రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు జీరో | Railway Budget zero in west godavari district | Sakshi
Sakshi News home page

రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు జీరో

Feb 26 2016 12:24 AM | Updated on Sep 3 2017 6:25 PM

ఊరింపులు.. నిరీక్షణలు.. చివరకు ఉసూరుమనిపించాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు పార్లమెంట్‌లో

రైల్వే బడ్జెట్‌లో ఒరిగిందేమీలేదు
 తాడేపల్లిగూడెం :ఊరింపులు.. నిరీక్షణలు.. చివరకు ఉసూరుమనిపించాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు పార్లమెంట్‌లో గురువారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ జిల్లా ప్రజల ఆశలను నీరుగార్చింది. ప్రజల చిరకాల వాంఛ అయిన కోటిపల్లి-నరసాపురం, కొవ్వూరు-భద్రాచలం రైల్వే లైన్ల నిర్మాణ ప్రతిపాదనలకు మోక్షం కలగలేదు. కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్‌కు రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్టు బడ్జెట్‌లో పేర్కొన్నా.. ఆ నిధులు సర్వే పనులకు సైతం సరిపోవు. ఈ లైన్ ప్రతిపాదనను బతికించడానికి చేసిన కేటాయింపులే తప్ప ఎందుకూ అక్కరకు రావన్న విషయం తెలిసి ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు నిరుత్సాహానికి గురయ్యారు. మరోవైపు జిల్లా మీదుగా కొత్త రైళ్లు నడిపే ప్రకటనలేవీ లేకపోగా.. కనీసం హాల్టులు కూడా కల్పించలేదు.
 
 ‘కోటి’పల్లి ఆశలపై నీళ్లు
 కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం.. ఆ పార్టీ ఎంపీ ఒకరు జిల్లాలో ఉండటం.. అభివృద్ది విషయంలో తరచూ ఢిల్లీ వెళ్లి వినతులు సమర్పించే రాష్ట దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జిల్లాలో బీజేపీ ఆశాజ్యోతిగా ఉండటంతో.. ఈసారి తప్పకుండా రైల్వే పరంగా ఎంతోకొంత ప్రయోజనం కలుగుతుందని అంతా భావించారు. అయినా.. కేంద్రమంత్రి సురేష్‌ప్రభు ఎప్పటిలా మన జిల్లాను చిన్నచూపు చూశారు. నరసాపురం-కోటిపల్లి రైల్వే లైన్ ఈసారి సాకారం అవుతుందని ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఆశించారు. ఈ లైన్ నిర్మాణం కోసం అటు కోనసీమ, ఇటు నరసాపురంలో ఆందోళనలు సైతం జరిగాయి. కేవలం 60 కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని నిర్మిస్తే ఉభయ గోదావరి జిల్లాలకు ప్రయోజనం కలగటంతోపాటు అవసరమైనప్పుడు రైళ్ల దారి మళ్లింపు, దూరప్రాంత రైళ్ల పెంపు సాధ్యమవుతుంది. సుమారు రూ.3 వేల కోట్లు కేటాయిస్తే తప్ప ఆచరణకు నోచుకోని ఈ లైన్ కోసం రూ.200 కోట్లు విదిల్చి చేతులు దులిపేసుకోవడం చర్చనీయాంశమైంది.
 
 మూడో లైన్ ముచ్చట లేదు
 విజయవాడ నుంచి విశాఖై వెపు గల మార్గంలో రైళ్ల ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. కొత్తగా నడుపుతున్న సూపర్ ఫాస్ట్ రైళ్లకు ప్రధాన స్టేషన్లలో కూడా హాల్టు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ట్రాక్ సామర్థ్యానికి మించి రైళ్లను నడుపుతున్నామని.. ఇకపై కొత్త రైళ్లు నడపలేమని, కొత్త హాల్టులు గాని ఇవ్వలేమని రైల్వే ఉన్నతాధికారులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే మూడో లైన్ నిర్మాణమే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాన రైల్వే లైన్ మీదుగా మూడో లైన్ అందుబాటులోకి వస్తుందని ఇటీవల ఏలూరులో దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం చెప్పారు. ఖాజీపేట నుంచి విజయవాడ వరకు మూడోలైన్ నిర్మాణం కోసం బడ్జెట్‌లో రూ.114 కోట్లను కేటాయించారు. ఇదే లైన్‌ను విశాఖ వరకు విస్తరించి ఉంటే జిల్లాకు ప్రయోజనం కలిగేది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement