పల్లెకు దారేదీ? | no roads for tribal village's | Sakshi
Sakshi News home page

పల్లెకు దారేదీ?

Oct 31 2017 7:41 AM | Updated on Aug 30 2018 4:49 PM

అనంతపురం సిటీ: అభివృద్ధికి రాచ బాటలు రహదారులు. అలాంటి రహదారులు లేని ప్రాంతాలు అభివృద్ధికి ఆమడదూరమనడంలో ఎలాంటి సందేహం లేదు. రహదారులులేని గ్రామాలు జిల్లాలో కోకొళ్లలు. రహదారులు సరిగా లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.

అధికారుల నిర్లక్ష్యం.. పాలకుల స్వార్థం
రహదారుల నిర్మాణాల్లో అధికారుల నిర్లక్ష్యం, పాలకుల స్వార్థం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కొందరు నేతలు రహదారుల కాంట్రాక్టులు తమకే దక్కేలా చక్రం తిప్పుతున్నారు. ఇందుకోసం అధికారులతో అప్పటికప్పుడు ప్రణాళికలను సిద్ధం చేసి ఎంతకి కోట్‌ చేయాలో కూడా వారే చెబుతున్నారు. ఇక... నాణ్యతకు తిలోదకాలిచ్చి డబ్బులు దండుకోవడమే పరమావధిగా వాటిని నిర్మాణాలను మమ అనిపిస్తున్నారు. కొన్ని చోట్ల అధికారులు బరితెగించి వేసిన రోడ్లపైనే మళ్లీ రోడ్లు వేస్తున్నారు.

కాంట్రాక్టర్లపై చర్యలేవీ?
రహదారుల నిర్మాణాల్లో కాంట్రాక్టర్లు నాణ్యతకు తిలోదకాలిచ్చినా ఆయా శాఖల ఉన్నతాధికారులు చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. నేతల ఒత్తిడుందని, తప్పని పరిస్థితి అంటూ తప్పుకునే పద్ధతులను ఎంచుకుంటున్నారు. ఫలితంగా జరిగిన తప్పే మరోసారి జరుగుతోంది. గుత్తి, బ్రహ్మసముద్రం, కంబదూరు, యల్లనూరు ప్రాంతాల్లో చివరికి ప్యాచ్‌ వర్కులు కూడా చేయకుండా ఒక్కో రహదారికి రూ.20 నుంచి రూ.24 లక్షలను ఆ శాఖ అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై దండుకున్నట్లు ఆరోపణలున్నాయి. వీటిపై ఇప్పటికే విచారణ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు నాణ్యతతో కూడిన నిర్మాణాల కోసం అక్రమార్కులపై చర్యలు తీసుకుంటారా? లేక నామ మాత్రపు విచారణల పేరుతో కాలయాపన చేస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

మచ్చుకు కొన్ని...
పెనుకొండ నుంచి చిన్నపరెడ్డిపల్లి, మోట్రాపల్లి, శెట్టిపల్లి, అడదాకులపల్లి గ్రామాలకు వెళ్లే బీటీ రోడ్డు 20 ఏళ్లక్రితం వేశారు. రహదారి సరిగా లేకపోవడంతో ఆయా గ్రామాలకు బస్సులు వెళ్లడం లేదు. ప్రమాదాలు జరుగుతున్నా ఆటోల్లోనే వెళ్లాల్సి వస్తోంది.
లేపాక్షి పరిధిలోని మద్దిపి గ్రామానికి వెళ్లే రహదారి చాలా అధ్వానంగా ఉంది. ఈ రహదారికి సంబంధించిన ప్రణాళికను అప్పట్లో అధికారులు ప్రభుత్వానికి పంపారు. అనంతరం వారు పట్టించుకోకపోవడంతో అనుమతులు లభించలేదని తెలిసింది.
కూడేరు పరిధిలోని పి.నారాయణపురం, కరుట్లపల్లి, కడదరకుంట గ్రామాలకు వెళ్లే రహదారి గుంతలమయమైంది. నాసిరకంగా పనులు చేయడంతో ఈ రహదారి ఏ మాత్రం ప్రయాణానికి అనుకూలంగా లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.

మేం మనుషులు కాదా?
ఐపార్సుపల్లి గ్రామస్తులను పాలకులు మనుషులుగా గుర్తించడం లేదు. 15 ఏళ్ల క్రితం రహదారి నిర్మాణం కోసం కంకరతోలి వదిలి పెట్టారు. ఇప్పటి దాకా రోడ్డు వేయక పోవడంతో ఉన్న రోడ్డు పాడయిపోయి ఆర్టీసీ సంస్థ బస్సులను కూడా గ్రామానికి నడపడం మానేసింది. మేం పడుతున్న బాధలు ఎవరికీ పట్టడం లేదు.– సూరేనాయక్, ఐపార్సుపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement