ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 16వ వైస్ చాన్సలర్‌గా నియమితులైన ఆచార్య బి.రాజేంద్రప్రసాద్ మంగళవారం తొలిసారిగా విధులకు హాజరయ్యారు.
ఏఎన్‌యూ (గుంటూరు) : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 16వ వైస్ చాన్సలర్‌గా నియమితులైన ఆచార్య బి.రాజేంద్రప్రసాద్ మంగళవారం తొలిసారిగా విధులకు హాజరయ్యారు. ఏఎన్‌యూ వీసీగా ఈనెల 13న నియమితులైన ఆచార్య రాజేంద్రప్రసాద్ అదే రోజు బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు ఏఎన్‌యూ రిజిస్ట్రార్‌కు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. మంగళవారం క్యాంపస్‌కు వెళ్లిన ఆయన తొలుత వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఉన్న ఆచార్య నాగార్జునుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
పరిపాలనాభవన్‌కు వచ్చిన వైస్ చాన్సలర్ ఆచార్య రాజేంద్రప్రసాద్‌కు రెక్టార్ ఆచార్య కేఆర్‌ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్, వర్సిటీ ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. యూనివర్సిటీలో యాంటీ సెక్సువల్ హెరాస్‌మెంట్ సెల్ (మహిళలపై లైంగిక వేధింపుల వ్యతిరేక సెల్) ఏర్పాటుకు సంబంధించిన ఫైల్‌పై వైస్‌చాన్సలర్ తొలి సంతకం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వీసీ సతీమణి శకుంతల, పలువురు ఏఎన్‌యూ అధికారులు, ఉద్యోగ, పరిశోధక, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.