కర్నూలు ఉల్లి రైతుల పంటపండింది. తుపానులు, వర్షాల కారణంగా ఉల్లికి వైరస్ సోకడంతో తాడేపల్లిగూడెం ఉల్లిపాయలకు మార్కెట్‌లో డిమాండ్ తగ్గింది.
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్: కర్నూలు ఉల్లి రైతుల పంటపండింది. తుపానులు, వర్షాల కారణంగా ఉల్లికి వైరస్ సోకడంతో తాడేపల్లిగూడెం ఉల్లిపాయలకు మార్కెట్‌లో డిమాండ్ తగ్గింది. క్వింటాలు రూ.4వేల వరకు పలికిన ఉల్లి ధర ఒక్కసారిగా రూ.2,500 దిగువకు పడిపోయింది. అయితే ఆదివారం కర్నూలు ఉల్లి మాత్రం క్వింటాలు రూ.4,500 వరకూ పలికింది. నాలుగు రోజుల క్రితం కూడా ఇదే ధర పలికినా సరుకు నాణ్యత లేకపోవడంతో ఎగుమతిదారులెవరూ కొనుగోలుకు మందుకు రాలేదు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో కొత్త ఉల్లిపాయలు మార్కెట్లకు రాకపోవడం కూడా కర్నూలు ఉల్లికి డిమాండ్ పెరగడానికి దోహదం చేసింది. ఈ ఉల్లిలో తేమ శాతం అధికంగా ఉండటంతో ఎగుమతిదారులు సరుకును కొనడానికి జంకారు. కానీ, ఆదివారం పరిస్థితి మారింది.
పూర్తి డ్రై క్వాలిటీ ఉల్లిపాయలు 75 లారీల వరకు ఇక్కడి మార్కెట్‌కు వచ్చాయి. మహారాష్ట్రలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల అక్కడినుంచి కోల్‌కతా, ఢిల్లీ, బంగాదేశ్ మార్కెట్లకు సరుకు ఎగుమతి చేసేందుకు ప్రతికూల పరిస్థితి ఏర్పడింది. అక్కడినుంచి ఎగుమతిదారుల రాకతో తాడేపల్లిగూడెం మార్కెట్‌కు వచ్చిన సరుకు వచ్చినట్టుగా హాట్ కేక్‌లా అమ్ముడుపోయింది. కర్నూలు ఉల్లి సీజన్ డిసెంబర్ నెలాఖరుకు ముగియనుంది. రిటైల్ మార్కెట్‌లో నాణ్యత తక్కువ ఉన్న ఉల్లి కిలో రూ.40, నాణ్యత కలిగినవి రూ.50కి విక్రయించారు.