ఆహారంపై తగ్గుతున్న వ్యయం

Reduced cost of spending on food - Sakshi

ప్రజలకు కొనుగోలు శక్తి తగ్గడమే కారణం

ఆహార పదార్థాలపై ఖర్చు 49 %మాత్రమే

ఇతర రంగాలపై 51% వ్యయం

ఆహార అలవాట్లలో మార్పులతో పెరుగుతున్న ఊబకాయం

కేంద్ర గణాంక శాఖ వెల్లడి

సాక్షి అమరావతి: దేశంలో ప్రజల సంపాదన పెరిగినప్పటికీ.. అందులో ఆహారంపై కాకుండా ఇతర రంగాలపై ఎక్కువ వ్యయం చేయాల్సిన పరిస్థితి నెలకొందని కేంద్ర గణాంక శాఖ తేల్చింది. దీంతో కడుపు నిండా పౌష్టికాహారం తినలేకపోతున్నారని వెల్లడించింది. కొనుగోలు శక్తి తగ్గిపోవడం వల్లే ఆహారంపై పెట్టే ఖర్చు తగ్గిపోతోందని తెలిపింది. గత రెండు దశాబ్దాలుగా దేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజల ఆహార అలవాట్లలో భారీ మార్పులు వచ్చాయని వివరించింది. ఫాస్ట్‌ఫుడ్స్‌తోపాటు అనారోగ్యానికి దారితీసే ఆహారాన్ని తీసుకోవడం పెరిగిపోతోందని, దీంతో దేశంలో ఊబకాయం సమస్య పెద్ద ఎత్తున తలెత్తుతోందని స్పష్టం చేసింది. ఈ మేరకు దేశంలో ఆహార, పౌష్టికాహార భద్రతపై అధ్యయనం చేసిన కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ ఇటీవల కేంద్రానికి నివేదిక సమర్పించింది. 

అధ్యయనంలో వెల్లడైన అంశాలు.. 
- దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తమ నెలవారీ ఆదాయంలో 49 శాతం ఆహార పదార్థాలపై, మిగతా 51 శాతం ఇతర రంగాలపై వ్యయం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయంలో ఆహారంపై 39 శాతమే ఖర్చు పెడుతుండగా మిగతా మొత్తాన్ని ఇతర రంగాలకు కేటాయిస్తున్నారు. 
- గ్రామాల్లో పేదలకు రోజుకు 2,155 కిలో కేలరీల ఆహారానికి గాను 1,811 కిలో కేలరీలే లభ్యమవుతోంది. పట్టణాల్లో పేదలకు రోజుకు 2,090 కిలో కేలరీల ఆహారానికి గాను 1,745 కిలో కేలరీల ఆహారమే లభిస్తోంది. 
- 1972–73 నుంచి 2011–12 మధ్య కాలంలో ఆహారంపై పెట్టే వ్యయం గ్రామీణ ప్రాంతాల్లో 33 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 40 శాతానికి తగ్గిపోయింది. ఇదే సమయంలో ఆహారేతర వ్యయం బాగా పెరిగిపోయింది. 
- 2004–05 నుంచి 2011–12 మధ్య కాలంలో ఆహారంపై వ్యయం గ్రామీణ ప్రాంతాల్లో 9 శాతం మేర.. పట్టణ ప్రాంతాల్లో 8 శాతం మేర తగ్గిపోయింది. 
- గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయంలో ఆహారంపై తలసరి వ్యయం రూ.902 ఉండగా ఇతర రంగాలపై రూ.852 ఉంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఆహారంపై నెలవారీ ఆదాయంలో తలసరి వ్యయం రూ.1,336 ఉండగా, ఇతర రంగాలపై రూ.1,549 ఉంది. 
- ఆహార అలవాట్లలో మార్పు కారణంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు ప్రొటీన్లతో కూడిన శక్తిమంతమైన ఆహారం అందడం లేదు. 
- ఇక పేద కుటుంబాలు నెలవారీ ఆదాయంలో ఆహారంపై గ్రామీణ ప్రాంతాల్లో రూ.588 వ్యయం చేస్తుండగా ఇతర రంగాలపై రూ.395 వ్యయం చేస్తున్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో పేదలు నెలవారీ ఆదాయంలో ఆహారంపై రూ.655, ఇతర రంగాలపై రూ.589 ఖర్చు పెడుతున్నారు. 

పోషకాలతో కూడిన పంటలను ప్రోత్సహించాలి 
రైతులు మరింత పోషకాలతో కూడిన పంటలను పండించేలా ప్రోత్సహించాలని కేంద్ర గణాంక శాఖ తన నివేదికలో ప్రభుత్వానికి సూచించింది. చిరుధాన్యాలు, సోయాబీన్స్‌ పంటలను ప్రోత్సహించేందుకు వాటికి మద్దతు ధరలను ప్రకటించడమే కాకుండా సబ్సిడీలను అందించాలని సిఫార్సు చేసింది. ఆగ్రో ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహించడంతోపాటు తక్కువ వ్యయంతో అధిక ఉత్పాదకతను సాధించే సాంకేతిక పరిజ్ఞానాలను రైతులకు అందించాలని ప్రతిపాదించింది. 
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పోషకాలతో కూడిన ఆహార ధాన్యాలను ప్రజలకు అందించాలంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top