ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం

MLA Mekapati Goutham Reddy Fair On TDP Leaders Nellore - Sakshi

చేజర్ల (నెల్లూరు): ప్రజాక్షేత్రంలో ఉంటూ నిత్యం ప్రజాసేవకే అంకితమై సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న తనను టీడీపీ అధికార దర్పంతో, బెదిరింపులతో, పోలీస్‌ అరెస్ట్‌లతో ఆపలేదని, ప్రజాదీవెనే తనకు కొండంత అండ అని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. మంగళవారం చేజర్ల మండలంలోని మాముడూరు, నడిగడ్డ అగ్రహారం గ్రామాల్లో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలిరెడ్డి సుధాకర్‌రెడ్డి, సర్పంచ్‌ బాలిరెడ్డి రమాదేవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి గ్రామానికి వచ్చారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డిని ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయులురెడ్డి ఆధ్వర్యంలో భారీగా పోలీసు బృందాలు మోహరించి ఎమ్మెల్యే కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు.

తాను రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధినని, గ్రామంలో పర్యటించి తీరుతానని, తనను అడ్డగిస్తే చూస్తూ ఊరుకోబోనని ఎమ్మెల్యే ముందుకుసాగారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ హిట్లర్‌ పాలన కొనసాగిస్తూ నియంతగా వ్యవహరిస్తోందన్నారు. సాక్షాత్తు అధికారులే గ్రామంలో ప్రోటోకాల్‌ ప్రకారం శిలాపలకాలు వేయించి ప్రారంభం తేదీ నిర్ణయించిన తరువాత అధికారపార్టీ నాయకులకు తలొగ్గి తిరిగి వారే పోలీసులకు ఫిర్యాదు చేయడం, పర్యటనను అడ్డుకోవాలని చెప్పడం దారుణమన్నారు. అధికారులు టీడీపీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కనీసం 14వ ఆర్థిక సంఘం నిధులతో మామూడూరు నడిగడ్డ అగ్రహారం గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్లు కూడా సర్పంచ్‌లతో ప్రారంభించకుండా అధికారులు అడ్డుపడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థమవుతోందని అన్నారు.
 
జన్మభూమి కమిటీల పెత్తనం
టీడీపీ హయాంలో సర్పంచ్‌లను ఉత్సవమూర్తులుగా చేసి జన్మభూమి కమిటీ సభ్యులతో గ్రామాల్లో అధికారపార్టీ నాయకులు పెత్తనం చెలాయిస్తున్నారని, సంక్షేమ పథకాలను అర్హులకు అందజేయకుండా వారి అనుచరులకే ఇస్తూ పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని, తాను ప్రజాసేవ చేసేందుకు తనకిష్టమొచ్చిన ప్రాంతంలో పర్యటిస్తానని, అడిగే హక్కు ఎవరికీ లేదని అన్నారు. శిలాపలకాలపై పేర్లు వేయించుకోవడం కాదని, నాయకులు ప్రజల గుండెల్లో అభిమానం సంపాదించుకోవాలని అన్నారు. అధికారులు ప్రోటోకాల్‌ సాకుతో ఈ విధంగా చేయడం, భారీగా పోలీసులు మోహరించడం సరికాదని, ఇది ముమ్మాటికి అధికార దుర్వినియోగమేనని అన్నారు. ప్రత్యేక హోదా కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం తన తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. రాజ్యాంగంపై తమకు పూర్తి నమ్మకముందని, రాజ్యాంగాన్ని, వ్యవస్థను ధిక్కరించి తామెప్పుడూ ఏ కార్యక్రమాలకు హాజరుకాలేదని అన్నారు. అధికారులు ఇకనైనా తీరు మార్చుకోకుంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులకు గురవుతారని హెచ్చరించారు.

గ్రామాభివృద్ధిని ఓర్వలేకనే అధికారులపై ఒత్తిడి
సర్పంచ్‌ బాలిరెడ్డి రమాదేవి మాట్లాడుతూ గ్రామాల్లో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేను ఆహ్వానిస్తే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు గ్రామాభివృద్ధిని ఓర్వలేకనే అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి గ్రామంలో ఇలా అలజడి సృష్టించారన్నారు. తనపైన, తమ భర్త బాలిరెడ్డి సుధాకర్‌రెడ్డిపైన గ్రామ ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారని, గ్రామాభివృద్ధికి తమ కుటుంబం ఎల్లవేళలా కృషి చేస్తుందని తెలిపారు. అధికార పార్టీ నాయకులు ఎన్ని బెదింపులకు పాల్పడినా బెదిరేది లేదని, మేకపాటి గౌతమ్‌రెడ్డి విజయం కోసం తమ శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు. సాక్షాత్తు అధికారులే ప్రోటోకాల్‌ ప్రకారం శిలాపలకాలు తయారుచేయించి ప్రారంభం తేదీ నిర్ణయించి తిరిగి అధికారులే ఇలా అడ్డుకోవడం సరికాదని, ప్రజలు అంతా గమనిస్తూ ఉన్నారన్నారు.

ఇకనైనా అధికారపార్టీ నాయకులు తీరు మార్చుకోకుంటే భవిష్యత్తులో గ్రామ ప్రజల ఆగ్రహావేశాలకు గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలిరెడ్డి సుధాకర్‌రెడ్డి, మండల కన్వీనర్‌ తూమాటి విజయభాస్కర్‌రెడ్డి, ఆత్మకూరు పట్టణ అధ్యక్షుడు అల్లారెడ్డి ఆనందరెడ్డి, సంగం మండల కన్వీనర్‌ కంటాబత్తిన రఘునాథరెడ్డి, ఏఎస్‌పేట మండల మహిళా కన్వీనర్‌ బోయళ్ల పద్మజారెడ్డి, ఆత్మకూరు యువత అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్‌రెడ్డి, సర్పంచ్‌ బాలిరెడ్డి రమాదేవి, ఎంపీటీసీలు గిరిధర్‌రెడ్డి, గణేష్, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు పూనూరు బాలకృష్ణారెడ్డి, బోయళ్ల చెంచురెడ్డి, సుందరరామిరెడ్డి, నోటి వినయ్‌కుమార్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, సుధాకర్‌రెడ్డి, భాçస్కర్‌రెడ్డి, రమణారెడ్డి, రఫీ, రమణయ్య, కోటయ్య, వెంకటేశ్వర్లురెడ్డి, కృష్ణారెడ్డి, వేణు, జయంతిరెడ్డి, యానాదిరెడ్డి, ప్రసాద్, పాపిరెడ్డి, కాలేషా తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top