మగాళ్లు సీతాకోక చిలుకలు.. !

Nannapaneni rajakumari warns women to beware of men  - Sakshi

అశ్లీల వెబ్‌సైట్లను కేంద్రం తొలగించాలి  మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు రాజకుమారి

చిత్తూరు ‌: ‘మగాళ్లు సీతాకోక చిలుకల్లాంటి వారు. ఆడపిల్లలు పూబంతులు. వీరిని ఆకట్టుకోవడానికి సీతాకోక చిలుకలు రంగు రంగుల ఆకర్షణలతో రకాల వేషాలు వేస్తుంటారు. అలాంటి వారి ఆకర్షణకు మహిళలు లోనుకావద్దు. మాన, ప్రాణ, ఆత్మరక్షణ కోసం అవసరమైతే అంతం చేస్తాం.. అని ఎదురుతిరగాలి. అలాగని మగాళ్లందరూ చెడ్డవారు కాదు.’ అని రాష్ట్ర మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు నన్నపనేని రాజకుమారి అన్నారు. పిల్లలు, యువతను పెడదోవ పట్టిస్తున్న అశ్లీల వెబ్‌సైట్లు, యూ ట్యూబ్‌ల్లోని వీడియోలను కేంద్రం తొలగించాలన్నారు. తమ డిమాండ్‌ను కేంద్రానికి రాతపూర్వకంగా అందిస్తామన్నారు.

చిత్తూరు జిల్లాకు చెందిన భార్గవి, తిరుమల, నాగరత్న, నిర్మల అనే నలుగురు మహిళా కానిస్టేబుళ్లు గత 45 రోజులుగా 1200 కిలో మీటర్ల పాటు సైకిల్‌పై తిరుగుతూ మహిళల్లో ఆత్మస్థైర్యం నింపే కార్యక్రమాన్ని చేపట్టారు. చిత్తూరులో గురువారం జరిగిన ఈ ముగింపు కార్యక్రమానికి నన్నపనేని రాజకుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫేస్‌బుక్, యూ ట్యూబ్, వాట్సప్‌లను అవసరాలకు కాకుండా అనవసర విషయాలకు నేటి యువత ఎక్కువగా వినియోగిస్తోందన్నారు.

దీనికి తోడు టీవీల్లో వచ్చే కొన్ని సీరియల్స్‌ మహిళల్ని చులకనగా చూపించడం, నేర ప్రవృత్తిని రెచ్చగొట్టేలా ఉండటం, అసభ్యంగా చూపడం వల్ల సమాజంలో మహిళల పట్ల ఎక్కువగా వేధింపులు, దాడులు జరుగుతున్నాయన్నారు. ఆడ పిల్లలు తల్లితండ్రుల కంటే ఎక్కువ సమయం ఉపాధ్యాయుల వద్దే ఉంటున్నారని, వారిని చదువులకే పరిమితం చేయకుండా సమాజం ఎలా పోతోంది, సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలనే విషయాలను సైతం నేర్పించాల్సిన బాధ్యత టీచర్లు, అధ్యాపకులపై ఉందన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top