంపడం అనేక సందేహాలకు తావిస్తోంది.

 

ఎర్రచందనం దుంగలతో వెళ్తున్న కూలీలకు  పోలీసులు ఎదురైతే  వారంతా చెల్లాచెదురవుతారు. ఆపై తమ వద్ద ఉన్న ఆయుధాలతో కనిపించిన వారిపై, రాళ్ళతో దూరంగా ఉన్న పోలీసులపై దాడులు చేస్తారు. అయితే శేషాచలంలో ‘ఎన్‌కౌంటర్’ జరిగినట్లు చెప్తున్న రెండు చోట్లా కేవలం 10 నుంచి 16 మీటర్ల విస్తీర్ణంలోనే 20 మంది ఎర్రచందనం కూలీల మృతదేహాలూ పడున్నాయి.

 

ఎన్‌కౌంటర్ ఘటన ప్రాంతాన్ని పరిశీలిస్తే ఒక్కో కూలీ 25 నుంచి 30 కేజీల బరువున్న దుంగల్ని మోసుకుపోతున్నట్టు స్పష్టమవుతుంది. అలా మోసుకుపోతున్న వారికి ఒక్కసారిగా పోలీసులు ఎదురైతే బరువు మోస్తూ దాడికి పాల్పడగలరా? దుంగలను పడేసి దాడి చేశారంటే.. సాధారణంగా దుంగలను పడేసి పారిపోతూనో.. లేదా ముందుకొచ్చి దాడికి పాల్పడినట్టో కనిపించాలి? కాని ఒక్కొక్కరు ఒక్కో దుంగ పక్కన ఒరిగి పడిపోయి ఉండటం అనేక సందేహాలకు తావిస్తోంది.

 

పోలీసులు కాల్పులు జరిపినప్పుడు ప్రాణ భయంతో తప్పించుకుని పారిపోయేందుకు కొంతదూరమైనా పరుగెత్తే ఆస్కారముంది. ఆ సంఘటన జరిగిన ప్రదేశాన్ని మృతులు అటువంటి ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. చూస్తే అక్కడికి ఎర్రకూలీలను తీసుకెళ్ళి వారిని కాల్చిచంపి వారిపక్కన దుంగలను వేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.మృతదేహాల వద్ద లభించిన దుంగలపై పెయింట్ రంగులు ఎలా వచ్చాయి?  పోలీసులు రికవరీ చేసిన దుంగలను యార్డుల్లో భద్రపరిచేప్పుడే రంగులు వేస్తారు.   కూలీల వద్ద పడివున్న దుంగలు కొత్తగా నరికినవి కాదని చాలా స్పష్టంగా తెలుస్తోంది.

 

కూలీలు దాడులకు దిగారని పోలీసులు చెప్తున్నారు. యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ సిబ్బందిలో ఎవరూ తీవ్రంగా గాయపడకపోవడం అనుమానాస్పదంగా ఉంది.

 

రెండు బృందాలు శేషాచలం అడవుల్లోకి సోమవారం రాత్రి 7 గంటలకు వెళితే మంగళవారం ఉదయం 5, 6 గంటల మధ్యలోనే కిలోమీటరు దూరంలోనే ఒకేసారి సచ్చినోడిబండ, చీకటీగలకోనలో ఎర్ర కూలీలు పోలీసులపై రాళ్లు, గొడ్డళ్లతో దాడిచేశారని పోలీసులు చెప్తున్నారు.  వందలాది మంది కూలీలు పోలీసులపై దాడిచేస్తే ఒక్క కూలీనీ ప్రాణాలతో పట్టుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

 

పోలీసులు చెప్తున్న ప్రకారం ‘ఆత్మరక్షణకే  కాల్పులు’ జరిపితే.. ఒక్క కూలీ అయినా గాయాలతో బతికి ఉండే అవకాశం లేదా?

 

పోలీసులు ఎర్ర కూలీలనే అనుమానంతో పుత్తూరు సమీపంలో అదుపులోకి తీసుకుంటే మంగళవారం ఉదయం శేషాచలం కొండల్లో పోలీసులపై వారు ఎదురుదాడికి ఎలా పాల్పడతారు? దీనికి తోడు సోమవారం రాత్రే ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతానికి సమీపంలో ని గ్రామాల్లో తుపాకుల శబ్దం వినబడినట్లు ప్రచారం జరగడంతో ఆ ఘటన బూటకపు ఎన్‌కౌంటర్ అనేదానికి ఊతమిస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top