అనుకున్నదే అయ్యింది | Narasapuram Municipal Council meeting postponed | Sakshi
Sakshi News home page

అనుకున్నదే అయ్యింది

Nov 30 2014 1:11 AM | Updated on Oct 16 2018 6:40 PM

అంతా అనుకున్నట్టుగానే జరిగింది. శనివారం జరగాల్సిన నరసాపురం మునిసిపల్ కౌన్సిల్ సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడింది.

నరసాపురం అర్బన్: అంతా అనుకున్నట్టుగానే జరిగింది. శనివారం జరగాల్సిన నరసాపురం మునిసిపల్ కౌన్సిల్ సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడింది. నిబంధనల ప్రకారం కౌన్సిలర్లకు సకాలంలో ఎజెండా ప్రతులను పంపిణీ చేయకపోవడమే వాయిదాకు కారణం. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ సభ్యులు మూకుమ్మడిగా సమావేశానికి గైర్హాజరయ్యారు. దీంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు కమిషనర్ బండి శేషన్న ప్రకటించారు. దీంతో చైర్‌పర్సన్ పసుపులేటి రత్నమాల, ఇతర అధికార పార్టీ కౌన్సిలర్లు సమావేశం నుంచి వెనుదిరిగారు. అనంతరం చైర్‌పర్సన్ విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ సభ్యులు కూడా కొంతమంది హాజరు కాలేదని, అందుకే కోరం లేకుండా పోయిందని చెప్పారు.
 
 గత్యంతరం లేకనే..
 మునిసిపల్ సాధారణ సమావేశానికి సంబంధించి ఎజెండా పంపిణీ చేసిన రోజు, సమావేశం జరిగే రోజును మినహాయిస్తే మధ్యలో మూడు సంపూర్ణ దినాలు ఉండాలి. అయితే సమావేశానికి సంబంధించి రెండు రోజుల వ్యవధిలో మాత్రమే సభ్యులకు ఎజెండా ప్రతులను పంపిణీ చేశారు. దీనిపై సమావేశంలో రభస జరుగుతుందని రెండు రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. ఇదే అంశంపై శుక్రవారం ‘సాక్షి’ వివరాలతో కథనాన్ని అందజేసింది కూడా. చివరకు అదే నిజమయ్యింది. అజెండా ప్రతులను ఆలస్యంగా ఇచ్చిన నేపథ్యంలో సమావేశం జరిగినా కూడా ఎవరైనా అభ్యంతరం చెప్పినా తీర్మానాలు చెల్లుబాటు కావని మునిసిపల్ చట్టం చెబుతోంది. దీంతో పాలకపక్షం పరువు నిలుపుకోవడానికి కోరం లేక సమావేశాన్ని వాయిదా వేసినట్టు భావిస్తున్నారు.
 
 లిమిటెడ్ కంపెనీగా మార్చారు
 నరసాపురం మునిసిపాలిటీని అజ్ఞానం, చేతకానితనంతో ఓ లిమిటెడ్ కంపెనీగా మార్చారని వైఎస్సార్ సీపీ సభ్యుడు కొత్తపల్లి భుజంగరాయలు (నాని) విమర్శించారు. మూకుమ్మడిగా సమావేశానికి గైర్హాజరైన అనంతరం వైఎస్సార్ సీపీ సభ్యులు స్థానిక మునిసిపల్ అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నాని మాట్లాడుతూ సాధారణ సమావేశానికి సంబంధించిన అజెండాను కౌన్సిలర్లకు ఎప్పుడివ్వాలి? అనే అంశంపై కూడా పాలకపక్షానికి అవగాహన లేకపోవడం విచిత్రంగా ఉందన్నారు. పూర్తిమెజార్టీ ఉండి గద్దెనెక్కిన ఐదు నెలల కాలంలో రెండు సాధారణ సమావేశాలను నిర్వహించలేదని, ఇది పాలకవర్గం చేతకానితనమన్నారు. మునిసిపల్ ఫ్లోర్ లీడర్ సాయినాథ్ ప్రసాద్, మరో కౌన్సిలర్ బళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2014-15 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో పట్టణంలో రూ. 2.50 కోట్లు అభివృద్ధి పనులకు కేటాయించారన్నారు. కనీసం ఆ పనులకు సమావేశాల్లో ఆమోదం పొందించుకునే సమర్థత కూడా పాలకపక్షానికి లేదన్నారు. కౌన్సిలర్లు కామన బుజ్జి, వన్నెంరెడ్డి శ్రీనివాస్, సందక సురేష్, పతివాడ పద్మా మార్కెండేయులు, బుడితి దిలీప్, కత్తుల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement