మచ్చలేని నాయకుడు ‘కోట్ల’

మచ్చలేని నాయకుడు ‘కోట్ల’ - Sakshi


కర్నూలు(ఓల్డ్‌సిటీ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కోట్ల విజయభాస్కరరెడ్డి మచ్చలేని నాయకుడని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కొనియాడారు. కోట్ల 95వ జయంతి వేడుకలను శనివారం కర్నూలులో ఘనంగా నిర్వహించారు. స్థానిక కళావెంకట్రావ్ భవనంలో పెద్దాయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం స్థానిక కిసాన్ ఘాట్‌లోని మాజీ ముఖ్యమంత్రి సమాధిపై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు.

 

డీసీసీ అధ్యక్షుడు బి.వై.రామయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ కోట్లు సంపాదించలేకపోయినా కోట్లాది మంది ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించిన మేరు నగధీరుడు విజయభాస్కరరెడ్డి అన్నారు. హుందాతనం, పెద్దరికం సద్గుణాలను కోట్ల తర్వాత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలో చూశానన్నారు.  ఇటీవల జరిగిన ఎన్నికల్లో సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీలను అమలు చేయలేక ప్రజలను మోసగిస్తుందని మండిపడ్డారు. రైతు, డ్వాక్రా రుణాలను వెంటనే మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

 

2019 నాటికి కాంగ్రెస్‌కు పూర్వ వైభవం:

రాష్ట్రంలో 2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్దాయన జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడుతూ రైతులు సేద్యం మానుకోవాలని చెప్పిన చంద్రబాబు నాయుడు స్వాతంత్ర వేడుకల్లో రైతాంగానికి మేలు చేస్తున్నట్లు ప్రకటించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. నిజంగా రైతులపై ప్రేమే ఉంటే పెండింగ్‌లో ఉన్న గురురాఘవేంద్ర ప్రాజెక్టు నిర్మాణంపై స్పష్టత ఇవ్వాలన్నారు.

 

అంతకుముందు ఎన్‌ఎస్‌ఐయూ జిల్లా అధ్యక్షుడు పూడూరు నాగమధుయాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు డీసీసీ కార్యాలయం నుంచి కిసాన్‌ఘాట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌బాబు, పీసీసీ సెక్రటరీ రవిచంద్రారెడ్డి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు చిన్నస్వామి, జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, మాజీ డీసీసీ అధ్యక్షుడు రఘురామిరెడ్డి, సర్దార్ బుచ్చిబాబు, కాంగ్రెస్ నాయకులు చెరుకులపాడు నారాయణరెడ్డి, వై.వి.రమణ, తిప్పన్న, ఎస్.ఖలీల్‌బాష, సలాం,  మజరుల్‌హక్, సేవాదళ్  చక్రపాణిరెడ్డి, ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్‌‌జలు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top