కదం తొక్కిన కార్మికులు

Metkore Alloys Works Protest In Srikakulam - Sakshi

టెక్కలి (శ్రీకాకుళం): డివిజన్‌ కేంద్రమైన టెక్కలిలో రావివలస మెట్‌కోర్‌ ఎల్లాయ్‌సెస్‌ పరిశ్రమ కార్మికులు కదం తొక్కారు. తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. కార్మికుల నిరసనకు వైఎస్సార్‌ సీపీ నాయకులు మద్దతు పలికారు. సుమారు 200 మంది కార్మికులు అర్ధనగ్నంగా పరిశ్రమ నుంచి ర్యాలీ ప్రారంభించి ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని తమ న్యాయపరమైన సమస్యలపై నినాదాలు చేశారు. అనంతరం స్థానిక అంబేడ్కర్‌ కూడలిలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ 2015 సంవత్సరంలో రావివలస మెట్‌కోర్‌ ఎల్లాయ్‌సెస్‌ పరిశ్రమకు లాకౌట్‌ ప్రకటించారని అప్పటి నుంచి మంత్రి అచ్చెన్నాయుడు చుట్టూ తిరుగుతున్నప్పటికీ తమ సమస్యలను పరిష్కరించకుండా మమ్మల్ని రోడ్డున పడేశారంటూ కార్మికులు వాపోయారు.

సుమారు మూడేళ్లుగా ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ తమను విస్మరిస్తున్నారంటూ కార్మికులు వాపోయారు. తక్షణమే తమకు రావాల్సిన 20 నెలల వేతనాలు, 4 సంవత్సరాల పీఎఫ్‌ బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అలాగే పరిశ్రమను తక్షణమే తెరిపించాలని లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. అనంతరం వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌ మాట్లాడుతూ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా పదవి చేపట్టిన తర్వాత రావివలస పరిశ్రమను మూత వేశారని ఆరోపించారు. అప్పటి నుంచి కార్మికులు నడిరోడ్డున పడినప్పటికీ అచ్చెన్నాయుడుకు కనీసం కార్మికులను ఆదుకోవాలనే ఆలోచన రాకపోవడం భాదాకరమన్నారు.

రావివలస మెట్‌కోర్‌ పరిశ్రమ యాజమాన్యం నుంచి అచ్చెన్నాయుడు తాయిలాలు అందుకున్నారని అందుకే సుమారు 300 మంది కార్మికులకు అన్యాయం చేశారని ఆరోపించారు. కార్మికుల పక్షాన పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వారికి న్యాయం చేయకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామంటూ తిలక్‌ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు జి.గురునాథ్‌ యాదవ్, టి.కిరణ్, చిన్ని జోగారావు, శ్యామలరావు, మదీన్‌తో పాటు జనసేనా కార్యకర్త ఎ.శ్రీధర్, అధిక సంఖ్యలో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top