గాలి తగలదు.. ఊపిరాడదు!

Patients Suffering in Sarvajana Hospital Anantapur - Sakshi

సర్వజనాస్పత్రిలో పనిచేయని ఏసీలు, ఫ్యాన్‌లు

తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు

ఏఎంసీ వార్డులోనూ అవే అవస్థలు

తాగేందుకు నీళ్లుండవు... ఉక్కపోతలోనూ ఫ్యాన్‌ తిరగదు. ఆక్సిజన్‌ మాస్క్‌ మూతికి కట్టుకున్నా... గాలి ఆడదు. మంచాలు... స్ట్రెచర్‌ల సంగతి సరేసరి. ఆఖరుకు రాత్రివేళల్లో కరెంటు పోతే టార్చిలైట్లే గతి. కానీ ఇదే జిల్లాకంతటికీ పే...ద్ద ఆస్పత్రి. పాలకులు శ్రద్ధ చూపరు. ఆస్పత్రి యాజమాన్యం పట్టించుకోదు. అందుకే ఇక్కడికొచ్చే వారు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు.  

అనంతపురం న్యూసిటీ:  సర్వజనాస్పత్రిలో కనీస కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఆస్పత్రి ఉన్నతాధికారి తన గది దాటి బయటకు రాకపోవడంతో రోగుల హాహాకారాలేవీ ఆయనకు వినపడటం లేదు. ఏపీ చాంబర్‌లో సంతకాలు చేస్తూ అంతా బాగుందంటూ ఆయన గొప్పలు చెబుతుండగా...వార్డుల్లోని రోగులు మాత్రం సౌకర్యాల లేమితో అల్లాడిపోతున్నారు.

ఇళ్ల నుంచే ఫ్యాన్‌లు
ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఆస్పత్రిలో పేరుకు ఫ్యాన్‌లు ఉన్నా...అవి తిరగవు. ఎమర్జెన్సీ వార్డుల్లోని ఏసీలు పనిచేయడం లేదు. అందుకే రోగులు ఇళ్లనుంచే ఫ్యాన్‌లు తెచ్చుకుంటున్నారు. అక్యూట్‌ మెడికల్‌ కేర్‌(ఏఎంసీ) యూనిట్‌లోనూ ఇదే పరిస్థితి ఉండటంతో  రోగులు ఉక్కపోతతో ప్రత్యక్షనరకం చూస్తున్నారు. వాస్తవానికి  ఏఎంసీలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే కేసులుంటాయి. ఈ యూనిట్‌కు 24 గంటలూ నిరంతరాయంగా కరెంటు సరఫరా ఉండడంతో పాటు వెంటిలేటర్, ఏసీ, ఇతరత్రా మౌలిక సదుపాయాలుండాలి. కానీ సర్వజనాస్పత్రిలో ఆ పరిస్థితి లేదు. వారం రోజులుగా కరెంటు సమస్య వెంటాడుతోంది. లోడింగ్‌ సరిగా రాకపోవడంతో యూనిట్‌లో ఉండే రెండు, మూడు ఏసీలు పని చేయడం లేదు. దీంతో రోగుల పరిస్థితి వర్ణణాతీతంగా మారింది. దీంతో రోగుల సహాయకులు విసనకర్రతో ఊపుతూ ఉపశమనం కలిగిస్తున్నారు. మరికొందరు ఇంటి నుంచి ఫ్యాన్లు తెచ్చుకుంటున్నారు. పరిస్థితి ఇంత అధ్వానంగా ఉన్నా...రోగుల ప్రాణాలే పోయేలా ఉన్నా అటు ఆస్పత్రి యాజమాన్యం గానీ, ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులు గాని పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. కనీసం జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ అయినా ఓ సారి యూనిట్‌ను పరిశీలించి మెరుగైన వసతలు కల్పించాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top