పోలీసులకు సొంత ‘గూడు’!

Own house to the police by retirement - Sakshi

పదవీ విరమణ నాటికి సొంత ఇంటి కల నెరవేర్చేందుకు కసరత్తు

తమిళనాడులో అధ్యయనం చేసిన రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ బృందం 

సాక్షి, అమరావతి: పదవీ విరమణ చేసే నాటికి పోలీసులకు సొంత గూడు కోసం కసరత్తు మొదలైంది. ఈ మేరకు ఏపీ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ నడుంబిగించింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను ఆదేశించారు. డీజీపీ చొరవతో ఏపీ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ పీవీ సునీల్‌కుమార్‌ నేతృత్వంలో 15 మంది పోలీసు అధికారులు, ఇంజనీరింగ్‌ అధికారులతో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. ఈ బృందం ఇప్పటికే తమిళనాడు వెళ్లి అక్కడ పోలీస్‌ హౌసింగ్‌ స్కీమ్‌ అమలవుతున్న తీరును అధ్యయనం చేసింది. ప్రతిపాదనలు కార్యరూపంలోకి వస్తే రాష్ట్రంలో దాదాపు 65 వేల పోలీస్‌ కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేరుతుంది. 

తమిళనాడునే ఎందుకు ఎంచుకున్నారంటే..
దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తమిళనాడులో ప్రత్యేకంగా పోలీస్‌ హౌసింగ్‌ స్కీమ్‌ అమలవుతోంది. ‘వోన్‌ యువర్‌ హౌస్‌’ అనే పేరుతో ఈ పథకాన్ని జయలలిత ముఖ్యమంత్రిగా ఉండగా అక్కడ అమల్లోకి తెచ్చారు. దాదాపు 20 ఏళ్ల నుంచి ఈ స్కీమ్‌ విజయవంతంగా కొనసాగుతోంది. ప్రభుత్వమే నేరుగా స్థల సేకరణ చేసి పోలీసులకు ఇల్లు కట్టిస్తోంది. ఇందుకు ప్రభుత్వ నిధులను వినియోగించడంతోపాటు బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటోంది. పోలీసులకు ప్రభుత్వం ప్రతి నెలా ఇచ్చే ఇంటి అద్దె అలవెన్స్‌ (హెచ్‌ఆర్‌ఏ)ను మినహాయించి ఈ మొత్తానికి ప్రభుత్వం కొంత కలిపి నెలవారీ వాయిదాలు చెల్లిస్తోంది. పోలీసులు ఇలా నెలవారీ వాయిదాలు చెల్లించిన అనంతరం పదవీ విరమణ నాటికి ఆ ఇల్లు వారి సొంతమవుతుంది. 

సాధ్యాసాధ్యాలు పరిశీలించాకే నివేదిక
ఏపీ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ పీవీ సునీల్‌కుమార్‌
తమిళనాడు స్కీమ్‌ రాష్ట్రానికి ఎంత వరకు సరిపోతుందనే దానిపై నివేదిక రూపొందిస్తున్నాం. క్షేత్రస్థాయిలో అంశాలను అధ్యయనం చేస్తున్నాం. అన్ని జిల్లాలు, అన్ని నగరాల్లో ప్రస్తుతం భూముల ధరలు ఎలా ఉన్నాయి?  ఎంత భూమి అవసరమవుతుంది? హౌసింగ్‌ స్కీమ్‌లో ఎంత మంది చేరడానికి మక్కువ చూపుతారు? వంటి అనేక విషయాలపై వివరాలు సేకరిస్తున్నాం. తమిళనాడు తరహాలో ప్రభుత్వమే పోలీసులకు ఇల్లు కట్టించి నెలవారీ వాయిదాలు వారి వేతనాల్లోంచి తీసుకోవడమా? ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా? అనే వాటిపై కూడా దృష్టిపెట్టాం. పోలీసుల గృహవసతి కోసం ఇచ్చే స్థలం, నిర్మాణ వ్యయంలో ప్రభుత్వ భాగస్వామ్యం ఏ మేరకు ఉండాలి.. ఇలా అన్ని కోణాల్లోనూ అధ్యయనం చేస్తున్నాం. అన్ని విభాగాల్లోని పోలీసులకు ఆప్షన్స్‌ ఇచ్చి ఎక్కువ మంది ఏ పద్ధతికి మొగ్గుచూపుతారో తెలుసుకుంటాం. అందులో సాధ్యాసాధ్యాలు తెలుసుకున్నాకే ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top