
పేదల స్థిరత్వానికే భూపంపిణీ: కిరణ్‌కుమార్‌రెడ్డి
పేదలకు స్థిరత్వం, గుర్తింపు కల్పించేందుకే సేద్యయోగ్యమైన భూమిని పంచాలని భూపంపిణీ కార్యక్రమం చేపట్టామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.
సాక్షి, హైదరాబాద్: పేదలకు స్థిరత్వం, గుర్తింపు కల్పించేందుకే సేద్యయోగ్యమైన భూమిని పంచాలని భూపంపిణీ కార్యక్రమం చేపట్టామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. రాజధాని నగరంలోని రవీంద్రభారతిలో శుక్రవారం మధ్యాహ్నం ఏడో విడత భూ పంపిణీ కార్యక్రమ ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. గోదావరి, కృష్టా నదుల నుంచి సముద్రంపాలవుతున్న నీటిని ప్రాజెక్టుల ద్వారా సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రంలో ఎకరా కూడా బీడుకాబోదని సీఎం అన్నారు.
జలయజ్ఞం కింద ఇప్పటి వరకూ చేసింది సగమేనని, చేయాల్సింది ఇంకా సగం మిగిలే ఉందని ఆయన తెలిపారు. ‘ఇప్పటికీ మన రాష్ట్రంలో 65 నుంచి 70 శాతం మంది ప్రజలు వ్యవసాయరంగంమీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రతి ఏటా గోదావరి నుంచి 5 వేల టీఎంసీలు, కృష్ణా నుంచి 500 టీఎంసీల నీరు వృథాగా సముద్రం పాలవుతోంది. ఒక టీఎంసీ నీరు పదివేల ఎకరాల సాగుకు సరిపోతుంది. వృథా అవుతున్న నీటిని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంద’న్నారు. దీంతో వ్యవసాయంతోపాటు దాని అనుబంధ రంగాలైన పౌల్ట్రీ, పాడిపరిశ్రమల వంటి వాటితో రైతులకు లాభం కలుగుతుందన్నారు.
అసైన్డ్ భూములకూ బ్యాంకు రుణాలు...
ప్రభుత్వం నుంచి పొందిన అసైన్డ్ భూములకు (డీకేటీ పట్టాలకు) కూడా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోం దని, ఈ వారంలో జరిగే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో దీనిపై సీఎం మార్గనిర్దేశం చేస్తారని రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. ఈ నెలాఖరులోగా 1.25 లక్షల ఎకరాల భూమిని 80 వేల మందికి పంపిణీ చేస్తామని, తర్వాత వ్యవసాయ యోగ్యమైన భూమి ప్రభుత్వం వద్ద ఉండదని, ఇదే చివరి విడత భూ పంపిణీ అవుతుందని మంత్రి పేర్కొన్నారు. మంత్రులు ముఖేశ్ గౌడ్, ప్రసాద్ కుమార్, శాసనసభ్యులు కె.లక్ష్మారెడ్డి, సుధాకర్, ఎమ్మెల్సీ రంగారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ జిల్లాలకు చెందిన కొందరికి భూమిపట్టాలతోపాటు పట్టాదారుపాసుపుస్తకాలు, టైటిల్‌డీడ్స్ అందజేశారు.
సర్కారు భూమి వెబ్‌సైట్ ప్రారంభం
వివిధ రకాల ప్రభుత్వ భూముల వివరాలు తెలియజేసే ‘సర్కార్ భూమి’ వెబ్‌సైట్‌ను సీఎం ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన రాష్ట్ర భూ పరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ కార్యాలయ భవనాన్ని కూడా ఆయన ప్రారంభించారు. తర్వాత సీఎం ఈ వెబ్‌సైట్ ద్వారా భూముల సమాచారం ఎలా పొందవచ్చో అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సీఎంచే నేడు పులిచింతల ప్రారంభం
విజయవాడ: కృష్ణాడెల్టా రైతుల చిరకాలవాంఛ అయి న పులిచింతల ప్రాజెక్టును శనివారం సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి జాతికి అంకితం చేస్తారని మంత్రి పార్థసారథి విజయవాడలో చెప్పారు. సీఎం ఉదయం గుంటూరు జిల్లా పులిచింతల వద్ద పైలాన్‌ను ఆవిష్కరిస్తారని, మధ్యాహ్నం విజయవాడలో బహిరంగసభలో పాల్గొంటారని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు కె.ఎల్.రావు ప్రాజెక్టుగా పేరుపెట్టినట్లు చెప్పారు.