నా పదవి మీ సేవకే : రోజా

MLA Roja Distribute Loans Checks in Nagari Chittoor - Sakshi

మహిళలకు 20.39 కోట్లు వడ్డీలేని రుణాల పంపిణీ

నియోజకవర్గంలో ఏపీఐఐసీ ద్వారా పారిశ్రామికాభివృద్ధి

నగరి : ‘నా పదవి మీ సేవకే.. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ప్రగతిపథంలో నడిపిస్తా.. అదే సమయంలో నగరి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టిస్తా..’ అని ఏపీఐఐసీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. సోమవారం స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కమిటీ యార్డులో గ్రామీణాభివృద్ధి సంస్థ స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నియోజకవర్గంలోని స్వయం సహాయక సంఘాలకు రూ.20.39 కోట్లు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలా రుణమాఫీ పేరుతో అందలమెక్కి మోసం చేసే నైజం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిది కాదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా రుణాల మాఫీకి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

మహిళాభివృద్ధిని ఆకాంక్షించే నేతల్లో సీఎం ముందుంటారని, నామినేటెడ్‌ పోస్టుల్లో, కాంట్రాక్టుల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించడమే అందుకు నిదర్శనమని అన్నారు. మహిళా సంఘాల ద్వారా వైఎస్సార్‌ బీమా కింద ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు సహజ మరణం పొందితే 50 సంవత్సరాల లోపు వారికి రూ.2 లక్షలు అందించనున్నారన్నారు. నియోజకవర్గంలోని పాదిరేడు, విజయపురం కోశల నగరంలో రెండువేల ఎకరాలు పరిశ్రమలకు కేటాయించామని తెలిపారు. ఆయా ప్రాం తాల్లో 300 కంపెనీలు నిర్మిస్తారని, తద్వారా పలువురికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. అంతకుముందు ధరల స్థిరీకరణ నిధితో చేపట్టాల్సిన కార్యక్రమాలపై వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధికారులతో ఆమె చర్చించారు. రూ.5 కోట్లతో రైతులకు సంబంధించి అభివృద్ధి పనులు చేపట్టనున్నామన్నారు. డీపీఎం లోకనాథం, తహసీల్దార్‌ బాబు, ఎంపీడీఓ రామచంద్రయ్య, మార్కెట్‌ కమిటీ కార్యదర్శి టి.కుమార్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చక్రపాణి రెడ్డి, రైతు సంఘం నాయకులు లక్ష్మీపతిరాజు, బూత్‌ కమిటీ ఇన్‌చార్జి చంద్రారెడ్డి, సహకార బ్యాంకు చైర్మన్‌ తిరుమలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top