అద్భుత శిల్పకళా ఖండాలతో గాలిగోపురం | Outstanding architectural continents wind tower | Sakshi
Sakshi News home page

అద్భుత శిల్పకళా ఖండాలతో గాలిగోపురం

Oct 19 2013 3:02 AM | Updated on Sep 1 2017 11:45 PM

శ్రీకాళహస్తి పట్టణంలో స్వర్ణముఖి నది ఒడ్డున ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గాలిగోపురం గిన్నిస్‌బుక్‌లో నమోదు కానుందని రాష్ట్ర దేవాదాయశాఖ స్తపతులు సుందర్‌రాజన్, వేలు అన్నారు.

 

=రాష్ట్ర దేవాదాయశాఖ స్తపతులు  
 =గోపుర నిర్మాణానికి మరో రెండున్నరేళ్లు
 =మూడవదశ పనులు ప్రారంభం   
 =సింహద్వారాల ప్రతిష్ఠాపన

 
 శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: శ్రీకాళహస్తి పట్టణంలో స్వర్ణముఖి నది ఒడ్డున ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గాలిగోపురం గిన్నిస్‌బుక్‌లో నమోదు కానుందని రాష్ట్ర దేవాదాయశాఖ స్తపతులు సుందర్‌రాజన్, వేలు అన్నారు. శుక్రవారం గాలిగోపురం మూడోదశ పనులలో భాగంగా సింహద్వారాల పనులకు అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించగా క్రేన్ సాయంతో ఇంజినీర్లు వాటిని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా స్తపతులు మాట్లాడుతూ గాలిగోపురాన్ని అద్భుత శిల్పకళా ఖండాలతో రూపొందిస్తున్నామన్నారు.

రాతికట్టడంతో నిర్మిస్తున్న ఈ గోపురం వెయ్యేళ్లు చెక్కుచెదరకుండా ఉంటుందన్నారు. రాజగోపురం కుప్పకూలి ఇప్పటికే మూడున్నరేళ్లు గడిచిందని, దీని నిర్మాణం పూర్తికావడానికి మరో రెండున్నరేళ్లు పడుతుందని అన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన నాణ్యమైన రాళ్లను నిర్మాణానికి వాడుతున్నామని చెప్పా రు. ఇప్పటికి రెండు దశల్లో పనులు పూర్తయ్యాయని మూడో దశ పనుల్లో భాగంగా ద్వారబంధాలను ప్రతిష్ఠించామని అన్నారు.

రాజగోపురానికి ఎనిమిది ద్వారబంధాలు ఉపయోగిస్తున్నామని, ఒక్కొక్కటి 66.5 అడుగుల ఎత్తు ఉంటుందని చెప్పారు. రూ.55 కోట్లతో చేపట్టిన గోపురం పనులు ఎనిమిది దశలలో పూర్తవుతాయన్నారు. కాగా ప్రభుత్వం నుంచి సుమారు రూ.4కోట్ల వరకు గోపుర నిర్మాణానికి సీఎం అందజేయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీనాయుడు తెలిపారు. పూజా కార్యక్రమంలో ఈవో శ్రీరామచంద్రమూర్తి, పీసీసీ కార్యదర్శి కోలా ఆనంద్, డీసీసీ కార్యదర్శి అంజూరు శ్రీనివాసులు, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కోదండరామిరెడ్డి, ఆలయ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
 

Advertisement

పోల్

Advertisement