ముత్తూట్ ఫైనాన్స్ లో2.25 కోట్లు చోరీ! | r.s 2 crores stolen from muthoot finance | Sakshi
Sakshi News home page

ముత్తూట్ ఫైనాన్స్ లో2.25 కోట్లు చోరీ!

Feb 4 2014 2:31 AM | Updated on Sep 4 2018 5:07 PM

ముత్తూట్ ఫైనాన్స్ లో2.25 కోట్లు చోరీ! - Sakshi

ముత్తూట్ ఫైనాన్స్ లో2.25 కోట్లు చోరీ!

రాజధానిలోని తనిష్క్ జ్యువెలరీలో జరిగిన భారీ దొంగతనం తరహాలో... మెదక్ జిల్లా జహీరాబాద్‌లోని ముత్తూట్ ఫైనాన్స్‌లో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది.

7 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.13 లక్షల నగదు అపహరణ
మెదక్ జిల్లా జహీరాబాద్‌లో ఘటన.. హైదరాబాద్‌లో చిక్కిన దొంగ
 
 సాక్షి, హైదరాబాద్, జహీరాబాద్: రాజధానిలోని తనిష్క్ జ్యువెలరీలో జరిగిన భారీ దొంగతనం తరహాలో... మెదక్ జిల్లా జహీరాబాద్‌లోని ముత్తూట్ ఫైనాన్స్‌లో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. ఏకంగా దాదాపు ఏడు కిలోల బంగారంతో పాటు.. రూ. 13 లక్షల నగదు అపహరణకు గురైంది. కానీ, నిందితుడు హైదరాబాద్‌లో నాటకీయంగా పట్టుబడ్డాడు. మెటల్ డిటెక్టర్ భయంతో.. ‘దొంగ’ సొత్తును వదిలేసి పారిపోబోయాడు. సినిమాల్లో ఛేజింగ్ సీన్ల తరహాలో పోలీసులను పరుగులు పెట్టించి.. చివరికి చేతికి చిక్కాడు. నిందితుడిని జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన అశోక్ శర్మగా గుర్తించారు. అతని వద్ద బ్యాగ్‌లో ఉన్న దాదాపు ఏడు కేజీల బంగారం, సూట్‌కేసులోని రూ. 13.42 లక్షల నగదు.. మొత్తంగా రూ. 2.25 కోట్ల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, దినసరి కూలీ అయిన తనను పశ్చిమబెంగాల్‌కు చెందిన లేబర్ కాంట్రాక్టర్ కమ్రూ అక్కడికి తీసుకువచ్చాడని అశోక్ చెప్పాడు. కమ్రూ సోమవారం ఉదయం 8.30కు నాంపల్లి రైల్వేస్టేషన్‌కు రమ్మన్నాడని.. వెళ్లాక తనకు ఆ బ్యాగ్, సూట్‌కేస్ ఇచ్చి ఎంజీబీఎస్‌కు రావాలని, తాను అక్కడ కలుస్తానని చెప్పడంతో వచ్చానని వెల్లడించాడు.
 
 మరో ముగ్గురు కూడా..: నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో కర్ణాటక ఆర్టీసీకి చెందిన బస్ టికెట్ కూడా ఉంది. దాని ప్రకారం దర్యాప్తు చేసిన అఫ్జల్‌గంజ్ పోలీసులు... శుక్రవారం ఎంజీబీఎస్ నుంచి అశోక్ శర్మతో పాటు విశాల్, వినోద్ అనే వ్యక్తులు కలిసి జహీరాబాద్‌కు వెళ్లినట్లు తేలింది. దీంతో కమ్రూ, విశాల్, వినోద్ కూడా ఈ చోరీలో పాలు పంచుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. కమ్రూ, విశాల్, వినోద్‌ల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
 
 చోరీ చేసిందిలా: గుర్తు తెలియని దుండగులు ముత్తూట్ ఫైనాన్స్ ప్రాంగణం వెనుక తలుపు తెరిచి లోనికి చొరబడ్డారు. సీసీ కెమెరాల కనెక్షన్లు కత్తిరించారు. అనంతరం తమ వెంట తెచ్చుకున్న గ్యాస్ సిలిండర్, కట్టర్ల సహాయంతో స్ట్రాంగ్ రూమ్‌ను తెరిచి.. బంగారు ఆభరణాలు, నగదును అపహరించుకుపోయారు.


 దొరికిందిలా..: హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది  మెటల్ డిటెక్టర్లతో ప్రయాణికులను, లగేజీని పరిశీలిస్తుండగా.. ఒక బ్యాగు, సూట్‌కేసు పట్టుకుని వచ్చిన వ్యక్తి వాటిని వదిలి పారిపోవడం మొదలుపెట్టాడు.. బస్‌స్టాండ్ ఆవరణ నుంచి బయటకు పరుగెత్తి ఆటో ఎక్కేశాడు.. ఇది గమనించిన పోలీసులు మరో ఆటోలో వెంబడించి పట్టుకున్నారు. అనుమానితుడు వదిలేసిన బ్యాగులో.. 499 చిన్న కవర్లలో ప్యాక్ చేసి ఉన్న బంగారు ఆభరణాలను పోలీసులు గుర్తించారు. వాటిపై జహీరాబాద్‌లోని ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ ముద్ర, స్టిక్కర్లను గమనించి సమాచారం ఇవ్వగా.. భారీ చోరీ విషయం వెల్లడైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement