న్యాయమూర్తిపై దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, అతని అనుచరులపై క్రిమినల్ కేసు పెట్టాలని నరసాపురం బార్ అసోసియేషన్
నరసాపురం (రాయపేట) :న్యాయమూర్తిపై దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, అతని అనుచరులపై క్రిమినల్ కేసు పెట్టాలని నరసాపురం బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. స్థానిక బార్ అసోసియేషన్‌లో న్యాయవాదులు శనివారం సమావేశమై స్వాతంత్య్ర దినోత్సవం రోజున అదనపు జిల్లా న్యాయమూర్తి పి.కల్యాణరావు, న్యాయవాదులపై ఎమ్మెల్యే మాధవనాయుడు, ఆయన అనుచరులు దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడటంపై చర్చించారు.
ఎమ్మెల్యే ప్రవర్తన న్యాయవ్యవస్థను అవమానించినట్లుగా ఉందని, ఇటువంటి ఘటన ఇంతవరకు దేశంలో ఏ శాసనసభ్యుని నుంచి ఎదురుకాలేదని సభ్యులు విమర్శించారు. బార్ అసోసియేషన్‌లో ఆయనకున్న సభ్యత్వాన్ని రద్దు చేయాలని పట్టుపట్టారు. స్థానిక ఎమ్మెల్యే మాధవనాయుడు బార్ అసోసియేషన్ సభ్యుడు కావడం తొలుత గర్వపడ్డామని, ఆయనకు ఘన సన్మానం కూడా చేయాలని యోచించామని, అయితే ఆయన నిజస్వరూపం బయటపడిందని అసోసియేషన్ మండిపడింది. ఈ ఘటనపై న్యాయమూర్తి కల్యాణరావు తీవ్ర మనస్థాపం చెందారని, దీనిపై చర్చించడానికి ఆయన విముఖత చూపుతున్నట్టు సభ్యులు తెలిపారు.
సీనియర్ న్యాయవాదులతో కమిటీ
ఈ ఘటనకు సంబంధించి సమగ్రంగా చర్చించి చట్టపరమైన చర్య తీసుకునేందుకు సీనియర్ న్యాయవాదులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఘటన పూర్వపరాలు పరిశీలించి తదుపరి కార్యాచరణ నిర్ణయించాలని అసోసియేషన్ తీర్మానం చేసింది. కమిటీలో జీవీకే రామారావు, వడ్డి రామానుజరావు, అందే బాపన్న, కొమాండూరి శ్రీనివాస్, కానూరి స్వామినాయుడు, పోలిశెట్టి రఘురామారావు, ఇతర సీనియర్ న్యాయవాదులు, ప్రస్తుత, పూర్వ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సభ్యులుగా ఉంటారు.
19న విధుల బహిష్కరణ
ఎమ్మెల్యే మాధవనాయుడు న్యాయమూర్తిపై నడిరోడ్డుపై వాగ్వాదానికి దిగిన ఘటనను నిరసిస్తూ ఈనెల 19న జిల్లావ్యాప్తంగా న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలోని అన్ని బార్ అసోసియేషన్‌లకు సమాచారం అందించామన్నారు. ఆ రోజు పట్టణంలో నల్లబ్యాడ్జీలు ధరించి, మౌన ప్రదర్శన నిర్వహించి రెవెన్యూ డివిజనల్ అధికారికి వినతిపత్రాన్ని అందించాలని బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కూడా నిరసన తెలియజేయాలని నిర్ణయం తీసుకున్నారు.
సుప్రీంకోర్టు దృష్టికి..
స్వాతంత్య్ర దినోత్సవం రోజున జరిగిన ఘటన న్యాయవ్యవస్థపై జరిగిన దాడిగా పరిగణిస్తూ శాసనసభ్యుని దురుసు ప్రవర్తనను సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టు, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్, ఎన్నికల కమిషన్, న్యాయశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు వినతిపత్రాలు పంపినట్లు బార్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.