పౌరసరఫరాలపై నిఘానేత్రం

Ration Shops Are Under CC Cameras In Srikakulam - Sakshi

పౌరసరఫరాలపై గోదాముల వద్ద సీసీ కెమెరాలు

జిల్లాలో రెండు చోట్ల ఏర్పాటు

జిల్లా కేంద్రం నుంచి లావాదేవీల పర్యవేక్షణ

అవినీతికి నిలయంగా... అడ్డగోలు వ్యవహారాలకు చిరునామాగా మారిన పౌర సరఫరాల గోదాములపై నిఘా కన్ను పడుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్ధలో జరుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ముందుగా పౌర సరఫరాల గోదాముల్లో నిఘా కెమెరాలను అమర్చుతున్నారు. 18 మండల స్థాయి స్టాక్‌ పాయింట్ల నుంచి జిల్లాలోని 2015 చౌకధరల దుకాణాలకు నిత్యావసర సరుకులు రవాణా చేస్తున్నారు. ప్రతి నెల సుమారు రూ.400 కోట్ల విలువైన సరుకులను ఈ గోదాముల్లో నిల్వ ఉంచుతున్నారు. ఇక్కడ నుంచి సరఫరా జరిగేటప్పుడు అక్రమాలు చోటు చేసుకొంటున్నాయి. గోదాము రికార్డుల్లో ఉన్న సరుకు మొత్తాలకు.. వాస్తవంగా ఉన్న సరుకు నిల్వలకు భారీ వ్యత్యాసం ఉంటోంది. ఇక నుంచి రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు నిఘాను పటిష్టం చేసి అక్రమాలకు చెక్‌ పెట్టే ప్రక్రియకు పకడ్బందీగా శ్రీకారం చుట్టారు.

సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో తొలి విడతగా రెండు ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో సీసీ కెమెరాలు అమర్చారు. తరువాత విడతల వారీగా అన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ముందుగా మెళియాపుట్టి, ఇచ్ఛాపురం ఎంఎల్‌ఎస్‌ పాయింట్లపై నిఘా పెట్టారు. జిల్లాలో 18 మండల స్థాయి స్టాక్‌ పాయింట్లు ఉన్నాయి. ఇంకా 16 ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు ఈ కెమెరాలు అమర్చాల్సి ఉంది. మండల స్థాయి గోదాముల పరిధిలో కెమెరాలను అమర్చి అక్కడ నిత్యం జరిగే లావాదేవీలను జిల్లా కేంద్ర స్థాయిలోనే పర్యవేక్షించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. మొదటిగా సీసీ కెమెరాలు అమర్చిన మెళియాపుట్టి, ఇచ్ఛాపురం ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ గోదాముల్లో 24 గంటలపాటు కెమెరాలు పనిచేస్తాయి. జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌ కార్యాలయంలో ఈ పర్యవేక్షణ విభాగాన్ని ఏర్పాటు చేశారు. డీఎం నిత్యం ఇక్కడ నుంచి గోదాములు లావాదేవీలను పర్యవేక్షించాలి. గోదాముల స్థాయిలో పాయింట్‌ వద్ద ఏం జరుగుతోందో డీఎం పర్యవేక్షిస్తే.. డీఎం కార్యాలయం నుంచి మండల కార్యాలయం లావాదేవీ లన్నింటినీ ఎండీ కార్యాలయంలో పర్యవేక్షించే విధంగా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు.

మోసాలు ఇక చెల్లవు
జిల్లాలో 18 మండల స్థాయి స్టాక్‌ పాయింట్‌ గోదాముల నుంచి 8,31,927 తెల్ల కార్డులున్న లబ్ధిదారులకు బియ్యం, పంచదార, కందిపప్పు, రాగులు, జొన్నలు సరఫరా చేస్తున్నారు. జిల్లాలో పలు గోదాముల్లో బియ్యం, కందిపప్పు మాయంపై కేసులు నమోదైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ కొందరు ఉద్యోగులపై కేసులు, విచారణలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. మండల స్థాయి గోదాముల నుంచి వచ్చే సరుకుల్లో తూకాల్లో మోసాలు కొనసాగుతున్నాయి. వీటిపై ఇక నుంచి నిఘా పెరగనుంది. మండల స్థాయిలో ఉన్న రికార్డుల పరిశీలన జరుగుతోంది. ఇప్పటి వరకు గోదాముల్లో జరిగిన తేడాలను బయటకు తీయనున్నారు. ఏ సమాచారం అవసరమైనా వెంటనే తీసుకొనే విధంగా మండల స్థాయి నుంచి డీఎం కార్యాలయానికి అనుసంధాన వ్యవస్థను మరింత పటిష్ట పరచనున్నారు. తూనికల్లో జరుగుతున్న మోసాలకు చెక్‌ పెట్టనున్నారు. అడ్డగోలుగా వ్యవహరించే అధికారులపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే చర్యలు తీసుకొనే విధంగా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

నిఘా అమలులో..
పౌర సరఫరాల ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి నిఘా వ్యవస్థను పూర్తి స్థాయిలో అమలులోకి తెచ్చారు. ఇందుకోసం రెండు ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో కెమెరాల బిగింపు పూర్తయిందని డీఎం ఎ.కృష్ణారావు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో అద్దె గోదాములున్న చోట సొంత గోదాముల నిర్మాణం జరుగుతోందని, అక్కడ కూడా కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

దశలవారీగా అన్ని చోట్లా కెమెరాలు
తొలి విడతలో రెండు కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. ఈ కేంద్రాలను జిల్లా మేనేజర్‌ కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తారు. దశలవారీగా అన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నాం.
– ఎ.కృష్ణారావు, సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ డీఎం, శ్రీకాకుళం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top