దత్తత మాట గుర్తేలేదు 

No Developments In Adopted Villages  By TDP Govt In Pondur Region - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : మాట్లాడితే అక్కడ అభివృద్ధి చేశాం. ఇక్కడ అభివృద్ధి చేశామని బీరాలు పలికే ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ వారి సొంత గ్రామం, దత్తత గ్రామాలనే గాలికొదిలేశారు. దీంతో తల్లికి తిండి పెట్టనోడు పిన తల్లికి గాజులు పెడతాడా అంటూ ఆయా గ్రామాల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి సంగతి దేవుడెరుగు కనీసం మౌలిక వసతులు కల్పించండి మహా ప్రభో అంటూ వేడుకుంటున్నారు. 

ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ సొంత గ్రామం పెనుబర్తి. ఈ గ్రామాన్ని సందర్శించిన వారెవరైనా అయ్యోపాపం అనే అంటారు. ఎందుకంటే ఆ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది.  గ్రామంలో కనీస వసతులు కరువయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ గ్రామాన్ని కూన రవికుమార్‌ కుటుంబమే గత 15 ఏళ్లుగా పాలిస్తున్నారు. అయినప్పటికీ అభివృద్ధి మాత్రం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.  

అన్నీ అవస్థలే
పెనుబర్తి గ్రామాన్ని సమస్యలు పట్టి పీడిస్తున్నాయి.  గ్రామానికి కనీసం పంచాయతీ భవనం లేకపోవడం దారుణం. కొన్ని వీధుల్లో మురికి కాలువలు లేకపోవడంతో మురుగు రోడ్డు మీదనే నిలిచిపోతోంది. అంగన్‌వాడీ భవనాలు లేకపోవడంతో ఒకటో నంబర్‌ అంగన్‌వాడీ కేంద్రాన్ని పెనుబర్తి ప్రాథమిక పాఠశాలలో, రెండో నంబర్‌ అంగన్‌వాడీ కేంద్రాన్ని ఐఆర్‌పురం ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్నారు. ఇకపోతే గ్రామంలోకి ప్రవేశించే రహదారి పూర్తిగా రాళ్లు తేలి అధ్వానంగా ఉంది.

అలాగే ఆరేళ్ల క్రితం నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్రం ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. పశువుల ఆస్పత్రి శిథిలావస్థకు చేరుకుంది. శ్మశాన వాటికకు వెళ్లేందుకు రహదారి లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల బిల్లులు అందలేదని స్థానికులు వాపోతున్నారు. బిల్లులు అందించడంలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అర్హులకు పింఛన్‌లు అందడం లేదని, ఎరువులను ఎక్కువ ధరకే కొనాల్సి వస్తోందని వాపోతున్నారు.

కబ్జాల్లో మాత్రం ముందంజ
దత్తత గ్రామం అభివృద్ధికి నోచుకోపోయినా భూకబ్జాలకు నిలయంగా మారిందని ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చిట్టివలస గ్రామం సంగమేశ్వర కొండ ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో వందల ఎకరాల్లో ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూముల్లో పట్టాలు మంజూరు చేయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ అధికారుల ఒత్తిళ్లకు, మామూళ్లకు తలొగ్గిన రెవిన్యూ అధికారులు సుమారు 10 ఎకరాల కొండ భూమిలో టీడీపీ కార్యకర్తలకు పట్టాలు మంజూరు చేశారు. దీంతో భూమిని కబ్జా చేసుకుని దత్తత గ్రామాన్ని కబ్జా పర్వంలో ముందంజలో ఉంచారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

పంటను అమ్ముకోలేక పోయాం
ఈ ఏడాది వరి పంటను పండించినప్పటికీ అమ్ముకోలేకపోయాం. ధాన్యం కొనుగోలుకు కూడా ఎమ్మెల్యే ఎటువంటి సాయం చేయలేదు. సొసైటీలు ద్వారా యూరియా రూ.320లకు కొనుగోలు చేశాం కానీ అదే యూరియా బయట రూ.300లకే దొరికింది. విత్తనాలను కూడా అధిక ధరలకే అమ్మారు. గ్రామాన్ని, రైతులను ఆదుకోవడానకి ఆయన దృష్టి సారించలేదు.
 – కూన రాజ్‌కుమార్, రైతు, పెనుబర్తి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top