సమాజంలో అణగారిపోతున్న రజకుల సమస్యలను తక్షణమే ప్రభుత్వం తీర్చకుంటే ఉద్యమం తప్పదని రజక హక్కుల ఐక్యసాధన సమితి అధ్యక్షులు
రాజాం రూరల్:సమాజంలో అణగారిపోతున్న రజకుల సమస్యలను తక్షణమే ప్రభుత్వం తీర్చకుంటే ఉద్యమం తప్పదని రజక హక్కుల ఐక్యసాధన సమితి అధ్యక్షులు పాతపాటి అంజిబాబు హెచ్చరించారు. రజక హక్కుల ఐక్యసాధన సమితి జిల్లా గౌరవాధ్యక్షులు యండమూరి కష్ణారావు ఆధ్వర్యంలో రాజాంలో రజకుల అత్మగౌరవ యాత్ర గురువారం నిర్వహించారు. మెయిన్‌రోడ్డులో భారీ ర్యాలీ జరిపారు. అనంతరం పాలకొండ జంక్షన్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంజిబాబు రజకులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 12 శాతం ఉన్న రజకులకు రాజకీయాల్లో ప్రాధాన్యం లేదని ఆవేదన చెందారు.
దీనికోసం గత 60 సంవత్సరాల నుంచి ఉద్యమిస్తున్నా, రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడు కల్లబొల్లి కబుర్లుతో వాగ్దానాలు ఇచ్చి రజకుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. బడ్జెట్‌లో రజక ఫెడరేషన్‌కు రూ.1000 కోట్లు కేటాయించాలని, సొసైటీలకు బ్యాంక్ గ్యారంటీ లేకుండా రుణాలు మంజూరు చేయాలని, కల్లుగీత కార్మికులకు, చేనేత కార్మికులకు ఇస్తున్న విధంగా 50 సంవత్సరాలు దాటిన రజకులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొమరిపురి గణపతిరావు, చల్లపల్లి శివ, వై.గణేష్, వై.అప్పలస్వామి, ఎస్.వెంకయ్య, సింహాచలం, రాజాం టౌన్ కొమరిపురి రాములు, వై.రాములు, కె.ముసలయ్య తదితరులు పాల్గొన్నారు.