అధికారుల్లో క్రమశిక్షణ లేదు | Officials did not discipline | Sakshi
Sakshi News home page

అధికారుల్లో క్రమశిక్షణ లేదు

Apr 20 2016 1:17 AM | Updated on Oct 9 2018 7:11 PM

అధికారుల్లో డిసిప్లిన్ లేదు.. ఇక కిందస్థాయి వారు ఎలా ఉంటారో అర్థమవుతుందంటూ వైద్య ఆరోగ్య శాఖ ...

రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
రెండో రోజు కొత్త, పాత ప్రభుత్వాస్పత్రుల్లో పూనమ్ తనిఖీలు

 

విజయవాడ (లబ్బీపేట) : అధికారుల్లో డిసిప్లిన్ లేదు.. ఇక కిందస్థాయి వారు ఎలా ఉంటారో అర్థమవుతుందంటూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య అసహనం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో పనిచేసే సమయంలో కొన్ని నిబంధనలు పాటించాలని, అవి అధికారులు పాటిస్తే కిందస్థాయి వారు పాటిస్తారని ఆమె తెలిపారు. కొత్త ప్రభుత్వాస్పత్రిలో సోమవారం అర్ధరాత్రి రెండు గంటల వరకు సమీక్ష జరిపిన ఆమె, మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకే పాత ప్రభుత్వాస్పత్రిలో తనిఖీలకు వెళ్లారు. అక్కడ ప్రత్యేక నవజాత శిశు విభాగాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ విభాగంలో చికిత్స పొందుతున్న శిశువుల తల్లులు వేచివున్న గదికి వెళ్లారు. ఈ సందర్భంగా పలువురిని సమస్యలు అడగగా, సిజేరియన్ అయిన ఐదు రోజులకే డిశ్చార్జి చేస్తున్నారని, ఇక్కడ కింద కూర్చోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన పూనమ్ మాలకొండయ్య, సిజేరియన్ అయిన  వారి కోసం అక్కడ పడకలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రసూతి ఓపీ విభాగాన్ని, అక్కడి పరికరాలను పరిశీలించారు. అనంతరం కొత్త ప్రభుత్వాస్పత్రికి చేరుకుని డయాగ్నోస్టిక్ బ్లాక్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కుర్చీలు ఖాళీగా ఉండటంతో వారు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. పక్క గదిలో ఉన్న సిబ్బంది రాగా, మీరు యూనిఫామ్ వేసుకోరా అని నిలదీశారు. అనంతరం ఐసీటీసీ, ఏఆర్‌టీ విభాగాలను పరిశీలించారు. మధ్యాహ్నం డయాగ్నోస్టిక్ బ్లాక్ పైన నిర్మాణం పూర్తయిన రెండు అంతస్థులను పరిశీలించి, దానికి విద్యుత్ సౌకర్యం కల్పించి ప్రారంభోత్సవం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

 
సూపర్ బ్లాక్, ఇతర సౌకర్యాలపై చర్యలు

ప్రధానమంత్రి స్వాస్థ్ సురక్ష యోజన పథకం ద్వారా మంజూరైన రూ.150 కోట్ల నిధులతో చేపట్టనున్న భవన నిర్మాణాలకు సంబంధించి ప్లాన్‌ను డీఎంఈ డాక్టర్ టి.వేణుగోపాలరావు, ఏపీహెచ్‌ఎంఎస్‌ఐడీసీ చీఫ్ ఇంజనీర్ డి.రవీందర్‌లతో కలిసి చర్చించారు. బ్లడ్‌బ్యాంక్‌లో కాంపోనెంట్స్ యూనిట్ ఏర్పాటు, అదనపు యూనిట్ల మంజూరు వంటి అంశాలపై సూపరింటెండెంట్ చాంబర్‌లో ఉన్నతాధికారులతో మాట్లాడారు. రెండు రోజుల సందర్శనలో తన దృష్టికొచ్చిన అంశాలపై అధికారులతో చర్చించారు. సాయంత్రం పాత ప్రభుత్వాస్పత్రిని సందర్శించి రోగులకందుతున్న సేవలపై ఆరా తీశారు.


ఆస్పత్రిలో రాష్ట్ర అధికారుల హడావుడి
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య ప్రభుత్వాస్పత్రిలో చేపట్టాల్సిన పనులను పరిశీలించేందుకు పలువురు అధికారులు హడావుడి చేశారు. ఏపీహెచ్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ వెంకట గోపీనాధ్ సివిల్ పనులు, పరికరాల అంశాలను పరిశీలించగా, ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓ, డ్రగ్ కంట్రోల్ బోర్డు డెరైక్టర్ రవిశంకర్ అయ్యర్ బ్లడ్ బ్యాంక్‌ను పరిశీలించారు. వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ బి.సోమరాజు, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ డెరైక్టర్ డాక్టర్ సావిత్రి, అడిషనల్ డెరైక్టర్ డాక్టర్ నీరద, డీఈఈ రోహిణి, వైద్య ఆరోగ్యశాఖ సలహాదారు జితేంద్రశర్మ పలు వార్డుల్లో తనిఖీలు నిర్వహించారు. వారి వెంట ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యు.సూర్యకుమారి, డీఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ నాగమల్లేశ్వరి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement