హైదరాబాధ | Non- bus conditioned ticket1000 | Sakshi
Sakshi News home page

హైదరాబాధ

Apr 3 2015 3:21 AM | Updated on Sep 2 2017 11:45 PM

తెలంగాణలో ప్రవేశం కోసం విధించి న పన్ను ప్రైైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లకు కలిసి వస్తోంది. పన్ను భారం తమపై పడుతోందని ఆపరేటర్లు ధరలు అమాంతం పెంచేశారు.

నాన్ ఏసీ బస్సు టికెట్ రూ.వెయ్యి
రెండు వేలు పలుకుతున్న ‘వాల్వో’
{పయాణికులకు పన్ను పోటు
అమాంతం చార్జీలు పెంచిన ప్రైవేటు బస్సులు

 
విశాఖపట్నం: తెలంగాణలో ప్రవేశం కోసం విధించి న పన్ను ప్రైైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లకు కలిసి వస్తోంది. పన్ను భారం తమపై పడుతోందని ఆపరేటర్లు ధరలు అమాంతం పెంచేశారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల తో ఆపరేటర్లకు ఊరట లభించినా ప్రయాణికుల నుంచి దండిగా డబ్బు గుంజుతున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్‌కు సాధారణ రోజులలో నాన్ ఏసీ చార్జి రూ.550 నుంచి రూ.700 ఉండగా ప్రస్తుతం రూ.800 నుంచి రూ.1,100 పలుకుతోంది. వాల్వో  బస్సులో ప్రయాణ చార్జి సాధారణ రోజులలో రూ.800 నుంచి రూ.1,300 ఉండగా ప్రస్తుతం రూ.1,100 నుంచి రూ.1,900 ధరలు వసూలు చేస్తున్నారు. షిర్డీ ప్రయాణం కోసం వాల్వో చార్జి సాధారణ రోజులో రూ.2,000 ఉండగా ప్రస్తుతం రూ.2,800 నుంచి రూ.3,200 వరకూ ధరలు పెంచారు. ఆయా ట్రావెల్ ఆపరేటర్లకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్, సదుపాయాలను బట్టి టికెట్ ధరలలో వ్యత్యాసం చూపుతున్నారు. విశాఖ నుంచి హైద్రాబాద్‌కు వివిధ ట్రావెల్స్ నుంచి దాదాపు 40 సర్వీసులు నడుస్తుండగా షిర్డీకి రెండు సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి.

 పట్టించుకునేవారేరీ?: ప్రయాణికులకు ఊరటనిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చినా వాటితో సంబంధం లేకుండా ఆపరేటర్లు ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్నారు. ధరలు పెంచి పన్ను భారం అంటున్నారు. శుక్రవారం గుడ్‌ఫ్రైడే, శని, ఆదివారం సాఫ్ట్‌వేర్, కార్పొరేట్ సంస్థలకు సెలవు కావడంతో విశాఖ నుంచి హైద్రాబాద్‌కు ఇరువైపులా ప్రయాణికుల తాకిడి ఉంటుంది. ఇదే అదనుగా భావించిన ఆపరేటర్లు దోచుకోవడానికి సిద్ధపడ్డారు. హైద్రాబాద్ నుంచి విశాఖకు ధరలు స్వల్పంగా పెంచారు. విశాఖ నుంచి హైద్రాబాద్‌కు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణ పన్ను పేరుతో ట్రావెల్స్ ఆపరేటర్లు భారం మోపుతున్నారు. పండగ సీజన్ తలపించే రీతిలో వ్యాపారం జరుగుతోంది. విశాఖ నుంచి విజయవాడ, గుంటూరు, తిరుపతి, చెన్నై, బెంగుళూరు ధరలలో మార్పులు లేకపోవడం విశేషం. అయితే హైద్రాబాద్, షిర్డీ వెళ్లే బస్సులకు ధరలు సగ శాతం పెంచినట్టు తెలిసింది. వేసవిలో రైళ్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా ఆపరేటర్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆర్టీసీ బస్సుల కొరతతో ట్రావెల్స్ వ్యాపారం ఊపందుకోంది. ట్రావెల్స్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా రాకపోకలు చేస్తున్నా ప్రశ్నించేవారు కరువయ్యారు. ఆన్‌లైన్‌లో టికెట్ల ధరలు సాధారణంగా ఉంటున్నా ఖాళీలు లేనట్టు చూపుతున్నాయి. చాలా మంది టికెట్ కోసం ప్రయత్నించగా టికెట్ బుకింగ్ జరగడం లేదు. అయితే నేరుగా ట్రావెల్స్ కార్యాలయాలకు వెళితే అధిక ధరల వసూళ్లకు పాల్పడటం గమనార్హం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement